నాకూ కారు ఈఎంఐ ఉంది
హీరో మోహన్ లాల్, డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఇద్దరూ ప్రమోషన్స్ లో పాల్గొంటూ ఎల్2: ఎంపురాన్‌ను తెగ ప్రచారం చేస్తున్నారు.;
లూసిఫర్ కు సీక్వెల్ గా వస్తోన్న ఎల్2: ఎంపురాన్ సినిమా మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. హీరో మోహన్ లాల్, డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఇద్దరూ ప్రమోషన్స్ లో పాల్గొంటూ ఎల్2: ఎంపురాన్‌ను తెగ ప్రచారం చేస్తున్నారు.
ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్ తన తండ్రి సుకుమారన్ గురించి మాట్లాడారు. తండ్రి నుంచి తానెన్నో విషయాలు నేర్చుకున్నానని, ఆయనకు డైరెక్టర్ అవాలని ఎంతో ఆశగా ఉండేదని, కానీ ఆ ఆశ తీరకముందే చనిపోయారని, ఇవాళ తన సక్సెస్ ను చూడ్డానికి కూడా తండ్రి లేకపోవడం ఎంతో బాధని ఇస్తుందన్న ఆయన, ఇంటి పేరు వల్లే తాను ఇండస్ట్రీలో అంత త్వరగా మంచి క్రేజ్ సంపాదించుకోగలిగానని చెప్పారు.
కేవలం డబ్బు కోసమే ఆశపడి తాను ఎలాంటి సినిమాలు చేయలేదని చెప్పిన పృథ్వీరాజ్ సుకుమారన్, అదే డబ్బు కోసం బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ చేశానని, యాడ్స్ కోసం రెండు గంటలు కేటాయిస్తే ఎక్కువ డబ్బు ఇచ్చేవారని, అందుకే వాటిని చేశానని చెప్పారు. అలాగని ఎలాంటివి పడితే అలాంటి వాటిని తాను ప్రమోట్ చేయనని, నమ్మకం లేని ప్రొడక్ట్స్ విషయంలో అసలు రాజీపడనని, సమాజానికి హాని చేయని ప్రొడక్ట్స్ ను మాత్రమే తాను ప్రమోట్ చేస్తానని చెప్పారు.
డైరెక్టర్ గా మారడమనేది తాను ఫైనాన్షియల్ పరంగా తీసుకున్న తెలివితక్కువ ఆలోచన అని, ఎల్2 కోసం దాదాపు రెండేళ్ల టైమ్ కేటాయించానని, అదే ఆ టైమ్ లో తాను సినిమాల్లో నటించి ఉంటే తనకు బోలెడు డబ్బు వచ్చేదని తెలిపారు పృథ్వీరాజ్. సాధారణ మనుషుల్లానే సెలబ్రిటీలకు కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయని, అందరిలానే తనక్కూడా కార్ ఈఎంఐ ఉందని పృథ్వీరాజ్ వెల్లడించారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ ను ఎంతగానో ఇష్టపడే పృథ్వీరాజ్ ఆయన్ను దర్శకత్వం వహించడమే తన టార్గెట్ అని చెప్తున్నారు. గతంలో ఓసారి ఆ ఛాన్స్ వచ్చినప్పటికీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదని, ఇప్పుడు రజినీ కోసం తన దగ్గర ఓ ఐడియా ఉందని, స్క్రిప్ట్ మొత్తం రెడీ అయ్యాక ఆ సినిమా గురించి ఆలోచిస్తానని పృథ్వీరాజ్ తెలిపారు. ఇక ఎల్2: ఎంపురాన్ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.