2023 టాలీవుడ్.. ప్లస్సా మైనస్సా?
ఇక ఫిబ్రవరిలో సుమారు 16 కు పైగా సినిమాలు విడుదలయితే అందులో రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ అందుకోగా ఒక సినిమా హిట్ గా నిలిచింది.
మరో రెండు రోజుల్లో 2023 కి గుడ్ బై చెప్పి 2024 కి వెల్కమ్ చెప్పబోతున్నాం. మరి ఈ ఇయర్ టాలీవుడ్ ఇండస్ట్రీ ఎన్ని హిట్స్ ని డెలివరీ చేసింది? ఎన్ని ప్లాప్స్ ని చవి చూసింది? అసలు 2023 టాలీవుడ్ కి లాభాలను తెచ్చిపెట్టిందా? నష్టాన్ని మిగిల్చిందా? అనే విషయాలను డీటెయిల్డ్ గా తెలుసుకుందాం.. 2023 ఇయర్ స్టార్టింగే టాలీవుడ్ కి వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాల రూపంలో రెండు హిట్స్ వచ్చాయి. సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ సినిమాల్లో 'వాల్తేరు వీరయ్య' బ్లాక్ బాస్టర్ అందుకోగా 'వీరసింహారెడ్డి' సూపర్ హిట్ గా నిలిచింది. అదే సంక్రాంతి సీజన్ లో కోలీవుడ్ హీరో విజయ్ నటించిన తమిళ డబ్బింగ్ మూవీ 'వారసుడు' తెలుగులోనూ మంచి సక్సెస్ అందుకుంది.
సంక్రాంతి సీజన్ తర్వాత జనవరి చివరి వారంలో వచ్చిన బాలీవుడ్ మూవీ 'పఠాన్' తెలుగులోనూ మంచి కలెక్షన్స్ అందుకుంది. ఇక ఫిబ్రవరిలో సుమారు 16 కు పైగా సినిమాలు విడుదలయితే అందులో రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ అందుకోగా ఒక సినిమా హిట్ గా నిలిచింది. కలర్ ఫోటో హీరో సుహాస్ నటించిన 'రైటర్ పద్మభూషణ్' ఫిబ్రవరి స్టార్టింగ్ లో రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత కోలీవుడ్ హీరో ధనుష్ చేసిన స్ట్రైట్ తెలుగు ఫిలిమ్ 'సార్' 100 కోట్ల వసూళ్లు రాబట్టి బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
ఇదే నెలలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన 'వినరో భాగ్యము విష్ణు కథ' ఆడియన్స్ నుంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక మార్చిలోనూ 15 సినిమాలు రిలీజ్ అయితే వాటిలో కేవలం మూడు మాత్రమే సక్సెస్ అయ్యాయి. అందులో జబర్దస్త్ వేణు తెరకెక్కించిన 'బలగం' ఓ చిన్న సినిమాగా రిలీజ్ అయి పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. బలగం తర్వాత విశ్వక్ సేన్ నటించిన 'దాస్ కా ధమ్కీ' ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీస్ వల్ల డీసెంట్ కలెక్షన్స్ అందుకుంది.
ఇక ఏప్రిల్ నెలలో సుమారు పది సినిమాలు రిలీజ్ అయితే అందులో సాయి ధరంతేజ్ నటించిన 'విరూపాక్ష' సినిమా మాత్రమే బ్లాక్ బస్టర్ సొంతం చేసుకోగా అఖిల్ నటించిన ఏజెంట్, సమంత శాకుంతలం.. ఈ ఇయర్ బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లిస్ట్ లో చేరాయి. ఇక సమ్మర్ లో అంటే మే నెలలో గోపీచంద్ రామబాణం, అల్లరి నరేష్ ఉగ్రం, నాగచైతన్య కస్టడీ.. సినిమాలు ప్లాప్స్ అందుకుంటే విజయ్ ఆంటోని నటించిన తమిళ డబ్బింగ్ సినిమా 'బిచ్చగాడు 2' హిట్ గా నిలిచింది. ఆ తర్వాత 'మేం ఫేమస్' అనే చిన్న సినిమా కూడా హిట్ అయింది.
వీటితోపాటు '2018' అనే మలయాళ డబ్బింగ్ సినిమా కూడా తెలుగులో మంచి సక్సెస్ అందుకుంది. జూన్ నెలలో 15 పైగా సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో శ్రీ విష్ణు నటించిన 'సామజవరగమన' సినిమా మాత్రమే బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుంది. ఆ నెలలో భారీ అంచనాలతో వచ్చిన ప్రభాస్ 'ఆదిపురుష్' డిజాస్టర్ గా నిలిచింది. జూలై లో దాదాపు అన్ని చిన్న సినిమాలే విడుదలయ్యాయి. ఈ నెలలో సుమారు 17 సినిమాలు రిలీజ్ అయితే వాటిలో ఆనంద్ దేవరకొండ నటించిన 'బేబీ' సినిమా ఒక్కటే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇదే నెలలో వచ్చిన పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ల మెగా మల్టీ స్టారర్ 'బ్రో' బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ అయింది. ఆగస్ట్ నెలలో రజినీకాంత్, చిరంజీవి లాంటి సీనియర్ స్టార్స్ పోటీ పడ్డారు. ఈ ఇద్దరిలో రజనీకాంత్ 'జైలర్' తో బ్లాక్ బస్టర్ అందుకోగా చిరంజీవి 'భోలా శంకర్' తో డిజాస్టర్ మూటగట్టుకున్నారు.
ఆ తర్వాత ఆగస్టు చివర్లో వచ్చిన 'బెదురులంక 2012' ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుని సూపర్ హిట్ గా నిలిచింది. సెప్టెంబర్ నెలలో కొన్ని పెద్ద సినిమాలు కొన్ని, మీడియం రేంజ్ సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో నవీన్ పోలిశెట్టి నటించిన 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' బ్లాక్ బస్టర్ అవ్వగా బాలీవుడ్ డబ్బింగ్ మూవీ 'జవాన్' తెలుగులో డీసెంట్ కలెక్షన్ తో హిట్ గా నిలిచింది. భారీ అంచనాలతో వచ్చిన 'ఖుషి' బిలో యావరేజ్ గా నిలిచింది. ఇదే నెలలో వచ్చిన 'స్కంద' ప్లాప్ అయింది. ఇక దసరా సీజన్ అంటే అక్టోబర్లో చూసుకుంటే దసరా కంటే ముందు రిలీజ్ అయిన సినిమాల్లో 'మ్యాడ్' సూపర్ హిట్ అయింది. ఇక దసరాకి రిలీజ్ అయిన సినిమాల్లో 'లియో', 'భగవంత్ కేసరి' సక్సెస్ అందుకోగా రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' యావరేజ్ తో సరిపెట్టుకుంది.
నవంబర్ నెలలో సుమారు 20 సినిమాలు రిలీజ్ అయితే వాటిలో 'పొలిమేర 2' మాత్రమే బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుంది. నవంబర్ ఎండింగ్ లో వచ్చిన 'కోటబొమ్మాలి పిఎస్' డీసెంట్ కలెక్షన్స్ తో సూపర్ హిట్ అయింది. ఇక ఇదే నెలలో మంచి అంచనాలతో రిలీజ్ అయిన కీడా కోకా, జపాన్, ఆది కేశవ వంటి సినిమాలు ప్లాప్ అవ్వగా అజయ్ భూపతి 'మంగళవారం' సినిమా మాత్రం యావరేజ్ దగ్గరే ఆగిపోయింది. ఇక ఇయర్ ఎండింగ్ మంత్ అయిన డిసెంబర్లో 10 సినిమాలు రిలీజ్ అయితే ఇప్పటివరకు మూడు సినిమాలు మంచి సక్సెస్ అందుకున్నాయి.
డిసెంబర్ 1న రిలీజ్ అయిన 'యానిమల్', 'హాయ్ నాన్న' సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇక డిసెంబర్ 22న రిలీజ్ అయిన 'సలార్' భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. డిసెంబర్ లాస్ట్ వీకెండ్ కళ్యాణ్ రామ్ 'డెవిల్', రోషన్ కనకాల 'బబుల్ గమ్' సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాలు ఫుల్ రన్ లో ఎలాంటి రిజల్ట్ ని అందుకుంటాయో చూడాలి. ఓవరాల్ గా 2023 సంవత్సరంలో చిన్న, పెద్ద, డబ్బింగ్ సినిమాలన్నీ కలుపుకొని సుమారు 170 కి పైగా సినిమాలు రిలీజ్ అయితే వాటిలో సగంలో సగం సినిమాలు కూడా పెట్టిన పెట్టుబడికి తగ్గట్టుగా లాభాలు అందించలేదు. ప్రతీ ఏడాది సక్సెస్ రేటు 20% శాతం కూడా ఉండడం లేదు. ఇక ఈసారి కూడా అప్పుడప్పుడు మాత్రమే బాక్సాఫీస్ కలెక్షన్లు కనిపించాయి.
అయితే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఏడాది స్టార్ హీరోల సినిమాలేవి రిలీజ్ కాలేదు. ఈ జనరేషన్ స్టార్స్ లో ఒక్క ప్రభాస్ నుంచి మాత్రమే ఈ ఏడాది రెండు పాన్ ఇండియా సినిమాలు వచ్చాయి. వాటిలో ఆదిపురుష్ డిజాస్టర్ అయితే సలార్ హిట్ అందుకుంది. మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి హీరోల నుంచి ఈ ఏడాది ఒక్క సినిమా కూడా రాకపోవడం గమనార్హం. మొత్తంగా 2023 సంవత్సరం టాలీవుడ్ కి నష్టాలను మిగిల్చినట్టే అని చెప్పొచ్చు.