సీక్వెల్స్ రొటీన్ అయ్యాయి అందుకే ఇలా!
ఆ సినిమాను చూసి ఎన్నో సినిమాలు తమ సినిమాలకు సీక్వెల్స్ ను అనౌన్స్ చేశాయి.;
ఇండియన్ సినిమాలో ఈ మధ్య సీక్వెల్స్ ట్రెండ్ బాగా ఎక్కువైపోయింది. బాహుబలి సినిమాతో మొదలైన ఈ ట్రెండ్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమాను చూసి ఎన్నో సినిమాలు తమ సినిమాలకు సీక్వెల్స్ ను అనౌన్స్ చేశాయి. ఇప్పుడు స్టార్ హీరోలందరూ ఈ సీక్వెల్స్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
ఇప్పటికే బాహుబలి, కెజిఎఫ్, పుష్ప సినిమాలు సీక్వెల్స్ తో కూడా ఎలాంటి రిజల్ట్స్ ను అందుకున్నాయో అందరికీ తెలుసు. అయితే ఇప్పటివరకు ప్రతీ సినిమా ఫస్ట్ పార్ట్ రిలీజై అది హిట్టయితే సెకండ్ పార్ట్ రావడం చూశాం. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు అందరూ ఇదే ఫాలో అవుతూ వచ్చారు. కానీ సినీ ఇండస్ట్రీలోనే మొదటిసారి ఎవరూ ఊహించని విధంగా విక్రమ్ నటించిన వీర ధీర శూర మొదట రెండో పార్ట్ ను రిలీజ్ చేస్తున్నారు.
వీర ధీర శూర పార్ట్2 మార్చి27న రిలీజ్ కానుంది. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ పార్ట్ రిలీజ్ చేసి ఆ తర్వాత ఫస్ట్ పార్ట్ ను తెరకెక్కించనున్నారు చిత్ర యూనిట్. ఎంతో నమ్మకం ఉంటే తప్ప ఇలాంటి ప్రయోగాలు చేయలేరు. వీర ధీర శూర పార్ట్2 రిజల్ట్ ఏ మాత్రం తేడా కొట్టినా మొదటి పార్ట్ కు అనుకున్న హైప్ రాదు, బిజినెస్ జరగదు.
అయితే ఈ విషయంపై రీసెంట్ గా హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లో హీరో విక్రమ్ క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమాలో బ్యూటిఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఉందని, అందులో చాలా రొమాంటిక్ సీన్స్ ఇంకా చాలా ఉంటాయని డైరెక్టర్ తనకు చెప్పారని, అయితే మనం దీన్ని పార్ట్2 గా రిలీజ్ చేసి, తర్వాత ఫస్ట్ పార్ట్ ను చేద్దామని చెప్పానని అన్నారు.
సినిమాలో అసలు హీరో హీరోయిన్ ఎలా కలిశారు? వారి మధ్య ప్రేమ ఎలా మొదలైంది? తన మొఖం మీద ఉన్న దెబ్బకు కారణమేంటి ఇలాంటి విషయాలన్నీ ఫస్ట్ పార్ట్ లో ఉంటాయని విక్రమ్ తెలిపారు. సీక్వెల్స్ రొటీన్ అయ్యాయని దీనికి ప్రీక్వెల్ ప్లాన్ చేశామని కూడా విక్రమ్ చెప్పారు. కిరాణా కొట్టు యజమానికి ఒక రాత్రి ఎదురైన ప్రమాదాల వల్ల పోలీస్ ఆఫీసర్, స్థానిక గూండాతో గొడవ పెట్టుకోవాల్సి వస్తే, దాన్నుంచి అతనెలా బయట పడ్డాడనే కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా మొత్తాన్ని చీకటిలో తీశారనే విషయం ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది.