ఏపీలో బీజేపీ పోటీ చేసే 10 అసెంబ్లీ స్థానాలివేనా?

పొత్తు ధర్మంలో బాగంగా తమకు కేటాయించిన పది అసెంబ్లీ స్థానాలను కమలనాథులు ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది.

Update: 2024-03-14 04:31 GMT

అంచనాలకు తగ్గట్లే టీడీపీ, జనసేనతో కలిసి పొత్తు కుదుర్చుకున్న బీజేపీకి.. 10 అసెంబ్లీ స్థానాల్ని కేటాయించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఓకే చెప్పటం తెలిసిందే. నిజానికి ఏపీలో బీజేపీకి ఉన్న బలం నేపథ్యంలో ఐదు కంటే తక్కువ స్థానాల్లో మాత్రమే పోటీ చేయాల్సి ఉంది. అయితే.. పార్టీని విస్తరించేందుకు ఉన్న అవకాశాన్ని వదులుకోని కమలనాథులు తమకున్న బలానికి మించిన సీట్లు అడగటం.. తప్పనిసరి పరిస్థితుల్లో అందుకు ఓకే అన్నారు టీడీపీ అధినేత.

ఇప్పటికే ఎవరికి వారు తమ అభ్యర్థుల్ని ప్రకటిస్తున్న నేపథ్యంలో.. ఏపీలోని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే బీజేపీ అభ్యర్థులు ఎవరు? ఇంతకూ ఏయే స్థానాల్లో పోటీ చేయనున్నారు? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది.

పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. పొత్తు ధర్మంలో బాగంగా తమకు కేటాయించిన పది అసెంబ్లీ స్థానాలను కమలనాథులు ఎంచుకున్నట్లుగా తెలుస్తోంది. తమకు కాస్తంత బలమైన నేతలు ఉన్న నియోజకవర్గాల్ని ఎంపిక చేసుకున్నట్లుగా చెబుతున్నారు.

పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం పది స్థానాలు దాదాపుగా ఖరారైనట్లుగా తెలుస్తోంది. ఇంతకూ అవేమంటే..

- విశాఖ నార్త్

- శ్రీకాకుళం

- పాడేరు

- అనపర్తి

- కైకలూరు

- విజయవాడ వెస్ట్

- బద్వేలు

- జమ్మలమడుగు

- ధర్మవరం

- ఆదోని

అయితే.. ఈ పది స్థానాల్లో ఒకట్రెండు స్థానాలు చివర్లో మార్పులు చేర్పులకు అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక.. అభ్యర్థుల విషయానికి వస్తే.. విశాఖ నార్త్ నుంచి బీజేపీ సీనియర్ నేత విష్ణుకుమార్ రాజుతో పాటు మరో పేరును సైతం పరిశీలిస్తున్నారు. కైకలూరు నుంచి సోము వీర్రాజు.. జమ్మలమడుగు నుంచి మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి.. బద్వేల్ నుంచి సురేష్.. ధర్మవరం నుంచి మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి.. శ్రీకాకుళం నుంచి సురేంద్రమోహన్ కు టికెట్లు లభించే వీలుందని చెబుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా ఆదోని విషయానికి వస్తే జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొనిగరి నీలకంఠంకు టికెట్ దక్కే వీలుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News