పోలీసులకు అక్బరుద్దీన్ వార్నింగ్.. బీజేపీ బుల్డోజర్ రియాక్షన్!
ఈ సమయంలో హైదరాబాద్ లోని చాంద్రాయణగుట్ట ఎంఐఎం అభ్యర్థి అక్బరుద్ధీన్ ఓవైసీ ప్రచారంలో ఉండగా... పోలీసులకు అతనికీ మధ్య జరిగిన సంఘటన తీవ్ర చర్చనీయాంశం అవుతుంది.
హైదరాబాద్ పోలీసులుపై చంద్రాయణగుట్ట ఎంఐఎం అభ్యర్థి అక్బరుద్ధీన్ ఓవైసీ తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. తాను ఒక్క సైగ చేస్తే.. ఇక్కడి నుంచి పరుగులు పెడతారని పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. ఈ వార్నింగ్ పై బీజేపీ మండిపడుతుంది. దీనికి సంబందించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. సంతోష్ నగర్ పీఎస్ పరిధిలో గతరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
అవును... తెలంగాణ ఎన్నికల ప్రచారం మరికొన్ని రోజుల్లో ముగియనుంది. ఈ నెల 28వ తేదీ తెలంగాణ ఎన్నికల ప్రచారానికి చివరి తేదీ. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలూ ప్రచారాలతో హోరెత్తించేస్తున్నాయి. ఈ సమయంలో హైదరాబాద్ లోని చాంద్రాయణగుట్ట ఎంఐఎం అభ్యర్థి అక్బరుద్ధీన్ ఓవైసీ ప్రచారంలో ఉండగా... పోలీసులకు అతనికీ మధ్య జరిగిన సంఘటన తీవ్ర చర్చనీయాంశం అవుతుంది.
వివరాళ్లోకి వెళ్తే... చంద్రాయణగుట్ట నియోజకవర్గం సంతోష్ నగర్ పీఎస్ పరిధిలో గతరాత్రి ఎంఐఎం అభ్యర్థి అక్బరుద్ధీన్ ఓవైసీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో ప్రచార సమయం ముగిసిందని సంతోష్ నగర్ ఇన్‌స్పెక్టర్ పి.శివచంద్ర... అక్బరుద్దీన్ ఒవైసీకి గుర్తుచేశారు! దీంతో ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయారు అక్బరుద్దీన్.
ఈ క్రమంలో... ప్రచారం ముగించాల్సిన సమయానికి ఇంకా ఐదు నిమిషాలు ఉందని, ఐదు నిమిషాల ముందే ప్రచారాన్ని ఎలా ఆపమంటారని ఇన్ స్పెక్టర్ పై మండిపడ్డారు. ఈ సందర్భంగా స్టేజ్ మీద నుంచి సీఐ వైపు వెళ్లి సీరియస్ వార్నింగ్ ఇవ్వడం గమనార్హం. ఈ సందర్భంగా మీవద్ద గడియారం లేకపోతే తనవద్ద ఉన్న వాచ్ తీసుకోమని అక్బరుద్ధీన్ ఫైర్ అయ్యారు!
అక్కడితో ఆగని అక్బరుద్ధీన్... తనపై తూటాలు, కత్తులతో దాడులు జరిగినంతమాత్రాన్న అలసిపోయానని అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. అనంతరం తనను రెచ్చగొట్టొవద్దని.. తనను ఆపే ధైర్యం ఎవరికీ లేదు.. ఉండబోదని అన్నారు. తనకు మిగిలిన ఉన్న ఐదు నిమిషాల సమయం మాట్లాడాకే వెళ్తానని తెలిపారు.
అనంతరం... చంద్రాయణగుట్ట నియోజకవర్గ ప్రజలకు తాను ఒక్క సైగ చేస్తే.. పోలీసులంతా ఇక్కడి నుంచి పరుగులు పెడతారని తెలిపిన అక్బరుద్ధీన్... పరుగెత్తించి చూపించమంటారా? అని పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు! ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియోలో వైరల్ అవుతుంది. దీంతో... ఈ వీడియోను తెలంగాణ బీజేపీ తమ ఎక్స్ లో షేర్ చేసింది.
ఇందులో భాగంగా... గత కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్, బీఆరెస్స్ మద్దతుతో ఎంఐఎం ఒక నేర సంస్థగా మారిందని బీజీపీ మండిపడింది. హైదరాబాద్ పాతబస్తీ మొత్తాన్ని నాశనం చేసిందని.. వారికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని ప్రజలకు పిలులుపునిచ్చింది. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. అక్బరుద్దీన్ చర్యకు బుల్డోజర్ రియాక్షన్ ఉంటుందని హెచ్చరించింది.