"డిపార్ట్ మెంట్ కూడా ఆశ్చర్యపోయింది"... ఐటీ రైడ్స్ పై దిల్ రాజు కామెంట్స్!
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖుల ఇళ్లపై గత కొన్ని రోజులుగా జరుగుతున్న దాడులు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖుల ఇళ్లపై గత కొన్ని రోజులుగా జరుగుతున్న దాడులు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. వీటికి సంబంధించి రకరకాల ప్రచారాలు హల్ చల్ చేశాయి. ఈ సమయంలో తన నివాసం, కార్యాలయాల్లో జరిగిన ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాలపై నిర్మాత దిల్ రాజు స్పందించారు.
అవును... తన నివాసం, ఆఫీసుల్లో జరిగిన ఐటీ సోదాలపై తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్పందించారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా.. ఏమీ లేనిదాన్ని ఎక్కువగా ఊహించుకుని హైలెట్ చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలు వెల్లడించారు.
ఇందులో భాగంగా... గతంలో 2008లో ఒకసారి ఐటీ శాఖ అధికారులు దాడులు చేశారని, సుమారు 16 ఏళ్ల తర్వాత ఇప్పుడు మరోసారి తమ ఇళ్లు, ఆఫీసులపై దాడులు జరిగాయని.. మధ్యలో మూడుసార్లు సర్వేలు చేసి అకౌంట్ బుక్స్ చెక్ చేశారని.. వ్యాపారంలో ఉన్నవారిపై ఇటువంటి దాడులు అత్యంత సాధారణమైన విషయమని దిల్ రాజు తెలిపారు.
అయితే... తాజాగా ఈ దాడుల్లో దిల్ రాజు ఇంట్లోనూ, ఆఫీసుల్లోనూ చాలా డబ్బు దొరికిందని, డాక్యుమెంట్లు దొరికాయని, వాటిని సీజ్ చేశారని చెబుతూ కొన్ని ఛానల్స్ వార్తలు హైలెట్ చేశాయని.. కానీ, తమ వద్ద అలాంటివి ఏమీ జరగలేదని.. తమ వద్ద ఎలాంటి అనధికారిక పత్రాలు, డబ్బును అధికారులు గుర్తించలేదని దిల్ రాజు స్పష్టం చేశారు.
ఈ సమయంలో... తన వద్ద రూ.5 లక్షలు, శిరీష్ వద్ద రూ.4.5 లక్షలు, తన కుమార్తె వద్ద రూ.6.5 లక్షలు, ఆఫీసులో రూ.2 లక్షలు.. ఇలా మొత్తం సుమారు రూ.20 లక్షల కంటే తక్కువే నగదు ఉందని.. అది కూడా అనధికారి డబ్బు కాదని.. వాటికీ పత్రాలు ఉన్నాయని.. ఇంట్లో బంగారం కూడా లిమిట్స్ ప్రకారమే ఉందని చెప్పారు.
ఇదే సమయంలో... గత ఐదు సంవత్సరాలుగా తాము ఎక్కడా ప్రాపర్టీలు కొనుగోలు చేయలేదని.. పెట్టుబడులు పెట్టలేదని చెప్పిన దిల్ రాజు.. తమ వ్యాపారానికి సంబంధించి అన్ని వివరాలనూ అధికారులకు ఇచ్చినట్లు తెలిపారు. తామిచ్చిన వివరాలు చూసి డిపార్ట్ మెంటే ఆశ్చర్యపోయిందని.. అందరి అకౌంట్లు క్లీన్ గా ఉన్నాయని తెలిపారు.
ఫేక్ కలెక్షన్స్ పై కూర్చుని మాట్లాడతాం..!:
ఇక ప్రధానంగా ఫేక్ కలెక్షన్స్ వల్లే ఈ ఐటీ దాడులు జరుగుతున్నాయంటూ వస్తోన్న వార్తలపై స్పందించిన దిల్ రాజు... ఈ విషయంపై తాను వ్యక్తిగతంగా కామెంట్ చేయకూడదని.. దీనిపై ఇండస్ట్రీలోని అందరితోనూ కలిసి దానిపై మాట్లాడతామని.. 90 శాతం టిక్కెట్లు ఆన్ లైన్ లోనే కొనుగోలు చేస్తున్నప్పుడు బ్లాక్ మనీ సమస్యే లేదని తెలిపారు.
అమ్మకు దగ్గు ఎక్కువైతే గుండెపోటు అన్నారు!:
ఈ సమయంలోనే తన తల్లికి సడెన్ గా దగ్గు ఎక్కువ కావడంతో ఆస్పత్రికి పంపించామని.. అయితే, ఆమెకు గుండెపోటు అన్నట్లు కొంతమంది వార్తలు రాశారని.. ఆమె చాలా ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. ఇప్పుడు ఆమెకు 81 ఏళ్లనుని రెండు రోజులు ఆస్పత్రిలోనే ఉన్నారని, ఇప్పుడు డిశ్చార్జ్ అవుతారని దిల్ రాజు చెప్పారు.
ఆమెకు ఊపిరితిత్తుల్లో ఉన్న ఇన్ఫెక్షన్ వల్ల సడన్ గా దగ్గు ఎక్కువగా వచ్చింద్ని.. దానికి సంబంధించిన ట్రీట్ మెంట్ తీసుకున్నారని.. ఈ విషయాలు తెలియకుండా ఏవేవో ఊహించుకుని వాటిని హైలెట్ చేయొద్దని మరోసారి మీడియాను కోరుతున్నట్లు దిల్ రాజు విజ్ఞప్తి చేశారు.