కారవాన్‌లోకి దర్శకుడు.. హీరోయిన్ కేకలు!
అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న శాలిని పాండే, అప్పటినుంచి టాలీవుడ్ అనే కాకుండా ఇతర ఇండస్ట్రీల వైపు వైపు కూడా దృష్టి మళ్లించింది.;
అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న శాలిని పాండే, అప్పటినుంచి టాలీవుడ్ అనే కాకుండా ఇతర ఇండస్ట్రీల వైపు వైపు కూడా దృష్టి మళ్లించింది. సౌత్‌లో 'నిశ్శబ్దం' సినిమా తర్వాత ఆమె ఎలాంటి తెలుగు ప్రాజెక్ట్ చేయలేదు. చాలా గ్యాప్ తర్వాత ప్రస్తుతం తమిళంలో ధనుష్‌తో 'ఇడ్లీ కడై' అనే సినిమా చేస్తోంది. అలాగే డబ్బా కర్టెల్ అనే వెబ్ సీరీస్ స్ట్రీమింగ్ కు సిద్ధమవుతోంది. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శాలిని షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది.
ఈ మధ్యకాలంలో ఫిలిం ఇండస్ట్రీలో మహిళలకు ఎదురయ్యే అవమానాలు, ఒత్తిళ్లపై చాలా మంది హీరోయిన్స్ ఓపెన్ గా స్పందిస్తున్నారు. ఇప్పుడు శాలిని పాండే కూడా ఓ చేదు అనుభవాన్ని చెప్పడంతో ఇండస్ట్రీలో చర్చ రేగింది. తన కెరీర్ ప్రారంభ దశలో దక్షిణాది సినిమాల్లో పనిచేసే సమయంలో ఓ దర్శకుడితో తానెంతో అసహజమైన అనుభవాన్ని ఎదుర్కొన్నానని ఆమె చెప్పింది.
‘‘ఒకసారి నా కారవాన్‌లో బట్టలు మార్చుకుంటున్న సమయంలో ఆ డైరెక్టర్ అనుమతి లేకుండా తలుపు తెరిచి లోపలికి వచ్చాడు. నేనెంతో కోపంతో అరిచాను, వెంటనే అతను బయటికి వెళ్లిపోయాడు. కానీ తర్వాత నేను తప్పు చేశానని చెప్పే ప్రయత్నం చేశారు. నేను అలా అరిచినందుకు నా మీదే తప్పని అన్నట్టు చెప్పారు. కానీ, నాకు మాత్రం నేను చేసినది సరైనదే అనిపించింది’’ అని శాలిని వెల్లడించింది. ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక ఆమె ఈ కామెంట్స్ ఆ దర్శకుడు ఎవరు? ఏ సినిమా సమయంలో ఇది జరిగిందన్న దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. శాలిని తొలి సినిమా ‘అర్జున్ రెడ్డి’కి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత కూడా కొంతమంది సౌత్ దర్శకులతో పనిచేసింది. ఎవరి గురించి ఆమె చెప్పిందన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఆమె మాటలలో ఉన్న ధైర్యం చూసి చాలా మంది ప్రశంసిస్తున్నారు.
తనకు ఎదురైన అనుభవం గురించి మాట్లాడిన శాలినికి ఇండస్ట్రీలో మద్దతుగా పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ ఆమె చెప్పిన మాటలు నిజమైతే, ఇది చాలా సీరియస్ విషయమే. సినీ రంగంలో మహిళలకు ఎదురయ్యే ఇలాంటి సంఘటనలు బయటికి రావడం, నటీమణులు స్వతంత్రంగా మాట్లాడడం అభినందనీయం. ఇలా గళమెత్తడం వల్ల ఇలాంటి విషయాలు తగ్గే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం శాలిని తమిళ చిత్రసీమపై దృష్టి పెట్టింది. ధనుష్ సరసన నటిస్తున్న ‘ఇడ్లీ కడై’ సినిమా తరువాత మరిన్ని తమిళ ప్రాజెక్టులకు ఆమె సైన్ చేసినట్టు సమాచారం. ఇక ఆమె తెలుగులోకి మళ్లీ వస్తుందా అనే విషయంపై క్లారిటీ లేకపోయినా, ఆమె మాత్రం రెగ్యులర్ ఫొటో షూట్స్ తో మళ్లీ ట్రెండింగ్‌లోకి వచ్చింది.