ముందస్తు ఎన్నికలపై జగన్‌ హింట్‌ ఇచ్చేసినట్టేనా?

ఆంధ్రప్రదేశ్‌ లో ముందస్తు ఎన్నికలు ఖాయమని నిన్నమొన్నటి వరకు అంతా భావించారు.

Update: 2023-09-27 04:46 GMT

ఏపీలో రాజకీయ పరిణామాలు ప్రస్తుతం హీట్‌ ఎక్కిన సంగతి తెలిసిందే. ఓవైపు టీడీపీ అధినేత చంద్రబాబును స్కిల్‌ డెవలప్మెంట్‌ కేసులో అరెస్టు చేయడం.. మరోవైపు జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించడంతో ఏపీ రాజకీయాలు కీలక మలుపు తీసుకున్నాయి.

కాగా ఆంధ్రప్రదేశ్‌ లో ముందస్తు ఎన్నికలు ఖాయమని నిన్నమొన్నటి వరకు అంతా భావించారు. ప్రతిపక్ష కూటమి బలపడకముందే వైసీపీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఎన్నికలకు వెళ్తారని ఊహాగానాలు వినిపించాయి. ఇదే విషయాన్ని ఆయన కేంద్ర ప్రభుత్వానికి నివేదించారని.. కేంద్రం సైతం ఇందుకు ఓకే చెప్పిందని వార్తలు వచ్చాయి.

ప్రతిపక్ష టీడీపీ, జనసేన సైతం ఆంధ్రప్రదేశ్‌ లో ముందస్తు ఎన్నికలు ఖాయమనే తమ శ్రేణులకు చెప్పుకుంటూ వచ్చాయి. కొంతమంది వైసీపీ నేతలు సైతం ముందస్తు ఎన్నికలు వస్తాయని ప్రకటించారు. దీంతో ముందస్తుగానే ఈ ఏడాది డిసెంబర్‌ లోనే ఎన్నికలు వస్తాయని అంతా భావించారు.

అయితే వైఎస్‌ జగన్‌ తాజాగా నిర్వహించిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇంచార్జులు, పార్టీ జిల్లాల అధ్యక్షుల సమావేశంలో ఎన్నికలపై స్పష్టత ఇచ్చారు. మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరుగుతాయని.. ఈ ఆరు నెలలు మనకు ముఖ్యమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఆరు నెలలు ప్రజలతో మరింత మమేకమవ్వాలని.. ప్రజల్లోనే ఉండాలని నేతలకు సూచించారు.

షెడ్యూల్‌ ప్రకారం.. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. దీని ప్రకారం.. ఇంకా ఎన్నికలకు ఆరు నెలల సమయం మాత్రమే ఉంది. ఇదే విషయాన్ని పార్టీ నేతల సమావేశంలో జగన్‌ కూడా ప్రకటించడంతో ముందస్తు ఎన్నికలు ఉండనట్టేనని భావిస్తున్నారు. షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు.

సర్వే రిపోర్టులు, వారి పనితీరు నివేదికల ఆధారంగానే అభ్యర్థులకు టిక్కెట్లు కేటాయిస్తామని జగన్‌ ప్రకటించారు. ఈ విషయంలో తనను అర్థం చేసుకోవాలని నేతలను కోరారు. సీట్లు రానివారని వదిలిపెట్టబోనని.. వారికి వేరే విధంగా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.

అయితే జగన్‌ మాటను ప్రతిపక్షాలు విశ్వసించడం లేదు. ముందస్తు ఎన్నికలు రావని చెబితే ప్రతిపక్షాలు సంసిద్ధంగా ఉండవనే ఆయన అలా చెబుతున్నారని అనుమానిస్తున్నాయి. ముందస్తు ఎన్నికలు ఖాయమని ప్రతిపక్షాలు నమ్ముతుండటం గమనార్హం. మరి ముందస్తు ఎన్నికలా లేక షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలా అనేది మరికొద్ది రోజుల్లో తెలిసిపోనుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం అక్టోబర్‌ మొదటి వారంలో షెడ్యూల్‌ విడుదల చేయనుంది. ఏపీకి కూడా ముందస్తు ఎన్నికలు ఉంటే తెలంగాణతోపాటే వెలువడే అవకాశం ఉంటుంది. లేదంటే ముందస్తు ఎన్నికలు లేనట్టుగానే దాదాపు భావించాల్సి ఉంటుంది.

Tags:    

Similar News