పెద్ద గుంతలో పడిన అంబులెన్స్‌.. బతికిన చచ్చిపోయిన వ్యక్తి!

వివరాల్లోకి వెళ్తే.. 80 ఏళ్ల దర్శన్‌ సింగ్‌ గత కొంతకాలంగా గుండె జబ్బుతో బాధపడుతున్నాడు

Update: 2024-01-14 02:45 GMT

ఇన్నాళ్లూ రోడ్ల మీద గుంతల్లో పడి ప్రాణాలు పోగొట్టుకున్నవారే మనకు తెలుసు. కానీ తొలిసారిగా ఒక చనిపోయిన వ్యక్తి గుంతలో పడటం వల్ల బతికిన అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఇది మనదేశంలోనే హరియాణా రాష్ట్రంలో కర్నాల్‌ జిల్లా నిస్సింగ్‌ లో చోటు చేసుకుంది. దీంతో ఈ ఘటన వార్తలకెక్కింది.

వివరాల్లోకి వెళ్తే.. 80 ఏళ్ల దర్శన్‌ సింగ్‌ గత కొంతకాలంగా గుండె జబ్బుతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆయనను చికిత్స కోసం పాటియాలాలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆయన చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు తమ స్వగ్రామానికి తరలించడానికి మృతదేహాన్ని అంబులెన్సులోకి ఎక్కించారు.

ఈ క్రమంలో అంబులెన్సు ప్రయాణిస్తుండగా ఒక పెద్ద గుంతలో పడింది. దీంతో ఆ కుదుపుకి మృతి చెందిన దర్శన్‌ సింగ్‌ లో కదలిక వచ్చింది. ఆ కుదుపుకి ఆ వృద్ధుడి ప్రాణాలు తిరిగొచ్చాయి. దీంతో ఆశ్చర్యపోవడం దర్శన్‌ సింగ్‌ కుటుంబ సభ్యుల వంతైంది. దీంతో వారంతా సంతోషంలో మునిగిపోయారు. ఈ విషయం వారి గ్రామమంతా తెలిసిపోయింది. దీంతో ఆయనను చూడటానికి గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

నిస్సింగ్‌ లో ఉన్న సంపన్న కుటుంబాలలో దర్శన్‌ సింగ్‌ కుటుంబం ఒకటి. ఆయన నివసించే కాలనీకి కూడా ఆయన పేరు మీదుగా దర్శన్‌ సింగ్‌ కాలనీ అని పేరు పెట్టడం గమనార్హం. దర్శన్‌ సింగ్‌ మరణ వార్తతో సంతాపం తెలిపేందుకు బంధువులు, స్నేహితులు ఆయన ఇంటికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఈ క్రమంలో ఆయన మృతదేహాన్ని పాటియాలాలోని ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకొస్తుండగా ఈ అద్భుతం జరిగింది. అంబులెన్సు గుంతలో పడటంతో ఆయన ప్రాణాలు లేచివచ్చాయి.

దీంతో అదే అంబులెన్సులో ఆయనను ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ దర్శన్‌ సింగ్‌ కు చికిత్స అందిస్తున్నారు. ఫతేహాబాద్‌కు చెందిన గుండె వ్యాధుల నిపుణుడు డా.వినీ సింగ్లా దీన్ని అరుదైన కేసుగా అభివర్ణించారు. ఆయనను ఆస్పత్రికి తీసుకొచ్చాక వెంటిలేటర్‌ పై ఉంచామని.. ఇప్పుడు ఆ అవసరం లేకుండా ఆయన ఆరోగ్యం మెరుగుపడిందని తెలిపారు.

Tags:    

Similar News