ట్రేడ్ వార్.. ప్రపంచ యుద్ధాన్ని మించిన ప్రచండ యుద్ధం..
అందరూ అనుకున్నట్లుగా 2025లో మూడో ప్రపంచ యుద్ధం అనుకుంటే అంతకుమించిన యుద్ధం మరొకటి జరుగుతోంది.
అందరూ అనుకున్నట్లుగా 2025లో మూడో ప్రపంచ యుద్ధం అనుకుంటే అంతకుమించిన యుద్ధం మరొకటి జరుగుతోంది. ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని, హమాస్-ఇజ్రాయెల్ సంఘర్షణను పక్కకునెట్టి మరీ వార్తల్లో నిలుస్తోంది. దీనికి కారణం.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదలుపెట్టిన ‘సుంకాల దాడి’. అయినదానికీ కానిదానికీ కాలుదువ్వితే ఎవరు మాత్రం ఎందుకు ఊరుకుంటారు..?
ప్రపంచ యుద్ధం.. ప్రచ్ఛన్న యుద్ధం గురించి విన్నాం.. చూశాం.. ఇప్పుడు అమెరికా, చైనా మధ్య ట్రేడ్ వార్ మొదలైంది. తెలుగులో చెప్పాలంటే ఇది వాణిజ్య యుద్ధం అనాలి. ట్రంప్ బాదిన సుంకాలే ఈ యుద్ధానికి కారణం.. గతవారం ఇరుగు పొరుగు కెనడా, మెక్సికోతో పాటు చైనా పైనా ట్రంప్ సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. దీనికి డ్రాగన్ గట్టిగా సమాధానం చెప్పింది.
చైనా నుంచి వచ్చే అన్ని ఉత్పత్తులపై 10 శాంత సుంకం విధించారు ట్రంప్. ఈ మేరకు ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. దీనిపై అప్పుడే చైనా గట్టిగా ప్రతిస్పందించింది. ఇప్పుడు తానేం చేయగలనో చాటి చెప్పింది. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే బొగ్గు, లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ పై 15 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించింది. చమురు, వ్యవసాయ పరికరాలపై 10 శాతం టారిఫ్ ఉంటుందని స్పష్టంచేసింది. టంగ్ స్టన్ సంబంధిత పదార్థాల ఎగుమతులపై నియంత్రణ విధించింది. పీవీహెచ్ కార్పొరేషన్, ఇల్యుమినా ఇంక్ వంటి అమెరికా సంస్థలను నమ్మదగని సంస్థల జాబితాలో చేర్చింది.
గూగుల్ పై గురి...
గూగుల్ అంటే ప్రపంచంలోని చాలా దేశాల కంటే రిచ్. అలాంటి సంస్థపై ‘అనైతిక వ్యాపార పద్ధతులు’ అంటూ గురిపెట్టింది డ్రాగన్. కారణం గూగుల్ అమెరికా సంస్థ కావడమే. ఆ సంస్థపై చైనా విచారణ జరపనుంది.
కొదమసింహాల పోరులో..
అమెరికా నంబర్ వన్ ఆర్థిక శక్తి. చైనా దానికి దగ్గరగా వెళ్తోంది. ఇలాంటి రెండు దేశాలు పరస్పరం సుంకాలు విధించుకుంటూ పోతుండడంతో ట్రేడ్ వార్ భయాలు మొదలయ్యాయి. చైనా కరెన్సీ యువాన్ విలువ పతనమైంది. దీని ప్రభావం ఇతర దేశాల కరెన్సీల పై పడింది. ఆస్ట్రేలియా డాలర్, న్యూజిలాండ్ డాలర్ విలువలు పడిపోయాయి.
కాగా, ట్రంప్ సుంకాల నిర్ణయాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)లో సవాలు చేస్తామని చైనా స్పష్టం చేసింది. తమ దేశ ప్రయోజనాలు, హక్కులు కాపాడుకోవడానికి వెనక్కుతగ్గబోం అని చెప్పింది. దేశాలను సుంకాలతో బెదిరించడం కాదు.. ఫెంటానిల్ లాంటి సమస్యలను సొంతంగా పరిష్కరించుకో.. అని అమెరికాను సవాల్ చేసింది.