అనంతపురం జిల్లా వైసీపీలో కీలక మార్పులు ఇవేనా?
గతంలో ఎన్నడూ లేని స్థాయిలో సిట్టింగుల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే
గతంలో ఎన్నడూ లేని స్థాయిలో సిట్టింగుల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే 11 నియోజకవర్గాల్లో అధికారికంగా ఇన్ ఛార్జ్ ల మార్పులు చేయగా... మరికొన్ని చోట్ల ఈ మార్పులు త్వరలో చోటుచేసుకోబోతున్నాయని.. వాటికి సంబంధించిన కసరత్తులు జరుగుతున్నాయని అంటున్నారు. ఈ సమయంలో అనంతపురం వైసీపీలో మార్పులు అంటూ కొన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
అవును... ముఖ్యమంత్రి జగన్ వైసీపీ ఇంఛార్జ్ ల మార్పుపై కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇన్ ఛార్జ్ లను మార్చే విషయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్లు, జూనియర్లు అనే తారతమ్యాలేమీ జగన్ పరిగణలోకి తీసుకోవడం లేదని... సర్వేల ఫలితాలు, కార్యకర్తల సూచనలు, ప్రజల అభిప్రాయాలు, సామాజిక సమీకరణల ప్రాతిపదికన ఈ మార్పులు చేర్పులూ చేస్తున్నారని అంటున్నారు.
వైనాటి 175 లక్ష్యంగా ముందుకు వెళ్తున్న ఈ ఎన్నికల్లో గెలుపే ప్రామాణికంగా ఇంఛార్జ్ లను ఖరారు చేస్తున్నారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో... రాయలసీమ జిల్లాలో 2019 తరహాలో పట్టు కొనసాగించే ప్రయత్నాలు చేస్తున్నారట జగన్. ఇందులో భాగంగా... ఉమ్మడి అనంతపురం జిల్లాలో రెండు లోక్ సభ సీట్లతో పాటుగా జిల్లాలోని పలు అసెంబ్లీ సిట్టింగ్ ల మార్పుపై కసరత్తు పూర్తి చేశారని కథనాలొస్తున్నాయి.
ఇప్పటికే అధికారికంగా 11 నియోజకవర్గాల్లో మార్పులు చేసిన జగన్... అనంతరం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతో పాటు ప్రకాశం జిల్లాలో మార్పుల పైనా కసరత్తులు చేస్తున్నారని.. ఇదే క్రమంలో రాయలసీమ జిల్లా అనంతపురంలోనూ ఇన్ ఛార్జ్ ల మార్పుల విషయంలో కసరత్తులు ఒక కొలిక్కి వచ్చాయని తెలుస్తుంది. ఇందులో భాగంగా... స్థానికంగా సామాజిక సమీకరణాల ఆధారంగా సీట్లలో అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారని సమాచారం.
ఈ క్రమంలో గత ఎన్నికల్లో రెండు స్థానాలే కోల్పోయిన వైసీపీ... ఈసారి ఆ లోటు కూడా లేకుండా జరిగేలా ప్రణాళికలు రచిస్తుందని తెలుస్తుంది. ఇందులో భాగంగా అనంతపురం జిల్లాలోని రెండు లోక్ సభ సీట్లలో సిట్టింగ్ ఎంపీలను మారుస్తున్నారని అంటున్నారు. ఈ క్రమంలో అనంతపురం ఎంపీగా మాజీ మంత్రి శంకరనారాయణ పేరు దాదాపు కన్ ఫాం అని అంటున్నారు.
మరో లోక్ సభ స్థానం హిందూపురంలోనూ మార్పు తధ్యం అని అంటున్నారు. ఇందులో భాగంగా... సిట్టింగ్ ఎంపీ గోరంట్ల మాధవ్ స్థానంలో హిందూపురం ఎంపీ అభ్యర్థిగా బోయ సామాజికవర్గానికి చెందిన కర్ణాటక మాజీ మంత్రి శ్రీరాములు సోదరి శాంతమ్మ పేరు పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.
ఇక అసెంబ్లీ సీట్ల విషయానికొస్తే... పెనుగొండ నియోజకవర్గానికి ఇన్ ఛార్జ్ గా మంత్రి ఉషశ్రీ చరణ్ ను నియమించే అవకాశాలున్నాయని... ఇదే సమయంలో కదిరి ఎమ్మెల్యే సిద్దారెడ్డి, మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామితో నియోజకవర్గాల మార్పుపై జగన్ చర్చించినట్లు సమాచారం. ఇలా అనంతపురం నియోజకవర్గంలో అటు లోక్ సభ ఇటు అసెంబ్లీ స్థానాల విషయంలో జగన్ కీలక మార్పులకు శ్రీకారం చుడుతున్నట్లు తెలుస్తుంది.