వ్యాపార సంస్థ‌ల మోసాల‌పై అమెరికా క‌న్నెర్ర‌.. భారీ దాడులు

అదేస‌మ‌యంలో వ్యాపారుల‌ను అరెస్టు చేయ‌డంతో పాటు సొమ్మును రిక‌వ‌రీ చేసే ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది.

Update: 2024-02-14 13:43 GMT

ఉన్న‌వి లేన‌ట్టు..లేనివి ఉన్న‌ట్టు చూపిస్తూ.. ఏకంగా ప్ర‌భుత్వాన్ని నిలువునా మోసం చేసి కోట్లు పోగేసిన సంస్థ‌ల‌పై అగ్ర‌రాజ్యం అమెరికా క‌న్నెర్ర‌చేసింది. ఆయా సంస్థ‌ల మోసాల‌పై కూపీలాగిన ప్ర‌భుత్వం వ‌రుస దాడుల‌తో వ్యాపారుల ఆగ‌డాల‌ను క‌ట్ట‌డి చేసే ప్ర‌య‌త్నం చేస్తోంది. అదేస‌మ‌యంలో వ్యాపారుల‌ను అరెస్టు చేయ‌డంతో పాటు సొమ్మును రిక‌వ‌రీ చేసే ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది.

ఏం జ‌రిగింది?

2020-2022 మధ్య కాలంలో వచ్చిన కోవిడ్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను సైతం కుదిపేసింది. పేచెక్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్(PPP), ఎకనామిక్ ఇంజురీ డిజాస్టర్ లోన్స్ (EIDL) వంటి అనేక తక్షణ ఉప‌శ‌మ‌నాలు అందించ‌డంలో అమెరికా ప్ర‌భావిత‌మైంది. క‌రోనాకార‌ణంగా ఉపాధి కోల్పోయిన వారికి, ఉద్యోగుల‌కు, మానసిక కుంగుబాటు వంటివి ప్రజల జీవితాలను కుదిపేశాయి. ఇలాంటి స‌మ‌యంలో అనేక మంది ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ్డారు. దీనిని నివారించడానికి ప్రభుత్వం దేశంలోని అన్ని కంపెనీలకు యజమానుల ప్రకటన ఆధారంగా ఉద్యోగుల‌కు ముంద‌స్తు జీతాలు చెల్లించే ప‌థ‌కాన్ని తీసుకువ‌చ్చింది.

దీంతో సంస్థ‌లు త‌మ ఉద్యోగుల వివ‌రాల‌ను ప్ర‌భుత్వానికి అందించాయి. అయితే.. ఈ క్ర‌మంలో కొందరు తమ వ్యాపారాన్ని విస్తరించాలనే ఉద్దేశంతో ఉద్యోగులను రెండింతలుగా చేర్చుకున్నారు, ఆర్థిక భారాన్ని ప్రభుత్వంపై నెట్టేశారు. దీంతో ప్ర‌భుత్వ‌మే ఉద్యోగుల‌కు జీతాలు అందించింది. కానీ, ఇప్పుడు ఈ ప‌థ‌కాన్ని అమెరికాప్ర‌భుత్వం ఆపేసింది. దీంతో స‌ద‌రు సంస్థ‌లు ఉద్యోగుల‌ను తీసేయ‌డం ప్రారంభించాయి. దీంతో అనేక మంది రోడ్డున ప‌డుతున్నారు. దీనిని గ‌మ‌నించిన ప్ర‌భుత్వం కేవ‌లం తాము ప్ర‌వేశ పెట్టిన ప‌థ‌కం కింద ల‌బ్ధి పొందే ఉద్దేశంతోనే ఉద్యోగుల‌ను పెంచుకున్నార‌ని గుర్తించింది.

ఇలా.. ప్ర‌భుత్వం నుంచి ల‌బ్ధి పొందిన వారిలో 11.5 మిలియన్ల చిన్న వ్యాపార యజమానులు ఉన్నారు, వీరిపై ఫెడరల్ ప్రభుత్వం కోవిడ్ సమయంలో వారి మోసాలను బహిర్గతం చేయడం ద్వారా మోసాల‌ను అరిక‌ట్టాల‌ని నిర్ణ‌యించింది. దీని కోసం ప్రభుత్వం దాదాపు 30,000 మంది IRS ఏజెంట్లను నియమించుకుంది. దేశంలో అనేక మంది వ్యాపార యజమానులు తప్పుడు సంఖ్యలో ఉద్యోగులను అంచనా వేయడం ద్వారా పన్ను చెల్లింపుదారుల సొమ్మును స్వాహా చేశారని, తద్వారా ఆ డబ్బుతో లగ్జరీ కార్లు, అధునాత‌న గృహాలను కొనుగోలు చేశారని ఆరోపణలు వ‌చ్చాయి. వీటిని కూడా ప్ర‌భుత్వం ప‌రిశీలిస్తోంది.

వ్యాపారులు ప్ర‌భుత్వాన్ని మోసం చేసి పోగేసుకున్న సొమ్ము సుమారు $1.2 ట్రిలియన్ల వ‌ర‌కు ఉంటుంద‌ని అంచ‌నా వేశారు. ఇది.. క‌రోనా సహాయ నిధిలో 70% ఉండవచ్చున‌ని అంచ‌నా ఉంది. ఇది తీవ్ర‌మైన‌ ద్రోహంగా ప్ర‌భుత్వం భావిస్తోంది. ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, ఈ మోసంలో చాలా మంది రోల్ మోడల్ టీవీ స్టార్లు, సెలబ్రిటీలు కూడా ఉన్నారు. వీరిని కూడా ప్ర‌భుత్వం విచారిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జో బిడెన్ ప్రభుత్వం పన్ను చెల్లింపుదారుల సొమ్మును రక్షించడంపై సీరియస్‌గా దృష్టి సారిస్తోందని అంతర్గత సమాచారం. మ‌రోవైపు ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌తో దిమ్మ‌తిరిగిపోయిన‌ మోసగాళ్లు ఇతర దేశాలకు తప్పించుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు స‌మాచారం. దీనిని అడ్డుకోవ‌డం కూడా ప్ర‌భుత్వానికి స‌వాలుగా మారింది.

Tags:    

Similar News