ఏపీలో కచిడి చేపల సందడి... ధర దబిడి దిబిడి!

సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు రెండు కచిడి చేపలు చిక్కడంతో.. వారి ఇంట సంక్రాంతి సంబరాలు రెట్టింపు ఉత్సాహంతో జరుగుతున్నాయని అంటున్నారు.

Update: 2025-01-13 10:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో తాజాగా ఓ చేప ధర ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి అప్పుడప్పుడూ సముద్రంలో భారీ చేపలు పట్టుబడ్డటం.. వాటికి భారీ ధరలు పలకడం తెలిసిందే. ఈ క్రమంలో గోదావరి జిల్లాలో పులసల సమయంలో కూడా ఇలాంటి వార్తలు కనిపిస్తుంటాయి. ఆ చేప దొరికిన మత్స్యకారుడు అదృష్టవంతుడు అని అంటారు.

దానికి కారణం... ఆ చేప ధరే. ఇదే సమయంలో రకరకాల జాతులకు చెందిన చేపలు అప్పుడప్పుడూ మత్స్యకారుల వలలో పడి వారికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంటాయి. ఇటీవల కాలంలో జపాన్ రాజధాని టోక్యోలోని ప్రముఖ ఫిష్ మార్కెట్ లో ఓ అరుదైన చేప సంచలనంగా మారిన సంగతీ తెలిసిందే.

ఇందులో భాగంగా... బ్లూఫిన్ ట్యూనా అని పిలవబడే ఈ చేప బరువు సుమారు 276 కిలోలు కాగా... ఈ చేప కోసం అక్షరలా 1.3 మిలియన్ డాలర్లు (సుమారు 11 కోట్ల రూపాయలు) చెల్లించి సొంతం చేసుకున్నారు స్థానిక రెస్టారెంట్ నిర్వాహకులు. ఈ నేపథ్యంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ లో దొరికిన ఓ చేప ధర ఆసక్తికరంగా మారింది.

అవును... సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు రెండు కచిడి చేపలు చిక్కడంతో.. వారి ఇంట సంక్రాంతి సంబరాలు రెట్టింపు ఉత్సాహంతో జరుగుతున్నాయని అంటున్నారు. ఇందులో భాగంగా.. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక మత్స్యకారులకు దొరికిన ఆ చేపలు భారీ ధర పలికాయి.

వీటిని కొనుగోలు చేయడానికి వ్యాపారులు పోటీ పడ్డారు. ఈ క్రమంలో.. పూడిమడకకు చెందిన వ్యాపారవేత్త వీటిని రూ.1.40 లక్షలకు కొనుగోలు చేసి కోల్ కతాకు ఎగుమతి చేయడానికి ఏర్పాట్లు చేశారు. దీంతో.. ఈ చేపలు అంత ధర ఎందుకు పలికాయి.. ఆ చేపల్లో ఉన్న ప్రత్యేకత ఏమిటి.. కూర కోసమే ఇంత ఖర్చు పెట్టారా అనే చర్చ తెరపైకి వచ్చింది.

ఈ నేపథ్యంలో... ఈ మగ కచిడి చేపలు బంగారు వర్ణంలో కనిపించడంతో.. వీటిని గోల్డెన్ ఫిష్ అని అంటారు. రుచిలోనూ టాప్ గా ఉంటాయని చెప్పే ఈ చేపల్లో ప్రధానంగా ఔషదగుణాలు ఎక్కువగా ఉంటాయని మత్స్యకారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ చెపను రూ.1.40 లక్షలకు కొనుగోలు చేసిన వ్యాపారవేత్త కోల్ కతాకు ఎగుమతి చేయడానికి ఏర్పాట్లు చేశారు.

Tags:    

Similar News