ఎన్డీయే కూటమికి అన్నాడీఎంకే షాక్!
ఎన్డీయే, బీజేపీతో సంబంధాలు తెంచుకుంటున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు చెన్నైలో జరిగిన అన్నాడీఎంకే పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షుల సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడం కోసం బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ రెండు కూటములు పోటాపోటీగా సమావేశాలు నిర్వహించాయి. ఇండియా కూటమిలో 28 పార్టీల వరకు ఉండగా ఎన్డీయే కూటమిలోనూ దాదాపు అంతే పార్టీలున్నాయి.
ఈ నేపథ్యంలో ఎన్డీయే కూటమికి అందులోని ముఖ్య పార్టీల్లో ఒకటైన అన్నాడీఎంకే గట్టి షాక్ ఇచ్చింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో కొనసాగుతోంది. ఇటీవల ఢిల్లీలో బీజేపీ నిర్వహించిన కూటమి భాగస్వామ్య పక్షాల సమావేశానికి అన్నాడీఎంకే కూడా హాజరైంది.
అన్నాడీఎంకే తరఫున ఆ పార్టీ అధినేత పళనిస్వామి హాజరై ప్రధాని నరేంద్ర మోదీ వెనుకే నుంచుని ఫొటోలకు ఫోజులిచ్చారు. అయితే ఇంతలోనే ఎన్డీయే కూటమి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి అన్నాడీఎంకే షాక్ ఇచ్చింది.
బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే నుంచి అన్నాడీఎంకే పార్టీ వైదొలగింది. ఎన్డీయే, బీజేపీతో సంబంధాలు తెంచుకుంటున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు చెన్నైలో జరిగిన అన్నాడీఎంకే పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షుల సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.
బీజేపీతో తెగదెంపులు చేసుకుంటున్నట్టు అన్నాడీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ కేపీ మునుస్వామి ప్రకటించారు. గత కొంత కాలంగా తమిళనాడులో బీజేపీ, అన్నాడీఎంకే నేతల మధ్య పలు అంశాలపై తీవ్రస్థాయిలో విభేదాలు పొడచూపుతున్నాయి. ఈ విభేదాలు తారస్థాయికి చేరిన నేపథ్యంలో అన్నాడీఎంకే తాజా నిర్ణయం తీసుకుంది. దీంతో ఆ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద ఆ పార్టీ శ్రేణులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నాయి.
ఈ సందర్బంగా అన్నాడీఎంకే డిప్యూటీ సెక్రటరీ జనరల్ కేపీ మునుస్వామి మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈరోజు నుంచి బీజేపీ, ఎన్డీయే కూటమితో అన్నాడీఎంకే తెగతెంపులు చేసుకుంటోందని తెలిపారు. నేడు జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు అన్నాడీఎంకే ఏకగ్రీవంగా తీర్మానం చేసిందన్నారు. బీజేపీ తమిళనాడు నాయకత్వం తమ పార్టీ నేతలపై తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. గత ఏడాది కాలంగా తమ పార్టీ జనరల్ సెక్రటరీ పళనిస్వామి, పార్టీ కేడర్‌పై బీజేపీ నేతలు పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ఈ సందర్భంగా మునుస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అన్నాడీఎంకే కొత్త కూటమిని ఏర్పాటు చేసి ఎన్నికలకు వెళ్తుందని బాంబుపేల్చారు. గత తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ కలిసి పోటీ చేసి ఓటమి పాలయిన విషయం తెలిసిందే.
అన్నాడీఎంకే.. ఎన్డీయే కూటమి నుంచి వైదొలగడంతో దేశ, తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకున్నట్టేనని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు కూటమిలో కీలక పార్టీల్లో ఒకటిగా అన్నాడీఎంకే వైదొలగడం బీజేపీకి పెద్ద దెబ్బేనని అంటున్నారు.