ఖుషి కోసం కోటి తగ్గించిన సామ్
తన వల్ల ఆలస్యమైనందుకు, కలిగిన నష్టానికి పరిహారంగా తన పారితోషికాన్ని కొంత తగ్గించుకుని తీసుకున్నట్లు తెలిసింది.
ఓ సినిమా భారీ హిట్ అయితే హీరోలు లాభాలు తీసుకోవడం, డిజాస్టర్ అయితే తాము తీసుకున్న రెమ్యునరేషన్ వెనక్కి తిరిగి ఇవ్వడం వంటివి హీరోలు చేయడం మనం చూస్తూనే ఉంటాం. అయితే ఈ విషయంలో హీరోయిన్లూ తక్కువ కాదని నిరూపించింది స్టార్ హీరోయిన్ సమంత.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ.. విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి అనే లవ్, రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్ సినిమా చేసింది. ఈ చిత్రం మరో రెండు రోజుల్లో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ ఫుల్ జోరులో జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రమోషన్స్ లో ఎక్కడ చూసిన హీరో విజయ్ దేవరకొండనే కనిపిస్తున్నారు. సమంత మాత్రం ఎక్కడా కనపడట్లేదు. ఆమె దూరంగానే ఉంటుంది.
ఏదో అలా మొక్కుబడిగా అన్నట్టుగా ఒకటి రెండు ఇంటర్వూలు ఇచ్చి, మ్యూజిక్ కన్సర్ట్ లో పాల్గొని అమెరికా వెళ్లిపోయింది. తనకు వీలైనంతవరకు ఆన్ లైన్ లోనే ప్రమోషన్స్ చేస్తుంది తప్ప డైరెక్ట్ గా చేయట్లేదు. అయితే ఆమె అమెరికా వెళ్లడానికి కారణం.. చికిత్సకు అనే ప్రచారం కూడా సాగుతోంది
వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ అవ్వాల్సింది. కానీ సమంత అనారోగ్యం కారణంగా చిత్రీకరణ మధ్యలో ఓ ఐదు నెలల పాటు ఆగిపోయింది. సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది.
అసలు ఓ సినిమా ఎంత ఆలస్యమైతే.. నిర్మాతలపై అంత భారం పడుతుంది. వాళ్లు పొడ్యూస్ చేసే డబ్బులపై వడ్డీల(ఒకవేళ ఫైనాన్స్ కు డబ్బులు తీసుకువస్తే) భారం కూడా పడే అవకాశం ఉంటుంది.అందుకే ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సమంత దర్శకనిర్మాతలకు కాస్త అండగా నిలిచింది.
తన వల్ల ఆలస్యమైనందుకు, కలిగిన నష్టానికి పరిహారంగా తన పారితోషికాన్ని కొంత తగ్గించుకుని తీసుకున్నట్లు తెలిసింది. రూ.కోటి రూపాయలు తగ్గించుకుందట. రిలీజ్ కు ముందు అడ్వాన్స్ పోగా.. తాను తీసుకోవాల్సిన మిగితా సొమ్మును మాఫీ చేసినట్టు సమాచారం అందింది. గతంలో శాకుంతలం విషయంలోనూ ఇదే జరిగిందట. ఆ సినిమా నిర్మాత గుణ శేఖర్‌కు ఈ చిత్రం భారీ నష్టాన్ని మిగిల్చింది. ఆ సమయంలోనూ సామ్ కొంత పారితోషికాన్ని తగ్గించుకుని తీసుకుందట.
ఇక ఈ విషయం తెలుసుకుంటున్న అభిమానులు సమంతను ప్రశంసిస్తున్నారు. కనీసం ప్రమోషన్స్ హాజరుకాకపోయినా ఆమె పారితోషికాన్ని తగ్గించుకుని నిర్మాతలకు కాస్త భారాన్ని తగ్గించిందని అంటున్నారు. సామ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.