అంబటికి షాక్: సంబరాల రాంబాబుకు టికెట్ ఇవ్వొద్దు
అంబటి మీద అసంతృప్తితో రగిలిపోతున్న స్థానిక నేతలు పలువురు.. ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తెనపల్లి సీటును ఎట్టి పరిస్థితుల్లోనూ రాంబాబుకు ఇవ్వొద్దని వారు వ్యాఖ్యానించారు.
ముంగిట్లోకి ఎన్నికలు వచ్చేసిన వేళ.. పార్టీ కోసం పని చేయాల్సిన ముఖ్యనేతలు.. ఆ పని వదిలేసి కొసరు పనులు చేస్తూ.. అనవసరమైన వివాదాల్లోకి వెళ్లే ఉత్సాహాం వారికి ఎలాంటి కష్టాన్ని తీసుకొస్తుందో అంబటి రాంబాబు ఎపిసోడ్ ను చూస్తే అర్థమవుతుంది. సంక్రాంతి వేళ.. సంబరాల రాంబాబుగా మారిన ఆయన భోగి వేళ.. తాను ప్రాతినిధ్యం వహించే సత్తెనపల్లిలో.. ముందుగా సిద్ధం చేసుకున్న రెండు పాటలకు డ్యాన్సులు వేసి అలరించిన వైనం తెలిసిందే. ఏపీ రాష్ట్ర మంత్రి హోదాలో ఉన్న ఆయన.. సంక్రాంతి వేళ తన నియోజకవర్గంలోని అసమ్మతిని బుజ్జగించే పని కంటే కూడా.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు పాటలతో పంచ్ లు వేసే కార్యక్రమానికే పెద్దపీట వేశారు.
ఇందుకు తాజాగా ఆయన మూల్యం చెల్లించిన పరిస్థితి. తన మీద గుర్రుగా ఉన్న నేతల్ని పిలిపించుకొని.. వారి కోపాన్ని చల్లార్చటం.. పార్టీ గెలుపు కోసం కలిసి కట్టుగా పని చేస్తామని బుజ్జగించటం మానేసిన ఆయన తీరుతో మరింత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. పలువురు నేతలు తాజాగా ప్రెస్ మీట్ పెట్టి మరీ సంబరాల రాంబాబు మాకొద్దు అంటూ వ్యాఖ్యానించటం గమనార్హం. అంతేకాదు.. ఆయనకు టికెట్ ఇస్తే తమకు ఆత్మహత్యలే శరణ్యమని పేర్కొన్న వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అంబటి మీద అసంతృప్తితో రగిలిపోతున్న స్థానిక నేతలు పలువురు.. ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తెనపల్లి సీటును ఎట్టి పరిస్థితుల్లోనూ రాంబాబుకు ఇవ్వొద్దని వారు వ్యాఖ్యానించారు. ఇలా ఓపెన్ గా మంత్రికి వ్యతిరేకంగా గళం విప్పిన వారిని చూస్తే.. కొమెరపూడి గ్రామ సర్పంచ్ కొరివి అనిల్.. కొమెరపూడి మండలంలోని నందిగామ ఎంపీటీసీ సభ్యురాలు సయ్యద్ సీమా భర్త రఫి అహ్మద్ లతో పాటు పలువురు స్థానిక నేతలు ఉన్నారు.
అనుచరుల్ని పెట్టుకొని అంబటి అవినీతికి పాల్పడ్డారని.. సర్పంచ్ లను తెగ ఇబ్బంది పెట్టారన్నారు. అధికార పార్టీకి చెందిన వెన్నా వెంకటరెడ్డి మాట్లాడుతూ.. అక్రమ మైనింగ్ కోసం కోటనెమలిపురి హద్దుల్ని మార్చేసిన అంబటి.. చివరకు ఊరికి శ్మశానవాటిక అన్నది లేకుండా చేశారని చెప్పారు. సొంత పార్టీకి చెందిన ఎంపీటీసీ సభ్యురాలిని గడప గడప ప్రోగ్రాంలో పాల్గొనకుండా అడ్డుకున్నారని పేర్కొన్నారు. అంబటి మీద అన్ని సామాజిక వర్గాల్లోనూ వ్యతిరేకత ఉందని.. పార్టీ శ్రేణుల అభిప్రాయానికి భిన్నంగా అంబటికి మళ్లీ సత్తెనపల్లి పార్టీ టికెట్ ఇవ్వొద్దని కోరుతున్న వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.
మంత్రి అంబటికి సత్తెనపల్లి టికెట్ ఇవ్వొద్దని చెప్పిన ద్వితీయశ్రేణి నాయకత్వం దాదాపు పాతిక మందికి పైనే ఉండటం గమనార్హం. బయటకు వచ్చి తమ గళాన్ని చెప్పిన వారే ఇంతమంది ఉంటే.. బయటకు రాలేని వారెందరు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఇదంతా చూస్తున్న వారు.. నియోజకవర్గంలో ఇన్ని లుకలుకలు పెట్టుకొని.. అలా డ్యాన్సులు వేసే కన్నా.. అసమ్మతిని సర్దుబాటు చేసుకోవచ్చు కదా? అన్న మాటల పలువురి నోట వినిపిస్తోంది.