జానీ మాస్టర్ కేసు.. నా వెనుక బన్నీ లేడు!

టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

Update: 2025-01-27 07:32 GMT

టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. తనపై వేధింపులకు పాల్పడ్డాడంటూ ఆయన అసిస్టెంట్‌ అయిన ఓ లేడీ కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ కేసులో అరెస్ట్‌ అయిన జానీ.. కొంతకాలం జైలులో ఉండి ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చారు.

ఆ తర్వాత తన వర్క్ తో ఆయన బిజీ అయ్యారు. అదే సమయంలో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. దీంతో ఆయన బెయిల్ రద్దు అవుతుందని వార్తలు రాగా, నిర్దోషిగా బయటకు వస్తానని తెలిపారు. న్యాయస్థానంపై తనకు నమ్మకముందని వీడియో మెసేజ్ లో తెలిపారు. దాంతోపాటు పలు ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు.

అదే సమయంలో ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో బాధితురాలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మంచి కోసం పోరాటం చేస్తున్నట్లు తెలిపిన ఆమె.. తనను ఆదర్శంగా తీసుకుని కొందరు అమ్మాయిలు అయినా ధైర్యంగా మారినా చాలు అని చెప్పారు. జానీ మాస్టర్ పై రివెంజ్ తీర్చుకునేందుకు తాను కేసు పెట్టలేదని చెప్పడం గమనార్హం.

"నాలుగేళ్ల తర్వాత నేను ఎందుకు కేసు పెట్టానని అందరూ అడుగుతున్నారు. నేను చెప్పేదేమిటంటే.. అప్పుడు నేను మైనర్ ను. నాకు పోరాడే శక్తి లేదు. అందుకే ఆయనలో ఛేంజ్ వస్తుందని వెయిట్ చేశాను. కానీ ఎలాంటి మార్పు లేదు. ఆ తర్వాత వేధింపులు పెరిగిపోయాయి. అందుకే పోలీస్ కేసు పెట్టాల్సి వచ్చింది" అని తెలిపారు.

అదే సమయంలో తాను కేసు పెట్టడానికి తన వెనుక అల్లు అర్జున్ ఉన్నారని వస్తున్న వార్తలపై ఆమె రెస్పాండ్ అయ్యారు. "నా వెనుక ఎవరో ఉన్నారని అంటున్నారు. ఎవరూ లేరు. కేసు పెట్టాలని ఎవరూ నన్ను ఎంకరేజ్ చేయలేదు. పలు రాజకీయ పార్టీలు, ఎవరో వ్యక్తులు ఉన్నారన్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు" అని చెప్పారు.

అలా తన వెనుక అల్లు అర్జున్ లేరని ఆమె క్లారిటీ ఇచ్చినట్లే. అయితే జానీ మాస్టర్ కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జాతీయ అవార్డు రద్దు కావడానికి కారణం ఆమేనని వార్తలు వచ్చాయి. కానీ తానేం చేయలేదని చెప్పిన బాధితురాలు.. తాను అసలు లాయర్ పెట్టుకోలేదని చెప్పారు. అందుకే తన అడ్వకేట్ లెటర్ రాశారని వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపారు. మైండ్ సెట్ బాగోలేదు అంటే ప్రొఫెషన్ కూడా బాగా లేనట్లే కదా అంటూ జానీ మాస్టర్ గురించి వ్యాఖ్యానించడం గమనార్హం.

Tags:    

Similar News