కూటమి భారీ బడ్జెట్...నిధులు ఎలా సర్దుబాటు ?
వైసీపీ అయిదేళ్ళ బడ్జెట్ లో దిగిపోయేనాటికి రెండు లక్షల డెబ్బై వేల కోట్ల దాకా వచ్చింది. దానిని అధిగమించేలా టీడీపీ కూటమి బడ్జెట్ మూడు లక్షల కోట్లుగా అంచనా వేస్తున్నారు.
తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన దాదాపు అయిదు నెలల తరువాత అంటే నవంబర్ లో తొలి బడ్జెట్ ని ప్రవేశపెట్టనుంది. ఆర్ధిక మంత్రి హోదాలో పయ్యావుల కేశవ్ శాసనసభలో బడ్జెట్ ని ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్ దాదాపుగా మూడు లక్షల కోట్ల దాకా ఉండవచ్చు అని అంచనా వేస్తున్నారు.
వైసీపీ అయిదేళ్ళ బడ్జెట్ లో దిగిపోయేనాటికి రెండు లక్షల డెబ్బై వేల కోట్ల దాకా వచ్చింది. దానిని అధిగమించేలా టీడీపీ కూటమి బడ్జెట్ మూడు లక్షల కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఈ బడ్జెట్ కేవలం అయిదు నెలలకు మాత్రమే అన్నది తెలిసిందే.
ఎందుకంటే మార్చి అంతానికి ఈ బడ్జెట్ కాలపరిమితి ముగుస్తుంది. అయితే ఈ బడ్జెట్ ద్వారా కూటమి సర్కార్ తమది అభివృద్ధి సంక్షేమ బాట అని చెప్పదలచుకుంది అని అంటున్నారు. దాంతో బడ్జెట్ లో భారీ నంబర్లే కనిపిస్తాయని అంటున్నారు.
ఈ బడ్జెట్ లో సంక్షేమ పధకాలకు ఏకంగా లక్షా 20 వేల కోట్లు ఖర్చు చేయడానికి నిధులను కేటాయిస్తారు అని అంటున్నారు. తల్లికి వందనం పధకం, అలాగే రైతులకు భరోసా కింద అన్నదాతా సుఖీభవ పధకం, అంతే కాదు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అంతే కాదు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పధకం, పద్దెనిమిదేళ్ళు దాటిన మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు వారి ఖాతాలో వేసి ఆర్ధిక స్వావలంబన కల్పించడం, ఇక నిరుద్యోగ యువతకు నెలకు మూడు వేల రూపాయలు ఇవ్వడం ఇవన్నీ కూటమి ఇచ్చిన హామీలు.
ఇందులో మెజారిటీ పధకాలు కూటమి బడ్జెట్ లో కనిపిస్తాయని అంటున్నారు. ఇలా సంక్షేమ పధకాలకు అయ్యే ఖర్చు కేటాయింపులు దేని నుంచి చేయాలి అన్న దాని మీదనే ప్రస్తుతం అధికార యంత్రాంగం మధింపు చేస్తోంది అని అంటున్నారు. ఇక ఏపీలో ప్రభుత్వానికి వివిధ పన్నుల ద్వారా కేంద్రం నుంచి వచ్చే వివిధ ఆదాయాల ద్వారా వచ్చేది అన్నీ కలుపుకుని చూస్తే జీతాలు ప్రభుత్వ పెన్షన్లు సామాజిక పెన్షన్లకు అలా సరిపోతుంది.
ఇక కొత్తగా చేసిన అప్పులకు పాత అప్పులకు వడ్డీలు కట్టేందుకు నిధులు కూడా కావాలి. దానికి తోడు అన్నట్లుగా ఇపుడు సంక్షేమ పధకాలకు కూడా అప్పులు తెచ్చి మాత్రమే ఇవ్వాలని అంటున్నారు. అయితే బడ్జెట్ లో మాత్రం భారీగా అంకెలు వేసి నిధులు చూపించినా ఖజానాలో అయితే ఆదాయం అంత లేదని అంటున్నారు. దాంతో అప్పులు చేసుకునే వెసులుబాటు ఎటూ ఉంటుంది కాబట్టి ఆ ధీమాతో ఈ బడ్జెట్ లో భారీగానే కేటాయింపులు చేస్తారని అంటున్నారు.
మరో వైపు చూస్తే ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత అప్పులు పాతిక వేల కోట్ల దాకా చేశారు అని అంటున్నారు, ఇపుడు సూపర్ సిక్స్ హామీలకు కూడా అప్పులు తెచ్చి మాత్రమే ఇవ్వాలని అంటున్నారు. గత అయిదేళ్లలో వైసీపీ అధినాయకత్వం కూడా అప్పులు తెచ్చి మాత్రమే సంక్షేమ పధకాలను పంపిణీ చేసింది అని గుర్తు చేస్తున్నారు.
ఇక ఈసారి బడ్జెట్ లో అభివృద్ధి విషయం తీసుకుంటే అమరావతి రాజధానికి కేంద్రం పూచీకత్తు మీద ప్రపంచ బ్యాంకు నుంచి రుణం 15 వేల కోట్ల రూపాయలు వస్తోంది. దాంతో దానిని బడ్జెట్ లో చూపిస్తూనే మరో పాతిక వేల కోట్లను కూడా కలిపి అమరావతి రాజధానికి యాభై వేల కోట్లు కేటాయిస్తున్నట్లుగా చూపిస్తారు అని అంటున్నారు.
అదే విధంగా పోలవరం ప్రాజెక్టు కూడా ఏపీకి జీవనాడి. అత్యంత కీలకంగా ఉంది. దాని విషయంలో కూడా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. దాంతో పాటు పోలవరానికి కేంద్రం నిధులను కేటాయిస్తోంది. వాటిని బడ్జెట్ లో చూపిస్తారు అని అంటున్నారు. ఇక ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏపీలోని రోడ్ల నిర్మాణం ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు కూడా భారీగానే నిధుల కేటాయింపులు చేస్తారు అని అంటున్నారు. మొత్తానికి కూటమి తొలి బడ్జెట్ అటు అభివృద్ధి ఇటు సంక్షేమం సమతూకంగా ఉంటుందని అంటున్నారు.