ఓటీటీ డీల్స్.. వాళ్ళకో పెద్ద టెన్షన్!

గత కొన్నేళ్ల నుంచి సినిమాలకి థీయాట్రికల్ తో పాటు నాన్ థీయాట్రికల్ మార్కెట్ లో కూడా మంచి వ్యాపారం జరుగుతోంది

Update: 2024-04-03 03:45 GMT

గత కొన్నేళ్ల నుంచి సినిమాలకి థీయాట్రికల్ తో పాటు నాన్ థీయాట్రికల్ మార్కెట్ లో కూడా మంచి వ్యాపారం జరుగుతోంది. డిజిటల్ స్ట్రీమింగ్ ఛానల్స్ అందుబాటులోకి వచ్చిన తర్వాత నిర్మాతలు చాలా వరకు సేఫ్ అవుతున్నారు. ఒకప్పుడు నాన్ థీయాట్రికల్ అంటే శాటిలైట్ రైట్స్ రూపంలో మాత్రమే సినిమాలకి అదనంగా డబ్బులు వచ్చేవి. మిగిలిన పెట్టుబడి మొత్తం థియేటర్స్ నుంచి రాబట్టుకోవాల్సిందే.

అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. స్టార్ హీరోల సినిమాలకు అయితే షూటింగ్ స్టార్ట్ కాకముందే కాంబినేషన్స్ ను బట్టి ఓటీటీ సంస్థలు ఎగబడి ఆఫర్లు కురిపిస్తున్నాయి. మీడియం రేంజ్ సినిమాలకి మాత్రం పాజిటివ్ బజ్ ను బట్టి ఓటీటీ డీల్స్ సెట్ చేసుకుంటున్నాయి. చిన్న సినిమాలకి అయితే థియేటర్స్ లో రిలీజ్ తర్వాత వచ్చే ఆదరణ బట్టి ఓటీటీ ఛానల్స్ ఫ్యాన్సీ రేట్ ఆఫర్ చేస్తూ రైట్స్ దక్కించుకుంటున్నాయి.

ఇలా ఓటీటీతో ఒప్పందం చేసుకుంటున్న సినిమాల నిర్మాతలు కొన్నిసార్లు ఆయా సంస్థలు పెట్టే కండిషన్స్ కి ఒకే చెప్పేస్తున్నారు. థియేటర్స్ లో రిలీజ్ అయిన మూడు, నాలుగు వరాల గ్యాప్ లో ఓటీటీలో రిలీజ్ చేసుకోవడానికి పర్మిషన్స్ ఇచ్చేస్తున్నారు. మరోవైపు ఓటీటీ డీల్స్ కారణంగా సినిమాలని భారీ ధరకి కొనుగోలు చేస్తోన్న బయ్యర్లు దారుణంగా నష్టపోతున్నారు.

ఒకప్పుడు సినిమాకి ఏవరేజ్ టాక్ వచ్చిన కనీసం ఐదు వారల పాటు థియేటర్స్ లో డీసెంట్ కలెక్షన్స్ వచ్చేవి. దీంతో బయ్యర్లు పెట్టిన పెట్టుబడి రికవరీ అయిపోయేది. ఇప్పుడు మూడు వారాల్లోనే కొత్త సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తూ ఉండటంతో సూపర్ హిట్ టాక్ వస్తేనే ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్తున్నారు. ఏవరేజ్ టాక్ వచ్చిందంటే వీకెండ్ పూర్తయ్యేసరికి థియేటర్స్ ఖాళీ అయిపోతున్నాయి.

ఈ కారణంగా బయ్యర్లు దారుణంగా నష్టపోతున్నారు. ఓటీటీ ఛానల్స్ థియేటర్స్ ఆడియన్స్ ని తమవైపుకి డైవర్ట్ చేసుకోవడంతో కలెక్షన్స్ పడిపోతున్నాయి. ప్రస్తుతం సినిమాలకి బాగుందనే టాక్ వచ్చిన కూడా కొన్ని థియేటర్స్ లో బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ సాధించలేకపోతున్నాయి. దీనికి ఓటీటీ మార్కెట్ కారణం అని బయ్యర్ల నుంచి వినిపిస్తోన్న మాట. బాలీవుడ్ లో 8 వారాల గ్యాప్ తో ఓటీటీలో రీరిలీజ్ చేసేందుకు ఒప్పందం చేసుకుంటున్నారు.

దీంతో థియేటర్స్ లో కూడా ఆ సినిమాలకి లాభాలు వస్తున్నాయి. అయితే సౌత్ సినిమాల నిర్మాతలు ముందుగానే పెట్టుబడి రికవరీ చేసుకోవడానికి ఓటీటీ సంస్థలు పెట్టే కండిషన్స్ కి ఒకే చెప్పేస్తున్నారు. ఈ కండిషన్స్ కారణంగా బయ్యర్లు నష్టపోతున్నారు. ఓటీటీ డీల్స్ విషయంలో హిందీ చిత్ర పరిశ్రమని అనుసరిస్తేనే థియేటర్స్ బిజినెస్ మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.

Tags:    

Similar News