అమరావతి కోసం టైంటేబుల్.. మూడేళ్లలో మహానగరం
ప్రస్తుతం టెండర్ దశలో ఉన్న పనులు ఖరారైన వెంటనే పరుగులు పెట్టించాలని చూస్తోంది.
రాజధాని అమరావతి కల సాకారం దిశగా కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. అధికారంలోకి వచ్చిన నుంచి రాజధానికి ఓ రూపు తేవాలని శ్రమిస్తున్న ప్రభుత్వం.. మూడేళ్లలో రాజధాని నగరాన్ని ఆవిష్కరించాలని ప్లాన్ చేస్తోంది. ఇందుకోసం ఎప్పుడు ఏ పనిచేయాలి? ఏ సమయానికి ఏ పని పూర్తవ్వాలనే దానిపై సమగ్రంగా టైం టేబుల్ రెడీ చేస్తోంది. ప్రస్తుతం టెండర్ దశలో ఉన్న పనులు ఖరారైన వెంటనే పరుగులు పెట్టించాలని చూస్తోంది.
ఆంధ్రుల కలల రాజధాని అమరావతిపై చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా ఫోకస్ చేస్తోంది. గత ఐదేళ్లలో జరిగిన పొరపాట్లు మళ్లీ పునరావృత్తం కారాదనే ఉద్దేశంతో పనిచేస్తున్న ప్రభుత్వం మూడేళ్లలో రాజధాని నగరానికి ఓ రూపు తేవాలని చూస్తోంది. నిధులు సిద్ధంగా ఉండటంతో చిత్తశుద్ధితో పనిచేసే కాంట్రాక్టు సంస్థల కోసం ఎదురుచూస్తోంది. ప్రస్తుతం రాజధాని పనులకు రూ.20 వేల కోట్ల విలువైన టెండర్లు పిలిచారు. అయితే ఎమ్మెల్సీ కోడ్ అడ్డుగా ఉండటంతో టెండర్ల ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. మార్చి 8న కోడ్ ముగిసిన వెంటనే టెండర్ల ప్రక్రయను కొనసాగించి ఆ నెల 15 నాటికి కాంట్రాక్టు సంస్థలను ఎంపిక చేయాలని భావిస్తోంది.
రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం దాదాపు రూ.26 వేల కోట్లను సేకరించింది. మరో రూ.10 వేల కోట్లకు రుణ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచ బ్యాంకు నుంచి రూ.15 వేల కోట్లు, హడ్కో నుంచి రూ.11 వేల కోట్లు రుణం మంజూరైంది. వీటితో పాటు కేఎఫ్ డబ్ల్యూ నుంచి మరో రూ.5 వేల కోట్లు రుణం తీసుకోవాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదేవిధంగా హడ్కో మరో రూ.5వేలు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. దీంతో నిధుల సమీకరణ కూడా పూర్తయినట్లేనని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఇక టెండర్లు ఖరారు చేసి పనులను మొదలుపెట్టడమే ఆలస్యమంటున్నారు.
వచ్చే ఉగాది నాటికి సీఆర్డీఏ కాంప్లెక్స్ లో పలు సంస్థలు విధులు నిర్వహించేలా పనులు పూర్తి చేసేందుకు సీఆర్డీఏ లక్ష్యంగా పెట్టుకుంది. సీఆర్ఢీఏ భవన సముదాయంలో సీఆర్డీఏ, ఏడీసీతోపాటు మున్సిపల్ పట్టణాభివృద్ధి సంస్థ, కమిషనర్ అండ్ డైరెక్టరేట్ ఆఫ్ మున్సిపల్ అడ్మినస్ట్రేషన్, టౌన్ అండ్ కంట్రీ ప్లాన్, మున్సిపల్ మంత్రి కార్యాలయంతోపాటు మున్సిపల్ శాఖకు సంబంధించిన మిగిలిని అన్ని డిపార్టమెంట్లకు కార్యాలయాలు రెడీ చేస్తున్నారు. ఆ తర్వాత ఏడాదిన్నరలోగా అఖిల భారత సర్వీసు అధికారులు, ఎన్జీవో, గెజిటెడ్ ఆఫీసర్స్ టవర్స్, ప్రిన్సిపల్ సెక్రటరీ భవన నిర్మాణ పనులు పూర్తిచేయాలని నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. రాజధానిలో ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చరులో భాగంగా నిర్మించే రోడ్లను కూడా ఏడాదిన్నరలోగానే పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అదేవిధంగా అత్యంత ప్రధానమైన సచివాలయ టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు భవనాలను రెండున్నరేళ్లులోగా పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. వీటికి ఇంకా టెండర్లు పిలవాల్సివుందంటున్నారు. ఎమ్మెల్సీ కోడ్ ముగిసిన వెంటనే ఈ పనులు అన్నీ ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
ఇక రాజధానిలో ప్రైవేటు సంస్థల పనులను కూడా సమాంతరంగా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. రాజధానిలోని హెల్త్ సిటీలో ప్రఖ్యాత ఆస్పత్రుల నిర్మాణానికి భూములు కేటాయించడంతోపాటు వాటి పనులు తక్షణం చేపట్టేలా చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతానికి బసవ తారకం క్యాన్సర్ ఆస్పత్రి, ఎల్ వీ ప్రసాద్ ఐ హాస్పిటల్, మేదాంత, వోక్ హార్డ్ ఆస్పత్రులకు అనుమతులు ఇచ్చారు. మరోవైపు కేంద్ర సంస్థల నిర్మాణానికి 1,278 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సిన పనులతోపాటు ఇతర సంస్థలకు కేటాయించిన భూముల్లోనూ నిర్మాణాలు ఒకేసారి మొదలై.. నిర్దిష్ట సమయానికి పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.