సూర్య మరో ప్రయోగం.. ఈ సారి ఏకంగా..
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాకేశ్ ఓం ప్రకాష్ మెహ్రా దర్శకత్వంలో సూర్య నటించేందుకు రెడీగా ఉన్నారంటూ బాలీవుడ్ మీడియా సర్కిల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ప్రయోగాలకు పెద్దపీట వేస్తుంటారు తమిళ అగ్ర హీరో సూర్య. భిన్న కథలు, పాత్రలతో తనని తాను కొత్తగా ఆవిష్కరించుకోవాలని, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇవ్వాలని తపిస్తుంటారు. ఇప్పటికే పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న ఆయన మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. అది కూడా బాలీవుడ్ ఎంట్రీ అని అంటున్నారు.
వివరాళ్లోకి వెళితే.. కోలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో సూర్య కూడా ఒకరు. సూరరై పొట్రు(ఆకాశమే హద్దురా) చిత్రంతో ఆయన క్రేజ్ పాన్ ఇండియా స్థాయికి చేరింది. దీంతో ఆయన నటించే సినిమాలపై మరింత హైప్ కూడా పెరుగుతోంది. ప్రస్తుతం ఆయన.. శివ దర్శకత్వంలో కంగువ అనే భారీ పీరియాడికల్ సినిమాను చేస్తున్నారు.
ఈ చిత్రం తర్వాత దర్శకురాలు సుధా కొంగరతో కలిసి తన 43వ చిత్రంలో నటించేందుకు సిద్ధం అవుతున్నారు సూర్య. అలాగే దీంతో పాటే వెట్రిమారన్ దర్శకత్వంలో వాడివాసల్ చిత్రంలోనూ నటించనున్నారు. అయితే ఇప్పుడాయన బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని టాక్ వినిపిస్తోంది.
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాకేశ్ ఓం ప్రకాష్ మెహ్రా దర్శకత్వంలో సూర్య నటించేందుకు రెడీగా ఉన్నారంటూ బాలీవుడ్ మీడియా సర్కిల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రంగ్ దే బసంతి, భాగ్ మిల్కా భాగ్ వంటి సంచలన చిత్రాలను తెరకెక్కించారు రాకేశ్. ఇప్పుడాయన పురాణ ఇతిహాస మహాభారతంలోని దానకర్ణుని ఇతివృత్తాన్ని తీసుకుని ఓ చిత్రాన్ని చేయాలని అనుకుంటున్నారట. ఈ చిత్రంలోనే సూర్య నటించబోతున్నారని అంటున్నారు.
రీసెంట్గా ఇద్దరి మధ్య చర్చలు జరిగాయని, ఈ చిత్రానికి కర్ణ అనే టైటిల్ పరిశీలనలో ఉందని సమాచారం అందింది. రెండు భాగాలుగా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే ఈ సినిమా గురించి మరిన్ని వివరాలను తెలుపుతూ.. అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.
అసలే మహాభారతం నేపథ్యంలో ఇప్పటికే చాలా భాషల్లో ఎన్నో చిత్రాలు వచ్చాయి. అందులో చాలా వరకు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. వారందరినీ భక్తి సంద్రంలో ముంచెత్తాయి. త్వరలోనే మరెన్నో చిత్రాలు కూడా వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మహాభారతం లాంటి ఇతిహాస కథలో సూర్య నటిస్తారనే సరికి ఆసక్తి ఏర్పడింది.