‘లైలా’ను టార్గెట్ చేయడం.. మంచికేనా?

మూడు రోజుల ముందు జరిగిన ‘లైలా’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో కమెడియన్ పృథ్వీ చేసిన ‘151 గొర్రెలు.. 11 గొర్రెలు’ కామెంట్ సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపింది.

Update: 2025-02-12 14:30 GMT

మూడు రోజుల ముందు జరిగిన ‘లైలా’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో కమెడియన్ పృథ్వీ చేసిన ‘151 గొర్రెలు.. 11 గొర్రెలు’ కామెంట్ సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపింది. పృథ్వీ ఎంత కవర్ చేసే ప్రయత్నం చేసినా.. ఇది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎద్దేవా చేయడంలో భాగమే అనడంలో సందేహం లేదు. అసలే ఓటమి బాధ నుంచి ఇంకా కోలుకోలేకపోతున్న వైసీపీ వారికి ఈ కామెంట్ మండేలా చేసింది.

దీంతో సోషల్ మీడియా వేదికగా పృథ్వీని టార్గెట్ చేసే క్రమంలో ‘లైలా’ సినిమా మీద పడిపోయారు. ‘బాయ్‌కాట్ లైలా’ అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టి రెండు రోజులు ఆ సినిమాను డీగ్రేడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై హీరో విశ్వక్సేన్, నిర్మాత సాహు గారపాటి కలిసి ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చినా.. విశ్వక్ సారీ కూడా చెప్పినా కూడా వైసీపీ ఫ్యాన్స్ తగ్గట్లేదు.

విశ్వక్ వివరణలో లోపాలు వెతుకుతూ.. అలాగే విశ్వక్ మిడిల్ ఫింగర్ చూపిస్తున్న ‘లైలా’ పోస్టర్లను చూపిస్తూ అతణ్ని, సినిమాను మరింతగా టార్గెట్ చేస్తూనే ఉన్నారు. బాయ్‌కాట్ లైలా.. బాయ్‌కాట్ లైలా అంటూ ఊగిపోతున్నారు. సినిమా ఎలా ఆడుతుందో చూస్తాం అంటూ తొడగొడుతున్నారు.

ఐతే బాలీవుడ్లో ఇలాంటి బాయ్‌కాట్ ఉద్యమాలు ఎలా శ్రుతి మించి.. వికటించాయో తెలిసిందే. మరీ ఎక్కువ టార్గెట్ చేయాలని చూస్తే ఏం జరుగుతుందో ‘పఠాన్’ లాంటి సినిమాలు రుజువు చేశాయి. జనాలకు ఈ బాయ్‌కాట్ స్లోగన్లు చిరాకు తెప్పించి, షారుఖ్ మీద సానుభూతి పెరిగి.. ఆ సినిమా అవ్వాల్సిన దాని కంటే పెద్ద హిట్ అయింది. దీంతో బాయ్‌కాట్ బ్యాచ్ నోళ్లు మూతపడ్డాయి.

ఇప్పుడు ‘లైలా’ విషయంలో అలాగే జరిగినా ఆశ్చర్యం లేదు. సారీ చెప్పాక కూడా సినిమా చంపేస్తాం అంటూ వార్నింగ్‌లు ఇస్తే.. మిగతా వర్గాల నుంచి ‘లైలా’ మద్దతు లభించడం ఖాయం. అసలిక్కడ వైసీపీ బ్యాచ్.. ‘లైలా’కు ఫ్రీ పబ్లిసిటీ ఇస్తోందనే చర్చ కూడా జరుగుతోంది. పెద్దగా హైప్ లేని ఈ సినిమా గురించి మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఇంత చర్చ జరిగేలా చేసి, బజ్ పెరగడానికి కారణం వైసీపీ వాళ్లే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమాలో కంటెంట్ ఉన్నట్లయితే సినిమా పెద్ద హిట్ అయి కూర్చున్నా ఆశ్చర్యం లేదు. అదే సమయంలో సినిమాలో విషయం లేకపోతే.. వైసీపీ వాళ్లు దాన్ని ప్రత్యేకంగా తొక్కడం అంటూ ఏమీ ఉండదు. అదే చతికిలపడుతుంది.

Tags:    

Similar News