మృణాల్ డైల‌మా: ఇదే మొద‌టిది.. ఇదే చివ‌రిది

అందం, న‌ట‌న మాత్ర‌మే ఉంటే స‌రిపోదు. క‌థానాయిక‌గా ఎద‌గాలంటే ఇంకా చాలా క్వాలిటీస్ ఉండాలి.;

Update: 2025-03-24 03:48 GMT

అందం, న‌ట‌న మాత్ర‌మే ఉంటే స‌రిపోదు. క‌థానాయిక‌గా ఎద‌గాలంటే ఇంకా చాలా క్వాలిటీస్ ఉండాలి. ముంబై లేదా ఇత‌ర మెట్రో న‌గ‌రాల నుంచి హైద‌రాబాద్ ప‌రిశ్ర‌మ‌కు వ‌చ్చే క‌థానాయిక‌ల‌కు భాష అతి పెద్ద స‌మ‌స్య‌. తెలుగు నేర్చుకోవ‌డం అంత సులువు కాద‌ని చాలామంది భామ‌లు భ‌య‌ప‌డుతుంటారు. త్రిష లాంటి సీనియ‌ర్ క‌థానాయిక ఇప్ప‌టికీ తెలుగు నేర్చుకోలేక‌పోయారంటే అర్థం చేసుకోవాలి.

అయితే తన‌కు తెలుగు భాష తెలియ‌క‌పోవ‌డం వ‌ల్ల ఒకే ఒక్క తెలుగు సినిమాలో న‌టించి ఆ త‌ర్వాత ఈ ప‌రిశ్ర‌మ‌ను వ‌దిలేయాల‌ని భావించిన‌ట్టు మృణాల్ ఠాకూర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు... కేవ‌లం దుల్కార్ స‌ల్మాన్ ప్రోద్భ‌లంతోనే తెలుగు చిత్ర‌సీమ‌తో పాటు, ద‌క్షిణాదిన ఇత‌ర భాషా చిత్రాల్లోను న‌టిస్తున్నాన‌ని అన్నారు. నెమ్మ‌దిగా తెలుగు నేర్చుకున్నాన‌ని, ఇప్పుడు మ‌ల‌యాళం, క‌న్న‌డ‌లోను న‌టించే దిశ‌గా అడుగులు వేస్తున్నాన‌ని తెలిపింది.

దుల్కర్ సల్మాన్ - సీతా రామం, నాని - హాయ్ నాన్న స‌హా ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో మృణాల్ న‌టించింది. ఈ భామ‌కు తెలుగు ప‌రిశ్ర‌మ గొప్ప గుర్తింపును దాంతో పాటే విజయాల‌ను క‌ట్ట‌బెట్టింది. అందువ‌ల్ల ఈ ప‌రిశ్ర‌మ‌ను ఎప్ప‌టికీ విడిచిపెట్టేందుకు అవ‌కాశం లేదు. న‌టించిన ఆరంభ సినిమాతోనే మృణాల్ వంద కోట్ల క్ల‌బ్ హీరోయిన్ అయింది. సీతారామం 100 కోట్లు వ‌సూలు చేయ‌గా, హాయ్ నాన్న 74 కోట్లు వ‌సూలు చేసిన సంగ‌తి తెలిసిందే.

మహారాష్ట్రకు చెందిన మృణాల్ 2014లో మరాఠీ చిత్రం `విట్టి దండు`తో సినీకెరీర్ ను ప్రారంభించింది. 2018లో లవ్ సోనియా చిత్రంతో హిందీలోకి అడుగుపెట్టింది. కానీ తెలుగులో పెద్ద స్టార్ గా ఎదిగి ఇప్పుడు మ‌ళ్లీ త‌న మూలాల్లో పెద్ద సినిమాల్లో న‌టిస్తూ బిజీ అయింది.

అస‌లు తెలుగులో న‌టించాల‌నుకోక‌పోవ‌డానికి కార‌ణం లిప్ సింక్ కుద‌ర‌ద‌నే భ‌యం. ప్ర‌తి చిన్న విష‌యాన్ని అర్థం చేసుకోవ‌డానికి తాను స్వ‌యంగా డ‌బ్బింగ్ చెప్పాల‌నుకున్నాన‌ని కూడా తెలిపింది. కానీ తెలుగు భాషలో లిప్-సింక్ చేయడం తనకు చాలా కష్టమని కూడా వెల్లడించింది. భాష తెలియ‌క‌పోతే నేను విక‌లాంగురాలిని అనిపిస్తుంద‌ని కూడా మృణాల్ అన్నారు. భాష రాక‌పోవ‌డం నన్ను అశాంతిలోకి నెట్టింది. నేను ఈ ప‌రిశ్ర‌మ‌ను వదులుకోవాలనుకున్నాను. నేను ఏడ్చాను.. కానీ ప్రతి కన్నీటి చుక్క నా మార్గంలో ప్రశంసలను తెచ్చిపెట్టింది.. అని మృణాల్ గుర్తు చేసుకుంది.

సీతా రామం సహనటుడు దుల్కర్ సల్మాన్‌ను ఈ సంద‌ర్భంగా మృణాల్ అభినందించింది. అతడు మొదట మలయాళ చిత్ర పరిశ్రమకు చెందినవాడు కానీ దక్షిణాన ఇత‌ర భాష‌ల్లో, అలాగే బాలీవుడ్‌లోను అడుగుపెట్టాడు. కాశ్మీర్‌లో షూటింగ్ చేస్తున్నప్పుడు సీతా రామం నా మొదటి - చివరి తెలుగు సినిమా అవుతుందని నేను చెప్పాను. ఇకపై తెలుగులో సినిమాలు చేయన‌ని అన్నాను. దుల్కార్ నన్ను చూసి `చూద్దాం` అని అన్నారు. ఈ రోజు నేను తమిళం లేదా కన్నడలోకి వెళ్లాలని ఆలోచిస్తున్నందుకు కారణం ఆయన నాకు నమ్మకం కలిగించడమేన‌ని గుర్తు చేసుకున్నారు.

మృణాల్ ఠాకూర్ హిందీలో యాక్షన్ కామెడీ చిత్రం `సన్ ఆఫ్ సర్దార్ 2`లో కనిపించనుంది. తదుపరి తెలుగు ప్రాజెక్ట్ `డెకాయిట్: ఎ లవ్ స్టోరీ`లో క‌నిపిస్తుంది. షానియల్ డియో ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో అడివి శేష్, మృణాల్ ఠాకూర్, అనురాగ్ కశ్యప్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Tags:    

Similar News