డాన్ 3: షారూఖ్ స్థానంలో రణవీర్ ఎంపిక కారణం?
డాన్ ఫ్రాంఛైజీ నుంచి సినిమా వస్తోంది అంటే దానికోసం అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తారు.
డాన్ ఫ్రాంఛైజీ నుంచి సినిమా వస్తోంది అంటే దానికోసం అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తారు. దర్శకనిర్మాత ఫర్హాన్ అక్తర్ ఈ ఏడాది ప్రారంభంలో రణవీర్ సింగ్ టైటిల్ పాత్రలో `డాన్ 3`ని ప్రకటించగానే ఆసక్తి రేకెత్తింది. అయితే షారుఖ్ ఖాన్ మూడో భాగంలో నటించరని, అతడి స్థానంలో రణవీర్ నటిస్తున్నాడని కూడా వెల్లడించారు. కానీ ఇది ఖాన్ అభిమానులకు రుచించలేదు. ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. డాన్, డాన్ 2 చిత్రాలలో టైటిల్ రోల్ పోషించిన షారుఖ్ ఆ పాత్రకు బాగా సరిపోతాడని అభిమానులు నమ్ముతారు. అయితే డాన్ 3 కోసం షారూఖ్‌తో ఎందుకు ముందుకు వెళ్లలేదు? అన్న ప్రశ్నకు ఇప్పుడు ఫర్హాన్ నుంచి సరైన సమాధానం వచ్చింది.
ఫర్హాన్, ఫాయే డిసౌజాతో చాటింగ్ సెషన్ లో అసలు విషయం చెప్పాడు. తాను డాన్ 3 స్క్రిప్టు రాసేటప్పుడు తొలుత షారూఖ్‌ను పరిగణించాడు. కానీ చివరికి ఏదీ కలిసి రాలేదని వివరించాడు. ఫర్హాన్ మాట్లాడుతూ, ``నేను మొదట డాన్ 3 ఎలా చేయాలా? అని ఆలోచించడం మొదలుపెట్టాను. స్పష్టంగా షారూఖ్‌తో కలిసి ఏదైనా రాయాలని అనుకున్నాను. కానీ ఎంపిక చేసిన కథను ముందుకు తీసుకెళ్లడానికి సరైన స్పేస్ ని కొనుక్కోలేకపోయాం.
అందువల్ల నేను ఈ చిత్రంతో ఏం చేయాలనుకుంటున్నానో మళ్లీ పునరాలోచించుకున్నాను. డాన్ తరహా కథనానికి కొంచెం ఎక్కువ రేంజుకు వెళ్లాలని భావించాను. ఆ తర్వాత నేను దానిని రాయడం ప్రారంభించాను. అప్పుడు ఆ కథకు యువ నటుడు కచ్ఛితంగా అవసరం పడిందని స్పష్ఠత వచ్చింది. దానికి రణవీర్ సింగ్ సరైన వాడు అని భావించాను... అని తెలిపారు. దీంతో షారూఖ్ తో మంతనాలు ఫెయిలయ్యాక స్క్రిప్టును రణవీర్ కోసం రీరైట్ చేసారని అర్థం చేసుకోవచ్చు.
ఈ చిత్రంలో శోభితా ధూళిపాళ డాన్ 3లో ప్రత్యేక గీతంలో నర్తించే అవకాశం ఉందని ఇంతకుముందు కథనాలొచ్చిన సంగతి తెలిసిందే. నాగచైతన్యతో నిశ్చితార్థం తర్వాత ఇది అరుదైన అవకాశం. మునుముందు శోభిత తన కెరీర్ ని యథాతథంగా కొనసాగిస్తుందని కూడా దీనిని బట్టి క్లారిటీ వచ్చింది. రణ్వీర్ సింగ్ తదుపరి `సింఘం ఎగైన్`లో కనిపించనున్నాడు. షారుక్ ఖాన్ సుజోయ్ ఘోష్ కింగ్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు.