వియత్నాం దారిలో మెగా కనకరాజు..!

గత ఏడాది ఆపరేషన్‌ వాలెంటైన్‌, మట్కా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరుణ్ తేజ్ నిరాశ పరిచారు.

Update: 2025-01-27 06:04 GMT

గత ఏడాది ఆపరేషన్‌ వాలెంటైన్‌, మట్కా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరుణ్ తేజ్ నిరాశ పరిచారు. ముఖ్యంగా మట్కా సినిమా కోసం వరుణ్‌ తేజ్ చాలా కష్టపడ్డారు. మూడు విభిన్నమైన గెటప్స్‌లో వరుణ్‌ తేజ్ కనిపించారు. ఆ సినిమా ప్రమోషన్‌ సమయంలోనూ చాలా యాక్టివ్‌గా కనిపించారు. సోషల్‌ మీడియా ద్వారా రెగ్యులర్‌గా సినిమా గురించి పోస్ట్‌లు షేర్‌ చేయడం మాత్రమే కాకుండా మీడియా సమావేశాలకు హాజరు అయ్యి, పలు ఇంటర్వ్యూలు ఇచ్చారు. కానీ 'మట్కా' సినిమా నిరాశ పరిచింది. మట్కా సినిమా మాత్రమే కాకుండా గత మూడు నాలుగు ఏళ్లలో వరుణ్‌ తేజ్‌కి సోలో హీరోగా మంచి విజయం దక్కలేదు.

సక్సెస్ కోసం చకోరా పక్షిలా ఎదురు చూస్తున్న వరుణ్‌ తేజ్‌ కోసం మేర్లపాక గాంధీ విభిన్నమైన కాన్సెప్ట్‌ని రెడీ చేశారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ ముగించిన గాంధీ షూటింగ్‌కి రెడీ అయ్యారు. ఇప్పటి వరకు వరుణ్ తేజ్‌ కనిపించని విభిన్నమైన జోనర్‌లో కనిపించబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. హర్రర్ కామెడీ జోనర్‌లో రూపొందుతున్న ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌కి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. తాజాగా చిత్ర యూనిట్‌ సభ్యులు వియత్నాం వెళ్లారు. అక్కడ కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లుగా తెలుస్తోంది. సినిమా కథ నేపథ్యంలో వియత్నాం షెడ్యూల్‌ని ప్లాన్‌ చేశారని చిత్ర యూనిట్‌ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది.

ఈ సినిమాకు 'కొరియన్‌ కనకరాజు' అనే విభిన్నమైన టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. త్వరలోనే టైటిల్‌ గురించి అధికారికంగా ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో ఎక్కువ శాతం మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అందుకే ఈ సినిమాకి ముందస్తుగానే పాజిటివ్ బజ్ క్రియేట్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వరుణ్ తేజ్ ఎలాంటి పాత్ర అయినా ఒదిగి పోతారని ఇప్పటికే నిరూపితం అయ్యింది.అందుకే ఈ సినిమాతో మరోసారి ఆయన ప్రేక్షకులను భయపెట్టడంతో పాటు నవ్వించడం ఖాయం అనే విశ్వాసంను మెగా ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు.

వరుణ్‌ తేజ్‌, మేర్లపాక గాంధీ కాంబోలో రూపొందుతున్న ఈ సినిమాకు థమన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం ఆయన రెండు ట్యూన్స్‌ని రెడీ చేశారని తెలుస్తోంది. యూవీ క్రియేషన్స్‌తో కలిసి క్రిష్ ఈ సినిమాను నిర్మిస్తున్న నేపథ్యంలో అంచనాలు మరింతగా పెరిగాయి. క్రిష్ కథల ఎంపిక విషయంలో చాలా మంచి పట్టున్న దర్శకుడు. అలాంటి దర్శకుడు సినిమా నిర్మాణ భాగస్వామిగా ఉన్న కారణంగా కచ్చితంగా మంచి కంటెంట్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాదిలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా స్పీడ్‌గా షూటింగ్ పూర్తి చేయాలని దర్శకుడు భావిస్తున్నారు. మొదటి షెడ్యూల్‌ పూర్తి అయిన తర్వాత సినిమా గురించిన మరిన్ని విషయాలను యూనిట్‌ సభ్యులు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News