వ్యూస్ కోసం బ్రతికున్నోళ్లని చంపేస్తారా?
డిజిటల్ యుగం బాగా పెరిగిన నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ నిజానిజాలతో పని లేకుండా ఎవరికి నచ్చిన కంటెంట్ వాళ్లు పోస్ట్ చేసేస్తున్నారు.;
డిజిటల్ యుగం బాగా పెరిగిన నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ నిజానిజాలతో పని లేకుండా ఎవరికి నచ్చిన కంటెంట్ వాళ్లు పోస్ట్ చేసేస్తున్నారు. కేవలం వ్యూస్, క్లిక్స్ కోసం ఇష్టమొచ్చిన థంబ్‌నైల్స్ పెట్టి కంటెంట్ ను షేర్ చేస్తున్నారు. దీని వల్ల అలాంటి పోస్ట్ లు చేసే వారికి లాభమో నష్టమో పక్కనపెడితే ఆ వీడియో ఎవరి గురించైతే చేశారో వారిని చాలా ఇబ్బందికి గురిచేస్తుంది. ఇప్పుడు అలాంటి ఇబ్బందికే గురైంది టాలీవుడ్ నటి గాయత్రి భార్గవి.
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన గాయత్రి భార్గవి పలు సినిమాల ద్వారా నటిగా, కొన్ని కార్యక్రమాలకు హోస్ట్ గా వ్యవహరించింది. ఆమె కొన్నాళ్ల కిందట ప్రముఖ ఇంటర్వ్యూయర్ స్వప్నకు ఓ యూట్యూబ్ కోసం ఇంటర్వ్యూ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఇంటర్వ్యూ నుంచి మిస్ లీడింగ్ థంబ్ నైల్స్ పెట్టారని, ఆల్రెడీ రెండు సార్లు చెప్పానని, అయినా అలానే చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ ఇంటర్వ్యూలో గాయత్రి తన భర్త గురించి మాట్లాడింది. గాయత్రి భర్త పేరు విక్రమ్. ఆయనో ఆర్మీ ఆఫీసర్. ప్రజల రక్షణ కోసం నిరంతరం శ్రమపడే ఆర్మీ కష్టాలు ఎలా ఉంటాయో ఆమెకు బాగా తెలుసని, ఆర్మీ అధికారుల్లో కొంతమంది డ్యూటీలో ఉన్నప్పుడే దేశం కోసం ప్రాణాలు అర్పించిన సందర్భాల గురించి కూడా తనకు తెలుసని, అందులో ఓ విషాద సంఘటనను ఆ ఇంటర్వ్యూలో గాయత్రి షేర్ చేసుకుంది.
గాయత్రి మాట్లాడింది ఇది. కానీ సదరు యూట్యూబ్ ఛానెల్ పెట్టిన యూట్యూబ్ థంబ్‌నైల్స్ వేరు. అసలు ఆమె చెప్పిన దానికి ఏ మాత్రం సంబంధం లేకుండా థంబ్ నైల్ పెట్టారు. గాయత్రి భర్త విక్రమ్ చనిపోయాడనే అర్థం వచ్చేలా ఆ యూట్యూబ్ థంబ్ నైల్ ను పెట్టి భర్తతో గాయత్రి దిగిన ఫోటోలను పెట్టారు.
ఆ థంబ్ నైల్స్ పై ఆమె అభ్యంతరం చెప్పడంతో ముందు వాటిని డిలీట్ చేశారని, ఇప్పుడు మళ్లీ కొన్నాళ్లకు అదే తంతు జరుగుతుందని గాయత్రి ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక సెల్ఫీ వీడియోను షూట్ చేసి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది గాయత్రి. ఆ వీడియోలో గాయత్రి తన భర్తను చూపిస్తూ, నా భర్త బ్రతికే ఉన్నారని చెప్పింది. ఆర్మీ ఆఫీసర్ కు, ఇండియన్ ఆర్మీకు మీరిచ్చే గౌరవం ఇదేనా అంటూ సదరు యూట్యూబ్ ఛానెల్ ను ఆమె ప్రశ్నిస్తూ తన భర్తకు క్షమాపణలు తెలిపింది గాయత్రి. ఆ థంబ్ నైల్స్ చూస్తుంటే ఆ యూట్యూబ్ ఛానెల్ కు ఆర్మీపై ఎంత గౌరవముందో తెలుస్తోందని గాయత్రి భర్త విక్రమ్ ఆ వీడియోలో అన్నారు. తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడం ఏమాత్రం మంచిది కాదంటున్న గాయత్రి మీడియా ఇలాంటి విషయాల్లో జవాబుదారీ తనంగా ఉండాలని, ఈ విషయంలో తమకు సదరు యూట్యూబ్ చానెల్ బహిరంగంగా సారీ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ విషయంలో గాయత్రికి సపోర్ట్ చేస్తూ పలువురు కామెంట్స్ పెడుతున్నారు.