కూటమికి పెద్ద పరీక్షగా రుషికొండ ప్యాలెస్

ఇన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి కట్టిన ఈ కట్టడాలు దేనికి ఉపయోగించాలో అర్ధం కాక కూటమి ప్రభుత్వం ఆలోచనలో పడుతోంది.

Update: 2024-11-03 04:13 GMT

వైసీపీ హయాంలో అభివృద్ధి ఏదీ లేదని టీడీపీ సహా విపక్షాలు విమర్శించాయి. అయిదేళ్ల పాటు ఇదే విధానంతో ముందుకు సాగాయి. అయితే వైసీపీ చేసిన అభివృద్ధి మిగిలిన చోట్ల ఏమో కానీ విశాఖలో మాత్రం ఎత్తైన కొండ మీద కట్టిన రుషికొండ ప్యాలెస్ కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తోంది.

ఈ కట్టడాలు అద్భుతం అని ఆ వీడియోలను చూసిన వారు చెబుతున్నారు. ఒక తాజ్ మహల్ మాదిరిగా కట్టాలని అనుకుని కట్టారా లేక ఏమని అనుకుని కట్టారో తెలియడం లేదు అంటున్నారు. దానికి 420 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు.

ఇన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి కట్టిన ఈ కట్టడాలు దేనికి ఉపయోగించాలో అర్ధం కాక కూటమి ప్రభుత్వం ఆలోచనలో పడుతోంది. అదే విషయాన్ని చంద్రబాబు కూడా మీడియాకు చెప్పారు. ఖరీదైన వ్యవహారం అక్కడ ఉంది. కేవలం ఈ ప్యాలెస్ ని మెయింటెయిన్ చేయడానికి రోజుకు లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే గత ప్రభుత్వం ఇష్టం కాబట్టి అది ఖర్చు కాకపోయినా కూటమి అధికారంలోకి వచ్చిన ఈ అయిదు నెలలలో ఏకంగా కోటిన్నర రూపాయలు కేవలం ప్యాలెస్ నిర్వహణకే పోయింది అన్న మాట.

దమ్మిడీ ఆదాయం లేదు పైగా ఖర్చు అన్నది అయితే ఉంది. దీని ముందు అక్కడ కూల్చేసిన హరితా రిసార్ట్స్ అన్నవి పర్యాటక శాఖ భవనాలు. వాటిని 1986లో ఎన్టీఆర్ హయాంలో నిర్మించారు. వాటి వల్ల నెలకు తక్కువలో తక్కువ ఇరవై లక్షల దాకా ఆదాయం వచ్చేదని చెబుతున్నారు.

ఎన్నో కాటేజీలు ఉండడం వల్ల వాటిని అద్దెకు ఇచ్చి టూరిస్టుల నుంచి ఆ మొత్తాన్ని పర్యాటక శాఖ ఆదాయంగా మార్చుకునేది. అయితే ఇపుడు వాటిని కూల్చారు, ఈ ప్యాలెస్ కట్టారు, దీనిని ఏ విధంగా అద్దెకు ఇవ్వాలి ఏ రకంగా ఆదాయం సమకూర్చుకోవాలి అన్నది ప్రభుత్వ పెద్దలకు అర్ధం కావడం లేదు.

దానిని వైసీపీ ఎందుకు కట్టింది అంటే టూరిజం కోసమే అని కొన్ని సార్లు చెప్పారు. ఆ తరువాత అంటే అధికారం నుంచి దిగిపోయిన తరువాత రాష్ట్రపతి ప్రధాని వంటి వారు ఇతర వీఐపీలు వచ్చినపుడు విడిది చేసేందుకు అని చెప్పుకొచ్చారు. సాధారణంగా వారంతా ఎపుడో కానీ విశాఖకు రారు. అలా వచ్చిన వారికి ఒకటి రెండు రోజులకు నేవీ అతిధి గృహాలు ఉంటాయి.

అందుకోసం ఏకంగా వందల కోట్లు పెట్టి ఇంతటి ప్యాలెస్ కట్టించాలా అన్నది కూటమి ప్రభుత్వ పెద్దలు ప్రశ్నిస్తున్నారు ఇది జగన్ కోసమే కట్టించుకున్నారు అని కూటమి పెద్దలు విమర్శిస్తున్నారు. ఒక వ్యక్తి విలాసం కోసమే ఇదంతా దుబారా చేశారు అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు.

ఇవన్నీ పక్కన పెడితే దీనిని ఎవరికి అద్దెకి ఇద్దామన్నా భరించలేని వ్యవహారం వారికి కూడా అవుతుంది. అలాగని ప్రభుత్వం మెయింటెయిన్ చేయాలంటే నెలకు ముప్పయి లక్షలు అవుతుంది అని అంటున్నారు. దీంతో తెల్ల ఏనుగు మాదిరిగా రుషికొండ ప్యాలెస్ తయారైంది అని అంటున్నారు. పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల క్రితం అక్కడికి వెళ్లి అంతా చూసారు

ఇపుడు చంద్రబాబు చూశారు. ఆ విధంగా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చూసినా ప్యాలెస్ విషయంలో ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఇక వీటిని మరే విధంగా వాడుకోవాలని చూసినా మొత్తం డిజైన్ స్ట్రక్చర్ మార్చాలి. అంటే ఉన్నది పూర్తిగా కూలగొట్టాల్సి ఉంటుంది. మొత్తానికి అయితే ఇది కూటమికి సవాల్ గా మారింది అనే అంటున్నారు. చూడాలి మరి ఏమి చేస్తారో.

Tags:    

Similar News