ఇకపై ప్రి రిలీజ్ ఈవెంట్లకు రూల్ బుక్!

సినిమా వాళ్లు రాజకీయాల్లోకి వెళ్లడం, రాజకీయాలపై కామెంట్లు చేయడం.. రాజకీయ నాయకులూ సినిమాలు, ఇక్కడి వ్యక్తుల గురించి మాట్లాడ్డం కామన్

Update: 2025-02-10 10:16 GMT

దక్షిణాదిన సినిమా ఫీల్డుకి, రాజకీయ రంగానికి విడదీయరాని బంధం ఉంది. సినిమా వాళ్లు రాజకీయాల్లోకి వెళ్లడం, రాజకీయాలపై కామెంట్లు చేయడం.. రాజకీయ నాయకులూ సినిమాలు, ఇక్కడి వ్యక్తుల గురించి మాట్లాడ్డం కామన్. అలాగే సినిమాల్లో రాజకీయాల మీద సెటైర్లు వేయడం ఎప్పట్నుంచో ఉన్నదే. కానీ ఈ మధ్య సినిమా వేడుకల్లో రాజకీయాల గురించి మాట్లాడ్డం ట్రెండ్‌గా మారింది. ఇందుకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ ముఖ్య కారణం అని చెప్పాలి. గత వైసీపీ ప్రభుత్వం తన సినిమాలను టార్గెట్ చేసే క్రమంలో మొత్తంగా ఫిలిం ఇండస్ట్రీని టార్గెట్ చేసిన నేపథ్యంలో ‘రిపబ్లిక్’ సినిమా ఈవెంట్లో రాజకీయ వ్యాఖ్యలతో వేడి పుట్టించారు. ఆ తర్వాత పలు సినిమా వేడుకల్లో సినిమా వాళ్లు పొలిటికల్ కామెంట్లు చేయడం చూశాం. ఐతే ఇటీవల ఇది ఒక ఇబ్బందికర పరిణామంగా మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

అసందర్భోచితంగా చేసే పొలిటికల్ కామెంట్ల వల్ల ఒక వర్గంలో సినిమా పట్ల వ్యతిరేకత పెరగడం.. సోషల్ మీడియాలో నెగెటివిటీ స్ప్రెడ్ అయి ఆ చిత్రానికి చేటు జరగడం చూస్తున్నాం. తాజాగా ‘లైలా’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో కమెడియన్ పృథ్వీ ‘151 మేకలు 11 మేకలయ్యాయి’ అంటూ పరోక్షంగా వైసీపీని ఎద్దేవా చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇది ఏమాత్రం అవసరం లేని కామెంట్ అనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఒకప్పుడు వైసీపీలో ఉండి.. తర్వాత ఆ పార్టీకి వ్యతిరేకిగా మారిన పృథ్వీ.. సందర్భం వచ్చినపుడల్లా ఆ పార్టీని టార్గెట్ చేస్తున్నారు. కానీ బయట ఏం మాట్లాడినా ఓకే కానీ.. ఒక సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో సందర్భం లేకుండా ఇలాంటి కామెంట్స్ చేసి వైసీపీ మద్దతుదారులను రెచ్చగొట్టి సినిమాకు వ్యతిరేకంగా పని చేసేలా చేశారనే చర్చ జరుగుతోంది. ఈ కామెంట్ తర్వాత పృథ్వీనే కాక.. లైలా టీంను కూడా వైసీపీ వాళ్లు టార్గెట్ చేస్తున్నారు. ఇది పూర్తిగా అనవసరమైన రచ్చ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారం ఇండస్ట్రీలోనూ చర్చనీయాంశంగా మారింది. ఇకపై సినిమాల ప్రి రిలీజ్, ప్రమోషనల్ ఈవెంట్లలో ఎవ్వరూ రాజకీయ వ్యాఖ్యలు చేయకుండా అంతర్గతంగా మార్గదర్శకాలు విడుదల చేయాలనే చర్చ ఇండస్ట్రీలో జరుగుతున్నట్లు సమాచారం.

Tags:    

Similar News