వందేళ్ల కిసింజర్.. అమెరికా విదేశాంగంలో సికిందర్
అమెరికా విదేశాంగ మాజీ మంత్రి హెన్రీ కిసింజర్ ది విదేశాంగ విధానంలో చెరగని ముద్ర. అగ్ర రాజ్యానికి ఒకసారి విదేశాంగ మంత్రిగా చేయడమే గౌరవం.
జర్మనీలో పుట్టి.. అమెరికాలో పెరిగి.. హార్వర్డ్ లో చదివి.. అక్కడే సుదీర్ఘ కాలం పనిచేసి.. ఆపై విదేశాంగ విధానంలో తనదైన ముద్ర వేసిన ఈ వందేళ్ల వ్యక్తి తన ఇన్నింగ్స్ ను ముగించారు. ఇజ్రాయెల్-అరబ్ ప్రపంచం మధ్య యుద్ధం సాగుతున్న సమయంలో 50 ఏళ్ల కిందట అత్యంత చురుగ్గా వ్యవహరించి శాంతి ఒప్పందానికి పాటుపడిన ఆయన.. మళ్లీ ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతున్న కాలంలోనే ప్రాణం విడిచారు. 50 ఏళ్ల కిందట అధ్వాన స్థితిలో ఉన్న అమెరికా –చైనా మధ్య సత్సంబంధాలకు బాట వేసిన ఆయన.. మళ్లీ అమెరికా-చైనా సంబంధాలు కనిష్ఠ స్థాయికి పడిపోయిన వేళ కన్నుమూశారు. భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన 1971 నాటి యుద్ధంలో పాకిస్థాన్ కు మద్దతుగా నిలిచేలా అమెరికాను ఒప్పించిన ఆయన తర్వాతి కాలంలో పశ్చాత్తాపంతో కుమిలిపోయారు. ఇప్పుడు ప్రబల శక్తిగా ఎదుగుతున్న భారత్ ను చూసి జీవితంలో తప్పు చేశానని భావించి ఉంటారనడంలో సందేహం లేదు.
100 ఏళ్ల జీవితం.. 50 ఏళ్లు దౌత్యం
అమెరికా విదేశాంగ మాజీ మంత్రి హెన్రీ కిసింజర్ ది విదేశాంగ విధానంలో చెరగని ముద్ర. అగ్ర రాజ్యానికి ఒకసారి విదేశాంగ మంత్రిగా చేయడమే గౌరవం. రెండోసారి కూడా ఆ బాధ్యతలు చేపట్టడం అంటే ఆ వ్యక్తి విశిష్టతను చాటుతోంది. అందుకే అమెరికా విదేశాంగ విధానాన్ని తీర్చిదిద్దిన వ్యక్తిగా కిసింజర్ ను కొనియాడుతుంటారు. నిక్సన్, జెరాల్డ్ ఫోర్డ్ హయాంలో విదేశాంగ మంత్రిగా ఉన్న కిసింజర్.. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కూడా. కనెక్టికట్ లో ఉంటున్న ఆయన అమెరికా టైమ్ ప్రకారం బుధవారం చనిపోయారు.
వందో ఏట కూడా దౌత్యం..
కిసింజర్ 1923 మే 7న జర్మనీలో పుట్టారు. ఈ ఏడాది మే 7తో ఆయనకు వందేళ్లు నిండాయి. కిసింజర్ కు 15 ఏళ్ల వయసుండగా వారి కుటుంబం అమెరికాకు వెళ్లింది. ఆ తర్వాత వచ్చిన రెండో ప్రపంచ యుద్ధంలో కిసింజర్ అమెరికా సైన్యంలో పనిచేశారు. ప్రఖ్యాత హార్వర్డ్ నుంచి పట్టా అందుకుని అక్కడే 17 ఏళ్లు ప్రొఫెసర్ గా పనిచేయడం విశేషం. ప్రభుత్వ ఏజెన్సీలకు కన్సల్టెంట్ గా, వియాత్నాంలో విదేశాంగ శాఖకు మధ్యవర్తిగా వ్యవహరించారు.
జాన్సన్ రహస్యాలు నిక్సన్ కు..
లిండన్ జాన్సన్ అమెరికా అధ్యక్షుడిగా ఉండగా ఆయన యంత్రాంగంలోని కొందరితో కిసింజర్ కు సత్సంబంధాలు ఉండేవి. దీంతో జాన్సన్ ప్రభుత్వ సమాచారన్ని నిక్సన్ కు చేరవేశారని చెబుతారు. అందుకనే.. కిసింజర్ ను జాతీయ భద్రతా సలహాదారుగా నిక్సన్ నియమించారు. సరిగ్గా 50 ఏళ్ల కిందట 1973లో అమెరికా విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అదే సమయంలో అరబ్- ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం వచ్చింది.
డమాస్కస్ టు జెరూసలెం.. 32 రోజలు
ఇజ్రాయెల్-అరబ్ యుద్ధంలో సిరియా రాజధాని డమాస్కస్- జెరూసలెం మధ్య కిసింజర్ 32 రోజులు తిరుగుతూనే ఉన్నారు. సిరియా-ఇజ్రాయెల్ మధ్య ఘర్షణకు ముగింపు పలకడానికి కారణమయ్యారు. కాగా, సోవియల్ రష్యా ప్రాబల్యం తీవ్రంగా ఉన్న సమయంలో చైనాతో అమెరికా సంబంధాలు చాలా బలహీనంగా ఉండేవి. అలాంటి సమయంలో చైనాను అమెరికాకు దగ్గర చేశారు కిసింజర్. రెండుసార్లు చెనాలో పర్యటించారు. నాటి చైనా కమ్యూనిస్టు పార్టీ చైర్మన్ మావోతో భేటీ అయ్యారు.తదనంతరం నిక్సన్-మావో బీజింగ్ భేటీకి ఇదే పునాది.
వందేళ్ల వయసులో చైనాకు..
విశేషం ఏమంటే.. ఇటీవల కొన్నేళ్లుగా దెబ్బతిన్న చైనా-అమెరికా సంబంధాల పునరుద్ధరణకు వందేళ్ల వయసులో సైతం చైనా వెళ్లారు కిసింజర్. అధ్యక్షుడు జిన్ పింగ్ తో భేటీ అయ్యారు. కాగా.. కిసింజర్ కు భారత్ అనుకూలుడు కాదనే పేరుంది. 1971లో భారత్ - పాక్ యుద్ధంలో పాకిస్థాన్ కు అమెరికా మద్దతు పలికింది. దీనికి కిసింజర్ ప్రభావమే కారణమని చెబుతారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని తీవ్రంగా విమర్శించారని చెబుతారు. అయినా, నాటి యుద్ధంలో భారత్ గెలిచి బంగ్లాదేశ్ ఏర్పాటుకు కారణమైంది. కానీ, తర్వాతి కాలంలో కిసింజర్ పశ్చాత్తాప పడినట్లు కథనాలు వచ్చాయి.