MAA ఎన్నిక‌లకు భిన్నంగా ద‌ర్శ‌కుల ఎన్నిక‌లు

అదే ఆర్టిస్టుల ఎన్నికలు ఇందుకు పూర్తి విరుద్ధం. 'మా' అసోసియేష‌న్ ఎన్నిక‌లు జ‌రిగితే మాత్రం బోలెడంత హంగామా అన‌వ‌స‌ర ర‌సాభాసా చూస్తుంటాం

Update: 2024-02-12 03:47 GMT

తెలుగు చిత్ర‌సీమ‌లో 24శాఖ‌ల్లో ప్ర‌ధానమైన అసోసియేష‌న్ల‌కు ఎన్నిక‌లు జ‌రిగితే అందుకు సంబంధించి ఇండ‌స్ట్రీ వర్గాల్లో, మీడియాలో ఆస‌క్తి నెల‌కొంటుంది. కానీ ద‌ర్శ‌కుల సంఘం ఎన్నిక‌లు ఎప్పుడు జ‌రిగినా అస‌లు అవి జ‌రుగుతున్న‌ట్టే ఎవ‌రికీ తెలీదు. ప‌బ్లిసిటీ హంగామా అస్స‌లు ఉండ‌దు. చాలా కూల్ గా వివాదాల్లేకుండా ఎన్నిక‌లు పూర్త‌వుతాయి. ఈ ఎన్నిక‌ల‌ను ఆర్గ‌నైజ్డ్ గా ఒక ప‌ద్ధ‌తి ప్ర‌కారం పూర్తి చేస్తారు. మీడియాలో ఎక్క‌డా ప్ర‌చార హంగామా కూడా ఉండ‌దు. ఇరు ప్యానెళ్ల మ‌ధ్య పోటీ ఉన్నా కానీ చాల డీసెంట్ గా ఎన్నికలు పూర్తి చేస్తారు.

అదే ఆర్టిస్టుల ఎన్నికలు ఇందుకు పూర్తి విరుద్ధం. 'మా' అసోసియేష‌న్ ఎన్నిక‌లు జ‌రిగితే మాత్రం బోలెడంత హంగామా అన‌వ‌స‌ర ర‌సాభాసా చూస్తుంటాం. ఇరు ప్యానెళ్ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం.. ఒక‌రిపై ఒక‌రు బుర‌ద జ‌ల్లుకోవ‌డం.. కుట్ర‌ల‌కు పాల్ప‌డ‌డం వ‌గైరా క‌నిపిస్తుంటాయి. గ‌త కొన్నేళ్లుగా మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నిక‌లు ఇదే పంథాలో జ‌న‌ర‌ల్ ఎల‌క్ష‌న్స్ తీరుగా జ‌రుగుతున్నాయి. కానీ ద‌ర్శ‌క‌సంఘం ఎన్నిక‌లు దీనికి పూర్తి భిన్నంగా జ‌రుగుతుండంపై ఇప్పుడు ప‌రిశ్ర‌మ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది.

తాజాగా తెలుగు ద‌ర్శ‌కుల సంఘం ఎన్నిక‌లు సైలెంట్ గా పూర్త‌య్యాయి. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో జరిగిన దర్శకుల సంఘం ఎన్నికల్లో వీరశంకర్ ప్యానల్ ఘన విజయం సాధించింది. దర్శకుల సంఘం ప్రెసిడెంట్ అభ్య‌ర్థిగా పోటీచేసిన‌ డైరెక్టర్ వీర శంకర్ 232 ఓట్ల మెజారిటీ తో సముద్ర పై గెలుపొందారు. వీర శంక‌ర్ గ‌తంలో ద‌ర్శ‌క‌సంఘం అధ్య‌క్షుడిగా ప‌లుమార్లు ప‌ద‌విలో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మ‌రోసారి ఆయ‌న‌ను విజ‌యం వ‌రించింది. ఈ ఎన్నిక‌ల్లో మొత్తం 1113 ఓట్లు పోలవ్వ‌గా.. వైస్ ప్రెసిడెంట్స్ గా వశిష్ఠ 576 ఓట్లు, సాయి రాజేష్ 355 ఓట్ల తో ఎన్నికయ్యారు. జనరల్ సెక్రటరీగా సుబ్బారెడ్డి రెండు ఓట్ల తేడాతో మద్దినేని రమేష్ (394) పై గెలుపొందారు. సుబ్బారెడ్డికి 396 ఓట్లు ప‌డ్డాయి. జాయింట్ సెక్రటరీలు గా వడ్డాణం రమేష్ 436, కస్తూరి శ్రీనివాస్ 374 ఓట్లతో ఎన్నికవ్వ‌గా, ఆర్గనైజింగ్ సెక్రటరీలు గా ప్రియదర్శి 503, వంశీకృష్ణ 323 ఓట్లతో ఎన్నికయ్యారు. ట్రెజరర్ గా పి.వి.రామారావు ఎన్నికయ్యారు.

Tags:    

Similar News