కోడిపందేల బరుల్లో తొలిసారి ఆసక్తికర ఏర్పాట్లు!
మరికొన్ని చోట్ల గుండాట, పేకాట మొదలైన వ్యవహారాలకు చేసిన ఏర్పాట్లు కనిపిస్తున్నాయి. ఇక రాత్రి సమయాల్లో కూడా కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు.
సంక్రాంతి సంబరాలు మొదలైపోయాయి. సోమవారం ఉదయం నుంచే ఏపీలోని పలు ప్రాంతాల్లో.. ప్రధానంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందేల బరుల్లో భారీ ఎత్తున దుమ్ము లేచింది. కత్తులు కట్టుకుని సిద్ధంగా ఉన్న పందెం కోళ్లు మీసం దువ్వడం మొదలుపెట్టాయి! ఈసారి కాస్త స్పెషల్ ట్రీట్మెంట్ తో పందెం పరిసరాలు ముస్తాబయ్యాయి.
ఇందులో భాగంగా.. పందెం పరిసరాల్లో ఉత్సవాల వాతావరణం నెలకొనగా.. పందేలు చూసే ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా ఎల్.ఈ.డీ. లైట్లతో టెంట్ లు.. టెబుల్ ఫ్యాన్లు.. కూలర్ లు ఏర్పాటు చేశారు. ఇక్కడ అడుగు అడుగునా చికెన్ పకోడీ దుకాణాలు.. వాటిని అక్కడికక్కడే ఆరగించేందుకు "అన్ని రకాల" ఏర్పాట్లు చేశారు.
మరికొన్ని చోట్ల గుండాట, పేకాట మొదలైన వ్యవహారాలకు చేసిన ఏర్పాట్లు కనిపిస్తున్నాయి. ఇక రాత్రి సమయాల్లో కూడా కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అన్నట్లుగా కోడి పందేళ వద్ద భారీ స్క్రీన్లు ఏర్పాట్లు చేసి, లైవ్ టెలికాస్ట్ ఇస్తుండటం గమనార్హం.
ఈ సందర్భంగా సంక్రాంతి సంబరాలు జరిగే ప్రదేశానికి వచ్చేవారికి రకరకాల వంటకాలు అందుబాటులో ఏర్పాటు చేశారు. ప్రధానంగా చికెన్ పకోడి, బిర్యానీ లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇక... పందేలు, గుండాట పేరు చెప్పి కొన్ని కోట్ల రూపాయలు చేతులు మారుతున్నట్లు చెబుతున్నారు. దీనిపై తీవ్ర చర్చ జరుగుతుంది.
ఈ స్థాయిలో పందేల నిర్వాహకుల ఏర్పాట్లు, సందడి ఉంటే.. మరోపక్క పందేలు నిర్వహిస్తే చర్యలూ తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నా.. జరిగేవి జరుగుతూనే ఉన్నాయని అంటున్నారు. మరికొన్ని చోట్ల ఇప్పటికే రంగంలోకి దిగిన పోలీసులు పలు బరులను ధ్వంసం చేశారు. సీరియస్ హెచ్చరికలు చేస్తున్నారు.
ఇందులో భాగంగా... పండుగ పేరు చెప్పి ఇలాంటి జూద క్రీడలు నిర్వహించవద్దని.. వాటికి దూరంగా ఉండాలని.. సంక్రాంతి పండుగ వేళ కుటుంబమంతా కలిసి సంతోషంగా గడపాలే తప్ప.. ఇలా కోళ్లకు కత్తులు కట్టి హింసాత్మక వాతావరణన్ని సృష్టించి, వాటిలో సంతోషాన్ని వెతుక్కోకూడదని చెబుతున్నారు.