SSMB29 : ఒడిశా షెడ్యూల్‌కి భలే ముగింపు

ఏడాదికి పైగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసిన రాజమౌళి ఇటీవలే రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించాడు.;

Update: 2025-03-22 14:24 GMT

టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో SSMB29 సినిమాను రూపొందిస్తున్న విషయం తెల్సిందే. వీరిద్దరి కాంబోలో పుష్కర కాలం క్రితమే సినిమా రావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదాలు పడుతూ వచ్చింది. బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్న రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబుతో సినిమాను షురూ చేశాడు. మహేష్‌ బాబు - రాజమౌళి కాంబో మూవీ హాలీవుడ్‌ సినిమాల రేంజ్‌లో ఉండబోతుందని, మరోసారి ఆస్కార్‌ స్టేజ్‌ మీద ఇండియన్ సినిమాను నిలబెట్టబోతుంది అంటూ ఫ్యాన్స్‌తో పాటు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏడాదికి పైగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసిన రాజమౌళి ఇటీవలే రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించాడు.

గత నెలలో హైదరాబాద్‌లోని అల్యూమీనియం ఫ్యాక్టరీలో మొదటి షెడ్యూల్‌ చిత్రీకరణ జరిగింది. మహేష్‌ బాబుతో పాటు ప్రియాంక చోప్రా ఆ షెడ్యూల్‌లో పాల్గొంది. ఇటీవలే ఒడిశాలో రెండో షెడ్యూల్‌ను ప్రారంభించారు. తాజా షెడ్యూల్‌లో మహేష్‌ బాబుతో పాటు మలయాళ స్టార్‌ పృథ్వీరాజ్ సుకుమారన్‌ పాల్గొన్నారు. ఇంకా పలువురు నటీనటులు ఈ షెడ్యూల్‌లో పాల్గొన్నారు. ఈ షెడ్యూల్‌ సందర్భంగానే మహేష్ బాబు వీడియో ఒకటి లీక్ అయిన విషయం తెల్సిందే. మహేష్ బాబు లుక్ రివీల్‌ చేసిన ఆ లీక్డ్‌ వీడియోను సోషల్ మీడియాలో లేకుండా జక్కన్న టీం వెంటనే స్పందించింది. ఎన్నో జాగ్రత్తల మధ్య ఒడిశా షెడ్యూల్‌ను నిర్వహించారు.

సినిమా గురించి ఒడిశా ఉప ముఖ్య మంత్రితో పాటు పలువురు మంత్రులు కూడా మీడియా ముందు వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. ఒడిశా షెడ్యూల్‌ను రాజమౌళి ముగించాడు. షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని హైదరాబాద్‌ తిరిగి రావడానికి ముందు అక్కడ ప్రభుత్వం నిర్వహించిన చెట్లు నాటే కార్యక్రమంలో రాజమౌళి అండ్ టీం పాల్గొన్నారు. మహేష్‌ బాబు, రాజమౌళి, కార్తికేయతో పాటు ఇతర యూనిట్‌ సభ్యులు సైతం ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొన్నటి వరకు షూటింగ్‌లో బిజీగా ఉన్న యూనిట్‌ సభ్యులు.. దాన్ని పూర్తి చేసుకుని చెట్టు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒడిశా షెడ్యూల్‌ను భలేగా ముగించారు. చెట్లు నాటే కార్యక్రమంలో పాల్గొన్న SSMB29 చిత్ర యూనిట్‌ సభ్యులపై స్థానికులతో పాటు నెట్టింట ప్రశంసలు కురుస్తున్నాయి.

ప్రస్తుతం SSMB29 చిత్ర యూనిట్‌ సభ్యులు చెట్లు నాటుతున్న ఫోటోలు, వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. చెట్లు నాటే కార్యక్రమంలో పాల్గొన్నందుకు గాను మహేష్‌ బాబు, రాజమౌళి ఇతర యూనిట్‌ సభ్యులకు ఒడిశా ప్రభుత్వం కృతజ్ఞతలు తెలియజేసింది. ఒడిశా షెడ్యూల్‌ను పూర్తి చేసిన రాజమౌళి తదుపరి షెడ్యూల్‌ కోసం ఆఫ్రికా వెళ్లే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. ఆ షెడ్యూల్‌ కి సంబంధించి త్వరలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒడిశా షెడ్యూల్‌కి ముందు రాజమౌళి ప్రెస్‌ మీట్ ఉంటుందనే వార్తలు వచ్చాయి. కానీ రాజమౌళి ఇప్పటి వరకు ఈ సినిమా గురించి ఒక్క విషయాన్ని అధికారికంగా బయటకు చెప్పలేదు. అందుకే అంతా ఆయన మీడియా సమావేశం కోసం ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News