మహేష్ ఇమేజ్ పెంచేలా.. జక్కన్న టీమ్ ప్లాన్..
అయితే ఇప్పుడు ఫ్యాన్స్ దృష్టంతా రాజమౌళితో చేయబోయే సినిమాపై పడింది.
గుంటూరు కారం హంగామా దాదాపుగా ముగిసినట్లే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్ పై అభిమానులు పెట్టుకున్న అంచనాలను సినిమా అందుకోలేకపోయింది. సంక్రాంతి బరిలో దిగి మిక్స్ డ్ టాక్ సంపాదించుకుంది. అయితే మహేశ్ స్టామినాతో వసూళ్లు బాగానే వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఫ్యాన్స్ దృష్టంతా రాజమౌళితో చేయబోయే సినిమాపై పడింది.
ఎప్పుడెప్పుడు ఈ చిత్రం షురూ అవుతుందా అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆ సమయం రానే వచ్చినట్లు ఉంది. రాజమౌళి, మహేష్ కాంబినేషన్ కు సంబంధించి చిన్న అప్డేట్ వచ్చినా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ మూవీ గ్రాండ్ లాంఛ్ కు జక్కన్న ఇంకా ముహూర్తం ఫిక్స్ చేయలేదు. కానీ రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మాత్రం ఇటీవలే అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. స్క్రిప్ట్ పూర్తయినట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్ పాల్గొన్న మరో ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 'రాజమౌళి సినిమా తర్వాత మహేశ్ ఇమేజ్ ఎంతో ఎత్తుకు వెళ్లిపోతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరి మీరేం అంటారు'అని జర్నలిస్ట్ విజయేంద్ర ప్రసాద్ ను ప్రశ్నించారు. 'మన ప్రయత్నం మనం చేస్తాం. ఆ తర్వాత భగవంతుడి దయ. మన సినిమాలోని నటీనటులకు ముఖ్యంగా లీడ్ ఆర్టిస్ట్ లకు మంచి పేరు రావాలి. అది సినిమాకు లాభమే. సినిమా బాగుంటే ఆయనకు పేరు వస్తుంది' అని బదులిచ్చారు విజయేంద్ర ప్రసాద్.
SSMB 29 పాన్ వరల్డ్ సినిమా లేక పాన్ ఇండియా సినిమా అని జర్నలిస్ట్ ప్రశ్నించారు. "పాన్ వరల్డ్ అంటే ఏంటి? నాకే అర్థం కావడం లేదు. దానికి కొలమాణాలు ఉన్నాయా? సినిమా బాగుంటే చూస్తారు. ముందు మన తెలుగు వాళ్ల కోసమే చిత్రం" అని చెప్పారు. ఇంకా మూవీకి టైటిల్ ఏం అనుకోలేదని, ఫారెస్ట్ డ్రాప్ లోనే సినిమా ఎక్కువగా ఉంటుందని చెప్పారు. SSMB 29 టోటల్ డిఫరెంట్ స్టోరీ అని పేర్కొన్నారు.
ఇటీవలే గుంటూరు టీమ్ కు పార్టీ ఇచ్చిన మహేశ్ బాబు.. ప్రస్తుతం జర్మనీలో ఉన్నారు. ఇటీవలే అక్కడ ఓ డాక్టర్ ను కలిసిన ఫొటో కూడా వైరల్ అయింది. అయితే హైదరాబాద్ లో మహేశ్ ల్యాండ్ అయ్యాక.. కొన్ని రోజులు రెస్ట్ తీసుకుని రాజమౌళి ప్రాజెక్ట్ లో నిమగ్నం అవుతారని తెలుస్తోంది. వచ్చే నెలలోనే ఈ మూవీకి సంబంధించి ఏదో ఒక అప్డేట్ వస్తుందని అంతా అనుకుంటున్నారు. అసలే ఈ ప్రాజెక్ట్ పాన్ వరల్డ్ గా రూపొందిస్తున్నారు జక్కన్న. దానికి తగ్గట్టే కథ, స్క్రిప్ట్, వీఎఫ్ఎక్స్ ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారట. ఇక ఈ మూవీకి సంబంధించిన ఇతర తారాగణం, టెక్నీషియన్ల వివరాలు ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.