తెలుగు వాళ్లంతా తెలుగులోనూ చూడండి!
ప్రస్తుతం తెలుగు సినిమాలు ఏవీ కూడా రిలీజ్ కు లేవు. ఈ నేపథ్యంలో ఎంపురాన్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే పెద్ద హిట్ అవుతుందనే అంచనాలున్నాయి.;
మోహన్ లాల్ హీరోగా పృధ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో `ఎల్-2 ఎంపురాన్` తెరకెక్కించిన సంగతి తెలిసిందే. `లూసీఫర్` భారీ విజయం సాధించిన నేపథ్యంలో రెండవ భాగం రెట్టించిన అంచనాలతో పాన్ ఇండియాలో భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు సినిమాకు మంచి బజ్ ని తీసుకొచ్చాయి. తెలుగులో ఈ చిత్రాన్ని దిల్ రాజు రిలీజ్ చేయడం విశేషం.
దీంతో తెలుగులో పెద్ద ఎత్తున రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం తెలుగు సినిమాలు ఏవీ కూడా రిలీజ్ కు లేవు. ఈ నేపథ్యంలో ఎంపురాన్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే పెద్ద హిట్ అవుతుందనే అంచనాలున్నాయి. అయితే ఈ సినిమాను తెలుగులోనే చూడమని దర్శకుడు పృధ్వీరాజ్ సుకుమారన్ తెలుగు ఆడియన్స్ కు సూచించారు. `ప్రతీ తెలుగు వారు తెలుగులోనే చూడండి. సాధారణంగా ఎవరైనా ఒరిజినల్ వెర్షన్ చూడమని చెబుతారు.
కానీ నేను తెలుగులో చూడమంటాను. అలా చూస్తేనే మీకు అనుభూతి దక్కుతుంది. సినిమా ఏ భాషలో చూసిన భావం అర్దమవుతుంది. కానీ ఆ ఫీల్ ఇంకా గొప్పగా దక్కాలంటే ఏ భాష వాళ్లు ఆ భాషలో చూస్తేనే అర్దమవుతుంది. తెలుగు మాట్లాడే ప్రతీ ఒక్కరు తెలుగులోనూ చూడాలని కోరుకుంటున్నా` అని అన్నారు. దీంతో తెలుగు భాషకు ఆయన ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారన్నది అద్దం పడుతుంది.
ఈ మధ్య కాలంలో కర్ణాటకలో తెలుగు సినిమాపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. బెంగుళూరులో తెలుగు సినిమా పోస్టర్ కనిపిస్తే చాలు చించే పాడేసేవారు. తెలుగు అక్షరాలు అక్కడ కనిపించడానికి వీలు లేదం టూ స్థానికుల నుంచి నిరసన వ్యక్తమైంది. ఈ రకమైన పక్షపాతం తమిళనాడులోనూ తెలుగు వాళ్లపై కనిపిస్తుంది. కానీ తెలుగు వారు మాత్రం భాషతో సంబంధం లేకుండా అందర్నీ అక్కున చేర్చుకుంటారు. అదే తరహాలో పృధ్వీరాజ్ సుకుమారన్ తాను తీసిన సినిమా మలయాళం అయినా తెలుగు వాళ్లంతా తెలుగులోనే చూడాలని కోరడం విశేషం.