స్టార్ హీరో ఫ్యామిలీ 100 కోట్లతో నగల వ్యాపారం.. చిక్కుల్లో బావమరిది!
అ కేసు నమోదైన తర్వాత అతడు చట్టపరమైన దర్యాప్తు పరిధిలోకి వచ్చారు.;
స్టార్ హీరో విశాల్ పేరు ఊహించని కారణాలతో హెడ్ లైన్స్ లోకొచ్చింది. ప్రముఖ ఆభరణాల వ్యాపారి, విశాల్ బావమరిది ఉమ్మిడి కృతిస్‌పై సీబీఐ దర్యాప్తు జరుగుతుండడం సినీపరిశ్రమలో చర్చగా మారింది. అ కేసు నమోదైన తర్వాత అతడు చట్టపరమైన దర్యాప్తు పరిధిలోకి వచ్చారు. ఉమ్మిడి కృతిస్ నకిలీ పత్రాలను ఉపయోగించి గృహ రుణ మోసంలో భాగం అయ్యారని, రూ. 2.5 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి.
విశాల్ సోదరి ఐశ్వర్య.. ప్రఖ్యాత ఆభరణాల వ్యాపారి ఉమ్మిడి కృతిస్ ని పెళ్లాడారు. ఈ జంట 2019లో సినీ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్‌గా వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమార్తె. కృతిస్‌పై చట్టపరమైన చర్యల కారణంగా ఇప్పుడు విశాల్ పేరు, అతడి కుటుంబం ప్రముఖంగా మీడియాలో హైలైట్ అవుతోంది.
విశాల్ తమిళ చిత్రసీమతో పాటు సౌతిండియాలోనే పేరున్న హీరో. అతడికి దక్షిణాది అంతటా ఫ్యాన్స్ ఉన్నారు. ఇటీవల ముంబై పరిశ్రమలో సీబీఎఫ్‌సి సర్టిఫికేషన్ లో లంచగొండితనం భోగోతాన్ని వెలికి తీసి అతడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాడు.
ఒక తెలుగు వాడై, తమిళ ఇండస్ట్రీని ఏలడం, రాజకీయాల్లో చురుకైన పాత్రను పోషిస్తుండడంతో విశాల్ కి శత్రువులు కూడా ఎక్కువే. విశాల్ పేరు నిరంతర వివాదాల్లో నలుగుతున్నా, అతడు కెరీర్ పరంగా అత్యున్నత స్థాయికి చేరుకున్నాడు. వరుసగా చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇటీవల అనారోగ్య సమస్యల కారణంగా అతడు సినిమాలకు గ్యాప్ ఇచ్చాడన్న చర్చ సాగింది. ఇంతలోనే ఇప్పుడు బావమరిది కేసు అతడి పేరును మీడియా హెడ్ లైన్స్ లోకి లాగింది. 40 ఏళ్ల విశాల్ పెళ్లి మాటెత్తకుండా, ప్రస్తుతం సినిమాలు చేస్తున్నాడు. విశాల్ చిత్ర పరిశ్రమను ఆధిపత్యం చేస్తుండగా, అతడి కుటుంబం నగల వ్యాపారంలో బాగా స్థిరపడింది. అతడి తండ్రి సహా బంధువులు చాలా మంది నగల దుకాణాలను నడుపుతున్నారు. వారి కుటుంబీకులంతా నగల దుకాణాల్లో భారీ పెట్టుబడులు పెట్టారు. దీని విలువ సుమారు 100 కోట్లు ఉంటుందని కూడా గుసగుసలు ఉన్నాయి.