ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్.. లేఖ రాసిన ప్రైవేటుఆసుపత్రులు!

ఏపీలోని జగన్ సర్కార్ ప్లాగ్ షిప్ ప్రోగ్రాంలో ఒకటైన ఆరోగ్య శ్రీకి సంబంధించిన షాకింగ్ స్టేట్ మెంట్ ఇప్పుడు సంచలనంగా మారింది.

Update: 2024-05-21 04:00 GMT

ఏపీలోని జగన్ సర్కార్ ప్లాగ్ షిప్ ప్రోగ్రాంలో ఒకటైన ఆరోగ్య శ్రీకి సంబంధించిన షాకింగ్ స్టేట్ మెంట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఏపీ ప్రజలకు బ్యాడ్ న్యూస్ గా మారిన ఈ వ్యవహారంలో తప్పు ఎవరిదైనా.. శిక్ష మాత్రం పేద ప్రజల మీద పడనుంది. తమకు ఇవ్వాల్సిన రూ.1500 కోట్ల బకాయిల్ని ప్రభుత్వం చెల్లించని కారణంగా ఈ నెల 22 నుంచి(అంటే బుధవారం) నుంచి ఆరోగ్య శ్రీ సేవల్ని నిలిపివేస్తున్నట్లుగా ప్రైవేటు ఆసుపత్రుల వర్గాలు వెల్లడించాయి. దీనికి సంబంధించిన లేఖ రాశారు.

పేద ప్రజలకు సైతం ప్రైవేటు ఆసుపత్రుల్లో కార్పొరేట్ వైద్య సేవలు అందేందుకు వీలు కల్పించే జగన్ సర్కారు వైఎస్సార్ హెల్త్ కేర్ ట్రస్టు పేరుతో పేదలకు ఉచితంగాప్రైవేటుఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవల్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. తమకు భారీగా మొత్తంలో బకాయిలు పెండింగ్ లో పడ్డాయని.. వాటిని తీరిస్తేనే తప్పించి తాము ఆరోగ్య శ్రీ సేవల్ని కొనసాగంచలేమంటూ తాజాగా ప్రభుత్వానికి లేఖ రాశారు.

ప్రైవేటు ఆసుపత్రుల్లో తాము అందిస్తున్న నాణ్యమైన వైద్య సేవల్ని 22 నుంచి కొనసాగించలేమని.. బుధవారం నుంచి ఈ పథకం కింద వైద్య సేవల్ని అందించమన్న విషయాన్ని గుర్తించాలని పేర్కొన్నారు. ఈ పథకం కింద 2023ఆగస్టు నుంచి వైద్య సేవలు తాము అందించినా.. ఇప్పటివరకు బిల్లులు పెండింగ్ లో ఉంచారే తప్పించి.. బకాయిలు క్లియర్ చేయలేదని ప్రైవేటు ఆసుపత్రుల యజమానులు వాపోతున్నారు.

తమకు రావాల్సిన బకాయిల గురించి ఎన్నిసార్లు ప్రభుత్వానికి విన్నవించినా తమకు నిధులు విడుదల చేయని కారణంగా.. వైద్య సేవల్ని నిలిపివేయాలన్న నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి లిఖిత పూర్వకంగా లేఖ రాశారు. తమకు రావాల్సిన రూ.1500 కోట్ల బకాయిలకు ఇప్పటివరకు రూ.50 కోట్లు మాత్రమే చెల్లించినట్లుగా చెబుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే తాము ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా వెల్లడించారు. ఆరోగ్యశ్రీ కింద అందిస్తున్న చికిత్సలకు ఇచ్చే ప్యాకేజీ రేట్లను కూడా పెంచాలని కోరుతున్నాయి. సుమారుగా పదేళ్ల కిందటి ధరలనే ఇప్పటికీ అమలు చేస్తున్నారన్న వారు.. ప్యాకేజీ ధరల్ని పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. కొద్దిరోజుల క్రితం తమకు రావాల్సిన బకాయిల మీద ఏపీ స్పెషాలిటీఆసుపత్రుల సంఘం కూడా ఇదే తరహాలో హెచ్చరికలు జారీ చేసింది. మే 4 నుంచి నగదు రహిత చికిత్సలు నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించింది. ఇప్పుడు వారి బాటలో ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల సంగం కూడా నడవటం ఆందోళన కలిగిస్తోంది. కీలకమైన ఎన్నికలు జరిగి.. అధికార మార్పిడి జరిగే సమయంలో ప్రజలకు ఇబ్బంది కలిగేలా ఈ తరహా చర్యలు సరికావంటున్నారు. ఇదే అంశాన్ని ఎన్నికలకు ముందు చేసి ఉంటే బాగుంటుందంటున్నారు. టైం చూసి ఈ తరహా చర్యలు సరికావన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News