వేధింపుల పరిష్కారానికి ఫిర్యాదుల పెట్టె రెడీ: ఫిలింఛాంబర్
ఇప్పటికే ఛాంబర్ ఏర్పాటు చేసిన ప్యానెల్ మహిళా కొరియోగ్రాఫర్ నుండి వచ్చిన ఫిర్యాదును స్వీకరించింది.
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ 2018లో లైంగిక వేధింపుల ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరించేందుకు ప్యానెల్‌ని ఏర్పాటు చేసిందని, ఫిర్యాదులు ఏవైనా ఛాంబర్ వద్ద ఉంచిన `వేధింపుల ఫిర్యాదుల పెట్టె`లో వేయొచ్చని, లేదా కొరియర్ ద్వారా పంపవచ్చని ఫిలింఛాంబర్ గౌరవ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ ఒక ప్రకటనలో వెల్లడించారు. వాట్సాప్ ఫిర్యాదులను స్వీకరిస్తున్నట్టు ఆయన తెలిపారు.
ఇప్పటికే ఛాంబర్ ఏర్పాటు చేసిన ప్యానెల్ మహిళా కొరియోగ్రాఫర్ నుండి వచ్చిన ఫిర్యాదును స్వీకరించింది. తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ & డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్‌లో ప్రముఖ కొరియోగ్రాఫర్ మీద వచ్చిన ఈ ఫిర్యాదును పరిష్కరించడానికి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ఫిర్యాదు విచారణ ప్రక్రియలో ఉంది. కాబట్టి ఆరోపణలు ఎదర్కొంటున్న మేల్ కొరియోగ్రాఫర్ యూనియన్ ప్రెసిడెంట్ పదవిని విచారణ పూర్తయ్యే వరకు తాత్కాలికంగా నిలిపివేస్తూ.. కమిటీ మధ్యంతర నివేదికను ఇచ్చిందని తెలిపారు.
కేసుల పరిష్కారానికి పని చేసే కమిటీ వివరాలు ఇలా ఉన్నాయి. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్- లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్: K.L. దామోదర్ ప్రసాద్- హానరరీ సెక్రటరీ & కన్వీనర్, ఝాన్సీ- చైర్‌పర్సన్
అంతర్గత సభ్యులు: తమ్మారెడ్డి భరద్వాజ, సుచిత్రా చంద్రబోస్, వివేక్ కూచిభొట్ల, ప్రగతి మహావాది, బాహ్య సభ్యులు: రామలక్ష్మి మేడపాటి, సామాజిక కార్యకర్త మీడియా నిపుణురాలు కావ్య మండవ, న్యాయవాది మరియు POSH నిపుణురాలు.. ఇందులో ఉన్నారు.
నాలుగు మార్గాల్లో ఫిర్యాదులు స్వీకరణ
ఏదైనా లైంగిక వేధింపుల ఫిర్యాదుల విషయంలో మహిళలు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ను నేరుగా సంప్రదించవచ్చని కె.ఎల్.దామోదర ప్రసాద్ అన్నారు. ``తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయం వెలుపల ఫిర్యాదు పెట్టెను ఉంచాం. దీనిని ఉదయం 6 నుండి రాత్రి 8 గంటల మధ్య యాక్సెస్ చేయవచ్చు`` అన్నారు. ఫిర్యాదుల నిమిత్తమై మమ్మల్ని పోస్ట్ లేదా కొరియర్ ద్వారా ``తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, డా. డి. రామానాయుడు బిల్డింగ్ కాంప్లెక్స్, ఫిలింనగర్, జూబ్లీహిల్స్, హైదరాబాద్-500 096`` చిరునామాకు పంపవచ్చును. ఫిర్యాదులను నమోదు చేయడానికి ప్రత్యేక ఫోన్ నంబర్ వాట్సాప్ లేదా టెక్స్ట్ నెం. 9849972280, ఈమెయిల్ ఐడీ: complaints@telugufilmchamber.in లకు పంపగలరు. మీరు పంపించిన వివరాలు గోప్యంగా ఉంటాయని హామీ ఇస్తున్నట్టు వెల్లడించారు.