రాజాసాబ్.. ఇంకెన్ని స‌ర్‌ప్రైజ్‌లు ప్లాన్ చేశాడో!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ''ది రాజాసాబ్''.

Update: 2024-10-23 11:31 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ''ది రాజాసాబ్''. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రభాస్ ఫస్ట్ లుక్ అండ్ గ్లింప్స్ రిలీజ్ అయ్యాయి. ఇటీవల గళ్ల చొక్కా, నల్ల కళ్లద్దాలతో డార్లింగ్ స్టైలిష్ లుక్ ను కూడా పంచుకున్నారు. ఈరోజు రెబల్ స్టార్ బర్త్ డే స్పెషల్ గా మోషన్ పోస్టర్ ను లాంచ్ చేసిన మేకర్స్.. ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చారు. సినిమాలో ప్రభాస్ రెండో లుక్ ను రివీల్ చేసి స‌ర్‌ప్రైజ్‌ చేసారు.

ఇప్పటి వరకూ 'రాజా సాబ్'లో ప్రభాస్ ను స్టైలిష్ లుక్ లో చూపించిన మారుతి.. ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా ఏజ్డ్ పర్సన్ లా చూపించి ఆశ్చర్యపరిచాడు. ఇందులో ప్రభాస్ తెల్లటి గడ్డం, నెరిసిన జుట్టుతో ఎప్పుడూ చూడని విధంగా సరికొత్తగా కనిపించారు. నల్లటి వస్త్రాలు, ఒంటినిండా ఆభరణాలు ధరించి ఒక రాజులా ఉన్నారు. నోట్లో సిగార్ తో ఠీవీగా సింహాసనం మీద కూర్చొని రాజసం ప్రదర్శించారు. ఊహించని ఈ లుక్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

హారర్, కామెడీ ఎలిమెంట్స్ తో రొమాంటిక్ సూపర్ నేచురల్ థ్రిల్లర్ గా 'ది రాజాసాబ్' సినిమా రూపొందుతోంది. లేటెస్ట్ గా విడుదలైన మోషన్ పోస్టర్ తో ప్రభాస్ ఈ చిత్రంలో రెండు పాత్రల్లో రెండు డిఫెరెంట్ లుక్స్ లో కనిపించబోతున్నారనే క్లారిటీ వచ్చేసింది. అదే సమయంలో ఎన్నో సందేహాలను కలిగిస్తోంది. ప్రభాస్ తండ్రీకొడులుగా కనిపిస్తారా? లేదా తాతా మనవళ్లుగా కపిస్తారా? ఈ రెండు పాత్రల మధ్య ఎలాంటి సంబంధం ఉండబోతోంది? రెండు పాత్రలు ఒకేసారి స్క్రీన్ మీద కనిపిస్తాయా లేదా? మారుతి ఇంకెన్ని స‌ర్‌ప్రైజ్‌లు దాచాడో? వంటి ప్రశ్నలు వస్తున్నాయి.

రాజాసాబ్ మోషన్ పోస్టర్ లో ఒక దట్టమైన అడవి, ఒక హాంటెడ్ హౌస్, అందులో ఒక రాజాలా ప్రభాస్ ను పరిచయం చేశారు. రాజసం ఉట్టిపడే ఆయన ఫేస్ లో ఎక్స్ ప్రెషన్స్ చూస్తుంటే.. ఈ పాత్రలో కాస్త నెగెటివ్ షేడ్స్ కూడా ఉన్నాయేమో అనిపిస్తుంది. అందుకే అసలు ఈ హారర్ మూవీలో ప్రభాస్ ఒక పాత్రలో గోస్ట్ గా కనిపించబోతున్నారా? అనే సందేహం కూడా కలగక మానదు. వీటన్నిటికీ సమాధానం దొరకాలంటే ఇంకొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.

ఏదైతేనేం ప్రభాస్ తన కెరీర్ లోనే తొలిసారిగా ఇలాంటి రొమాంటిక్ హారర్ కామెడీ జోనర్ మూవీ ట్రై చేస్తున్నారు. అంతేకాదు రెండు భిన్నమైన పాత్రల్లో డిఫరెంట్ లుక్స్ లో కనిపించనున్నారు. ఇందులో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ పై టీజీ విశ్వప్రసాద్‌ ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్. థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. 'ది రాజాసాబ్' సినిమా వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ 10న తెలుగు, హిందీ, తమిళం, మళయాలం, కన్నడ భాషల్లో విడుదల కానుంది.

Tags:    

Similar News