ఒకే ఒక్క విశ్లేషణ.. మస్క్‌కు 75 వేల కోట్ల దెబ్బ!
ప్రముఖ హెచ్ ఎస్ బీసీ విశ్లేషకుడు మైకేల్ టిండాల్.. మస్క్ వ్యాపార సామ్రాజ్యం.. టెస్లా పరిస్థితిని విశ్లేషించారు.
విశ్లేషణలు.. ఇటు రాజకీయాల్లోనే కాదు.. అటు వ్యాపారాల్లోనూ ప్రభావం చూపుతుంటాయి. రాజకీయ విశ్లేషణలు.. ఒక నేతపై లేదా.. ఒక పార్టీపై ప్రభావం చూపితే.. వ్యాపార , వాణిజ్య రంగాల్లో విశ్లేషణలు.. ప్రపంచంపైనే ప్రభావం చూపుతున్నాయి. ఈ షేర్ బాగుందని.. ఫ్యూచర్‌లోనూ బాగుంటుందని ఎవరైనా కీలక విశ్లేషకుడు విశ్లేషణ చేస్తే.. ఇక, ఆ షేర్ దిగంతాలు దాటిపోయి.. ఇబ్బడిముబ్బడి లాభాలు తెచ్చిపెడుతుంది.
అదేసమయంలో విశ్లేషకులు ఏదైనా షేర్ కానీ, త్రైమాసిక ఫలితాల్లో తేడా వస్తోందని కానీ, చెబితే.. ఇక, అంతే.. సదరు షేర్‌లు పతనం కావడం ఖాయం. ఇప్పుడు ఇలాంటి విశ్లేషణే ప్రపంచ కుబేరుడుగా పేరొందిన టెస్లా వ్యాపార దిగ్గజం, ట్విట్టర్(ఎక్స్) అధినేత ఎలాన్ మస్క్‌కు భారీ నష్టం చేకూర్చింది. ఆయన వ్యాపార సామ్రాజ్యానికి చెందిన షేర్లు పతనం కావడంతో ఏకంగా .. ఒక్క రోజులోనే రూ.75 వేల కోట్ల సంపద ఆవిరైంది.
ప్రముఖ హెచ్ ఎస్ బీసీ విశ్లేషకుడు మైకేల్ టిండాల్.. మస్క్ వ్యాపార సామ్రాజ్యం.. టెస్లా పరిస్థితిని విశ్లేషించారు. ఈ సందర్భంగా ఆయన టెస్లా పరిస్థితి నిరాశాజనకంగా ఉందని, త్రైమాసిక ఫలితాలు ఏమీ బాగోలేదని చెప్పుకొచ్చారు. అంతే.. ఒక్కసారిగా మస్క్ వ్యాపారం పతనం దిశగా ముందుకు సాగింది. టెస్లా షేర్లు.. వెంటవెంటనే పడిపోవడం ప్రారంభమయ్యాయి. ఇలా .. మొత్తం రూ.75 వేల కోట్ల సంపద.. (9బిలియన్ డాలర్లు) ఆవిరైంది. దీంతో టెస్లాలో పెట్టుబడి పెట్టిన వారు సైతం నష్టపోయారు. అయితే.. మస్క్ 18 లక్షల కోట్ల ఆస్తితో ప్రపంచ దిగ్గజంగానే ఉండడం గమనార్హం.