నాని అలాంటి సెన్సిటివ్ టాపిక్ ని టచ్ చేస్తున్నాడా?
నాని సమర్పణలో త్వరలో ''కోర్ట్'' అనే కొత్త సినిమా రాబోతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన న్యూస్ చక్కర్లు కొడుతోంది.
నేచురల్ స్టార్ నాని నిర్మాతగానూ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. వాల్ పోస్టర్ సినిమా అనే బ్యానర్ స్థాపించి, తన సమర్పణలో నిర్మాత ప్రశాంతి తిపిర్నేని తో కలిసి మూవీస్ తీస్తున్నారు. కంటెంట్-డ్రివెన్ చిత్రాలను నిర్మిస్తూ, న్యూ టాలెంట్ ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. ఈ విధంగా విమర్శకుల ప్రశంసలతో పాటుగా కమర్షియల్ సక్సెస్ అందుకుంటున్నారు. నాని సమర్పణలో త్వరలో ''కోర్ట్'' అనే కొత్త సినిమా రాబోతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన న్యూస్ చక్కర్లు కొడుతోంది.
ప్రియదర్శి పులికొండ ప్రధాన పాత్రలో రామ్ జగదీష్ దర్శకత్వంలో తెరకెక్కతున్న చిత్రం ''కోర్ట్''. దీనికి 'స్టేట్ Vs ఎ నోబడీ' అనే ఇంట్రెస్టింగ్ ట్యాగ్ లైన్ పెట్టారు. ఇటీవలే ఈ సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లారు. టైటిల్ కు తగ్గట్టుగానే ఇదొక కోర్ట్ రూమ్ డ్రామా అని తెలుస్తోంది. అయితే దీంట్లో ఓ వివాదాస్పద అంశాన్ని ప్రస్తావించబోతున్నారని, సినిమాలో పోక్సో యాక్ట్ గురించి చర్చించబోతున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
భారతదేశంలో లైంగిక వేధింపులు, లైంగిక నేరాలు, దోపిడీల నుండి పిల్లలను రక్షించే లక్ష్యంతో చేసిన చట్టమే పోక్సో యాక్ట్ (POCSO). పిల్లలపై జరుగుతున్న నేరాలను అరికట్టడమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశ్యం. దీని ప్రకారం పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడే వారికి కఠినమైన శిక్షలు విధిస్తారు. చైల్డ్ ప్రోనోగ్రఫీ వంటి తీవ్రమైన లైంగిక వేధింపుల కేసుల్లో జైలు శిక్ష విధించడంతోపాటు, కొన్ని సందర్భాల్లో మరణశిక్ష విధించే అవకాశం కూడా ఉంది. మైనర్లపై జరుగుతున్న అత్యాచాలన్నీ ఈ పోక్సో చట్టం పరిధిలోకి వస్తాయి. ఇటీవల జానీ మాస్టర్ అరెస్ట్ అయింది కూడా ఈ కేసులోనే. అయితే ఇప్పుడు 'కోర్ట్' సినిమా కథంతా ఈ చట్టం చుట్టూనే తిరుగుతుందని అంటున్నారు.
అన్యాయంగా ఓ కేసులో ఇరికించిన ఓ కుర్రాడి కోసం జరిగే న్యాయ పోరాటం చుట్టూ 'కోర్ట్' కథ తిరుగుతుందని సమాచారం. ఇందులో ప్రియదర్శి లాయర్ పాత్రలో కనిపించనున్నారు. పోక్సో చట్టాన్ని కొందరు తమ స్వార్థం కోసం దుర్వినియోగం చేస్తున్నారనే విమర్శ కూడా ఉంది. ఆ అంశాన్ని కూడా ఈ సినిమాలో చర్చించబోతున్నారట. క్లైమాక్స్ పార్ట్ అందర్నీ ఆలోచింపజేస్తుందని అంటున్నారు. దర్శకుడు రామ్ జగదీష్ సున్నితమైన అంశాన్ని తీసుకొని మంచి డ్రామా రాసుకున్నారని, ఇది నచ్చే నాని సినిమా తీయడానికి ముందుకు వచ్చారని అంటున్నారు.
'కోర్ట్' చిత్రంలో శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్, హర్ష్ రోషన్, శ్రీదేవి కీలక పాత్రలు పోషిస్తున్నారు. విజయ్ బుల్గానిన్ సంగీతం సమకూరుస్తున్నారు. దినేష్ పురుషోత్తమన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తుండగా.. విఠల్ కొసనం ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. రామ్ జగదీష్, కార్తికేయ శ్రీనివాస్, వంశీధర్ సిరిగిరి కలిసి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.
ఇకపోతే నాని సమర్పణలో ఇప్పటి వరకు 'అ!' 'హిట్' 'హిట్ 2' సినిమాలు వచ్చాయి. తన సోదరి దీప్తి గంట ను డైరెక్టర్ గా పరిచయం చేస్తూ ‘మీట్ క్యూట్’ అనే ఆంథాలజీని నిర్మించారు. ఇదే క్రమంలో 'కోర్ట్' సినిమా రానుంది. ప్రస్తుతం నాని స్వీయ నిర్మాణంలో 'హిట్ 3: ది థర్డ్ కేస్' చిత్రం రూపొందుతోంది.