సహాయ మంత్రి పదవికి నో... ఎన్డీయేలో తొలి అసంతృప్తి !

ఎన్డీయే బండి చాలా పార్టీల మీద ఆధారపడి నడపాల్సి వస్తోంది. అనేక పార్టీలను బుజ్జగిస్తూ ముందుకు పోవాల్సి వస్తోంది.

Update: 2024-06-09 14:38 GMT

ఎన్డీయే బండి చాలా పార్టీల మీద ఆధారపడి నడపాల్సి వస్తోంది. అనేక పార్టీలను బుజ్జగిస్తూ ముందుకు పోవాల్సి వస్తోంది. దీంతో మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ అజిత్ పవార్ పార్టీకి నరేంద్ర మోడీ ఒక సహాయ మంత్రి పదవిని ఆఫర్ చేశారు. అయితే ఆ పదవి తమను చిన్నబుచ్చేదిగా ఉందని వద్దు అంటూ అజిత్ పవార్ ఎన్సీపీ తిరస్కరించినట్లుగా తెలుస్తోంది.

ఎన్సీపీకి చెందిన ఎంపీ ప్రఫుల్ పటేల్ కి సహాయ మంత్రి అంటే ఆ పార్టీ కస్సుమంటోంది. ఇక ప్రఫుల్ పటేల్ అయితే తాను గతంలోనే కేంద్రంలో క్యాబినెట్ ర్యాంక్ హోదాతో పనిచేశాను అని చెప్పారు. అలాంటి తనకు సహాయ మంత్రి పదవి ఏంటి అని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇక ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ అయితే తమ పార్టీకి ఒక క్యాబినెట్ ర్యాంక్ మంత్రి పదవి ఇవ్వాల్సిందే అని పట్టుబట్టి కూర్చున్నారు. దాంతో మోడీ ఇచ్చిన సహాయ మంత్రి పదవికి నో చెప్పేశారు. అలా చూస్తే ఎన్డీయే కూటమిలో లుకలుకలకు ఇది అద్దం పడుతోంది అని అంటున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా జరిగిన ఎన్నికల్లో అజిత్ పవార్ నాయకత్వంలోని ఎన్సీపీకి కేవలం ఒకే ఒక్క ఎంపీ సీటు దక్కింది. దాంతోనే మోడీ సహాయ మంత్రి పదవి ఇచ్చారని అంటున్నారు. అయితే మహారాష్ట్రలో ఓడినా తమకు బలం ఉందని ఎన్సీపీ అంటోంది.

అయితే ఈ విషయంలో ఆందోళన వద్దు అని మరోసారి విస్తరణలో ఎన్సీపీ డిమాండ్ ని పరిశీలిస్తారు అని మహారాష్ట్ర బీజేపీ నేత ఫడ్నవీస్ చెప్పారు. ఇదంతా పెద్ద విషయం కాదని సర్ది చెప్పుకున్నారు. మరో వైపు ప్రఫుల్ పటేల్ కూడా బీజేపీ ఎన్సీపీల మధ్య గ్యాప్ లేదని వివరణ ఇచ్చారు.

తనకు సహాయ మంత్రి పదవి ఇస్తామని గత రాత్రి కబురు చేశారని తాను గతంలోనే కేంద్ర మంత్రిగా క్యాబినెట్ ర్యాంక్ తో చేశాను కాబట్టి ఈ సహాయ మంత్రి పదవి వద్దు అని మాత్రమే చెప్పాను అన్నారు. అయితే కొద్ది రోజులు వేచి చూడమని బీజేపీ పెద్దలు తనకు సమాచారం ఇచ్చారని ఆయన అన్నారు.

అయితే దీని మీద ఎన్సీపీ వాదన మరోలా ఉంది. తమకు లోక్ సభలో ఒక ఎంపీ ఉన్నారని సహాయ మంత్రి పదవిని ఇవ్వడం భావ్యం కాదని రాజ్యసభలో నలుగురు ఎంపీలు తమకు ఉన్నారని వారు గుర్తు చేస్తున్నారు. మొత్తంగా అయిదురు ఎంపీలు ఉన్నట్లుగా వారు చెబుతున్నారు. ఈ విషయాలను బీజేపీ పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు.

తమకు వేచి చూడామన్నారని క్యాబినెట్ ర్యాంక్ పదవి కోసం కొన్ని రోజులు వేచి చూస్తామని ఎన్సీపీ నేతలు చెప్పడం విశేషం. మరో వైపు ఈసారి బీజేపీకి మెజారిటీ రాకపోవడంతో ప్రతీ ఒక్క ఎంపీ కీలకమే. మహారాష్ట్రలో చూసుకుంటే అజిత్ పవార్ బలంగానే ఉన్నారు. శరద్ పవార్ తో ఆయన చేయి కలిపితే ఇబ్బందే అని అంటున్నారు.

Tags:    

Similar News