పేరుకే 24 సినిమాలు.. ఒక్కటంటే ఒక్క పెద్ద హిట్ లేదు!
టాలీవుడ్ కు నవంబర్ నెల కలిసిరాదనే ఓ బ్యాడ్ సెటిమెంట్ ఇండస్ట్రీలో చాలా ఏళ్లుగా ఉంది.
టాలీవుడ్ కు నవంబర్ నెల కలిసిరాదనే ఓ బ్యాడ్ సెటిమెంట్ ఇండస్ట్రీలో చాలా ఏళ్లుగా ఉంది. దసరా హాలిడేస్ లో సినిమాలు చూసేసినీ ఆడియన్స్.. ఆ వెంటనే సినీ వినోదం కోసం ఖర్చు పెట్టడానికి ఆలోచిస్తారని ఫిలిం మేకర్స్ భావిస్తుంటారు. అందుకే ఈ నెలలో పెద్ద సినిమాలు చాలా తక్కువగా రిలీజ్ అవుతుంటాయి. స్టార్ హీరోలంతా క్రిస్మస్, సంక్రాంతి స్లాట్స్ కోసం ప్రయత్నిస్తుంటారు కానీ.. నవంబరులో రావడానికి ఆసక్తి కనబరచరు. గత కొన్నేళ్లుగా ఈ నెలలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాలేవీ లేవు. 12 ఏళ్ళ క్రితం వచ్చిన 'ఢమరుకం' మూవీ ఇప్పటికీ నవంబరులో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డుల్లో ఉందంటేనే అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది కూడా తెలుగు చిత్ర పరిశ్రమకు నవంబర్ అచ్చిరాలేదనే చెప్పాలి.
దీపావళి పండుగ సందర్భంగా అక్టోబర్ నెలాఖరున రిలీజై బ్లాక్ బస్టర్ విజయాలు సాధించిన ‘లక్కీ భాస్కర్’, ‘క’, ‘అమరన్’ చిత్రాలు.. నవంబర్ మొదటి వారంలోనూ బాక్సాఫీస్ దగ్గర హవా కొనసాగించాయి. నవంబర్ 7, 8 తేదీలలో ఏకంగా 11 సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. వాటిల్లో నిఖిల్ సిద్దార్థ నటించిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ మూవీ కూడా ఉంది. పెద్దగా ప్రచారం లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. మొదటి రోజే నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. దీనికి తగ్గట్టుగానే పూర్ ఓపెనింగ్స్ సాధించింది. మంచు లక్ష్మి 'ఆదిపర్వం', హెబ్బా పటేల్ 'ధూం ధాం' సినిమాలు కూడా ఈ వీక్ లోనే వచ్చాయి. పరాజయం పాలయ్యాయి. ఇక 'జితేందర్ రెడ్డి', 'బ్లడీ బెగ్గర్', ‘జాతర’, ‘ఈసారైనా?!’, ‘రహస్యం ఇదం జగత్’ 'జెవెల్ థీఫ్', 'వంచన' 'ది షార్ట్ కట్' వంటి తెలుగు, డబ్బింగ్ చిత్రాలను జనాలు పెద్దగా పట్టించుకోలేదు.
నవంబర్ 14న 'మట్కా', 'కంగువ' లాంటి పాన్ ఇండియా సినిమాలు రిలీజయ్యాయి. డైరెక్టర్ కరుణ కుమార్ తో కలిసి మెగా హీరో వరుణ్ తేజ్ ఈసారి తప్పకుండా హిట్టు కొడతాడని అందరూ భావించారు. ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేసారు. కానీ ఇది మినిమమ్ ఓపెనింగ్స్ కూడా రాబట్టలేక, వరుణ్ కెరీర్ లోనే భారీ డిజాస్టర్ గా మారింది. మరోవైపు భారీ అంచనాలతో విడుదలైన 'కంగువ' మూవీ ఘోర పరాజయం చవిచూసింది. సూర్య హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడిక్ ఫాంటసీ సినిమాకి తొలి రోజే మిక్స్డ్ టాక్ వచ్చింది. రెండో రోజు నుంచి పికప్ అవుతుందని అనుకున్నారు కానీ, బాక్సాఫీస్ వద్ద డిజప్పాయింట్ చేసింది. తమిళ చిత్ర పరిశ్రమ కల అయిన 1000 కోట్ల క్లబ్ కలగానే మిగిలిపోయింది. ఇదే వారంలో తెలుగులోకి వచ్చిన ‘గ్లాడియేటర్ 2’ గురించి ఎవరూ మాట్లాడుకోలేదు.
నవంబర్ 22న 'మెకానిక్ రాకీ', 'దేవకీ నందన వాసుదేవ', 'జీబ్రా' 'కేసీఆర్' లాంటి సినిమాలు విడుదలయ్యాయి. విశ్వక్ సేన్ నటించిన 'మెకానిక్ రాకీ' మూవీపై ఆడియన్స్ లో ఆసక్తి కలిగింది. సెకండాఫ్ బాగున్నప్పటికీ, ఫస్టాఫ్ రొటీన్ గా ఉందనే కామెంట్స్ వచ్చాయి. దీంతో విశ్వక్ గత చిత్రాల కంటే చాలా తక్కువ ఓపెనింగ్స్ తెచ్చుకుంది. ప్రశాంత్ వర్మ కథతో, మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా నటించిన 'దేవకీ నందన వాసుదేవ' ప్రేక్షకులను నిరాశ పరిచింది. వీటితో పాటుగా రిలీజైన సత్యదేవ్ 'జీబ్రా' ఉన్నంతలో నిలబడగలిగింది. ఫస్ట్ డే మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ, రోజు రోజుకూ కలెక్షన్స్ పెంచుకుంటూ ముందుకుసాగుతోంది. ఈ మూవీ మొదటి రోజు కంటే 8వ రోజు ఎక్కువ వసూళ్లు సాధించడం విశేషం. రాకింగ్ రాకేష్ నటించిన 'కేసీఆర్ - కేశవ చంద్ర రమావత్' సినిమా ఓ వర్గం ప్రేక్షకులను అలరించింది.
నవంబర్ చివరి వారంలో 'రోటి కపడా రొమాన్స్' అనే చిన్న సినిమా వచ్చింది. దీనికి మంచి టాక్ వచ్చింది. అయితే అప్పటికే 'పుష్ప 2' హడావిడి మొదలవడంతో ఈ మూవీ టాక్ జనాల్లోకి వెళ్ళలేదు. ఇదే నెలలో 'సినిమా పిచ్చోడు' 'కాలమా ఈ కన్నీలెందుకే' 'కనకమహాలక్ష్మి' 'మందిరా', 'తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి' లాంటి చిన్నా చితకా చిత్రాలు వచ్చాయి కానీ.. అవి వచ్చాయనే సంగతి తెలియకుండానే వెళ్లిపోయాయి. ఇలా ఓవరాల్ గా 24 సినిమాలు రిలీజైనా, ఒక్క పెద్ద హిట్ కూడా లేకుండానే నవంబర్ బాక్సాఫీస్ ముగిసిపోయింది. అక్టోబర్ చివర్లో వచ్చిన సినిమాలకు.. సత్యదేవ్ కు మాత్రమే ఈ నెల కాస్త కలిసొచ్చిందని అనుకోవాలి. మరి డిసెంబర్ నెల టాలీవుడ్ కు ఎలా ఉంటుందో చూడాలి.