మాట ఇంటే ఇల్లు, ఉపాధి.. వినకపోతే చావుదెబ్బ తథ్యం!

ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా మావోయిస్టులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-12-16 16:48 GMT

భారతదేశంలో ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు మావోయిస్టుల ప్రభావం చాలా వరకూ తగ్గిందనే చర్చ తెరపైకి రాగానే... ఛత్తీస్ గఢ్ లో తుపాకీ చప్పుళ్ల మోత హెడ్ లైన్ అవుతుంటుంది. అటు భద్రతా సిబ్బంది, ఇటు మావోయిస్టులు.. ప్రాణాలు ఎవరివైనా ఛత్తీస్ గఢ్ లో మాత్రం ఇప్పటికీ ఎదురు కాల్పుల్లో నెత్తుటితో నేల తడుస్తూనే ఉంది.

ఈ నేపథ్యంలో ఛత్తీస్ గఢ్ లోని జగదల్ పుర్ లో "బస్తర్ ఒలింపిక్స్" క్రీడా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా మావోయిస్టులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... మాట విని జనజీవన స్రవంతిలో కలిస్తే ఇల్లు కట్టి ఇస్తామని, ఉపాధి కలుగజేస్తామని అన్నారు.

అవును... మావోయిస్టులు లోంగిపోవాలని.. జనజీవన స్రవంతిలో కలవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. ఈ సందర్భంగా.. లొంగిపోయిన మావోయిస్టులకు ఇల్లు నిర్మించి ఇవ్వడంతోపాటుగా జీవనోపాధిని కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయంలో మోడీ సర్కార్ కట్టుబడి ఉందని అన్నారు.

ఇందులో భాగంగా... ప్రతీ కుటుంబానికి ఆవు లేదా గేదును ఇస్తూ.. పాడి సహకార సంఘాల ఏర్పాటుకు సహకరిస్తామని తెలిపారు. హింసను విడనాడితే వారందరికీ పునరావాసం, ఉపాధి కల్పించే బాధ్యత ప్రభుత్వానిదే అని అన్నారు. ఇదే సమయంలో... హింసను వీడకపోతే భద్రతా దళాల చేతుల్లో చావుదెబ్బ తప్పదని హెచ్చరించారు.

ఈ సందర్భంగా... మావోయిస్టుల పునరావాసం కోసం ఛత్తీస్ గఢ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలు దేశంలోకెల్లా అత్యుత్తమమైనవని కొనియాడిన కేంద్ర హోంమంత్రి.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో తీవ్రవాద శక్తులపై వేగంగా చర్యలు తీసుకోవడంలో విఫలమైందని విమర్శించారు.

ఇక.. బీజేపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఏడాది కాలంలో అంతమైన, అరెస్టైన, లొంగిపోయిన మావోల వివరాలు చెప్పారు. ఇందులో భాగంగా... 287 మంది అంతమవ్వగా.. 992 మంది అరెస్టయ్యారని.. 836 మంది లొంగిపోయారని షా వివరించారు. మావోల దాడుల్లో భద్రతా బలగాల మరణాలు 73% తగ్గాయని తెలిపారు.

ఇదే సమయంలో... బస్తర్ లో మావోయిస్టులు ఆయుధాలను వదిలితేనే రోడ్ల నిర్మాణం, రైల్వేల ప్రవేశంతో పాటు నీరు, విద్యుత్ సదుపాయం కుదురుతుందని చెప్పారు. ఇదే సమయంలో మావోలు ఆయుధాలు వదులుకుంటే.. కశ్మీర్ కంటే ఎక్కువ మంది పర్యాటకులను బస్తర్ ఆకర్షించగలదని స్పష్టం చేశారు.

Tags:    

Similar News