పదవిలో ఉండగా సీఎం ను అరెస్ట్ చేయవచ్చా...? రూల్స్ ఇవే!
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసింది. దీంతో... పదవిలో ఉండగా అరెస్ట్ అయిన తొలి ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ రికార్డుల కెక్కారు. వాస్తవానికి గతంలోనే సీబీఐ అరెస్ట్ చేసే అవకాశం ఉందని కథనాలొచ్చినా నాడు జరగలేదు. ఈ క్రమంలో తాజాగా ఈడీ ఆ పని చేసింది! దీంతో... సీఎంను అరెస్ట్ చేయవచ్చా.. రూల్స్ ఏమి చెబుతున్నాయి.. అరెస్ట్ ల విషయంలో దేశంలో ఎవరికి ఎలాంటి ఇమ్యూనిటీ ఉంది అనే చర్చ తెరపైకి వచ్చింది.
అవును... రూలింగ్ లో ఉన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటివరకూ సుమారు ఆరుగురు ముఖ్యమంత్రులు అరెస్ట్ అయినప్పటికీ... వారు మాజీలు అయిన తర్వాత ఆ కార్యక్రమం జరిగింది! దీంతో... ఫస్ట్ టైం పదవిలో ఉండగానే అరెస్టైన సీఎంగా కేజ్రీవాల్ చరిత్రకెక్కారు. అయితే... భారతదేశంలో చట్టం దృష్టిలో ప్రతీ పౌరుడూ సమానమే అని అంటున్నారు పరిశీలకులు.
చట్టం దృష్టిలో, ప్రతి భారతీయ పౌరుడు సాధారణ వ్యక్తే! అటువంటి చర్యను నిరోధించడానికి ఎటువంటి నియమాలు లేనందున ఏ పౌరుడిపై అయినా క్రిమినల్ నేరం నమోదైతే.. ఆ వ్యక్తి దేశ ప్రధానమంత్రి అయినా కూడా అరెస్టు చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ విషయంలో రాజ్యాంగం ద్వారా ఏకైక రక్షణ రాష్ట్రపతి, గవర్నర్ లకు మాత్రమే ఉంటుందని.. వారి పదవీ కాలం ముగిసేవరకూ వారిపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ లో ఇమ్యునిటీని కలిగి ఉంటారని అంటున్నారు!
రాజ్యాంగంలోని ఆర్టికల్ 361 ప్రకారం.. భారత రాష్ట్రపతి, గవర్నర్లు వారి అధికారిక విధులను నిర్వర్తించే ఏ చర్యకైనా ఏ న్యాయస్థానానికి జవాబుదారీగా ఉండరని స్పష్టం చేస్తున్నారు. వారు పదవిలో ఉన్నప్పుడు క్రిమినల్ నేరాలలో కూడా అరెస్టు చేయలేరు. అయితే... పదవీ విరమణ చేసిన తర్వాత మాత్రం వారిపై చర్యలు తీసుకోవడం ప్రారంభించబడవచ్చు.
ఇక భారత్ లోని దర్యాప్తు సంస్థలకు సంబంధించినంతవరకు, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 (సీఆర్పీసీ) నిబంధనల ప్రకారం.. న్యాయస్థానం అరెస్టు వారెంట్ జారీ చేసిన ఏ వ్యక్తినైనా చట్ట అమలు చేసే సంస్థ అరెస్టు చేయవచ్చు. ఒక ముఖ్యమంత్రిని అరెస్టు చేసిన సందర్భంలో.. కొన్ని నియమాలు, విధానపరమైన అంశాలకు మాత్రం కట్టుబడి అరెస్ట్ చేయాల్సి ఉంటుంది!
అయితే... సివిల్ ప్రొసీడ్యూరల్ కోడ్ సెక్షన్ 135 ప్రకారం... పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో పార్లమెంటు సభ్యులు 40 రోజుల ముందు, 40 రోజుల తర్వాత అరెస్టు చేయకుండా రక్షణ కలిగి ఉంటారని చెబుతున్నారు! అయితే, ఈ రక్షణ కేవలం సివిల్ కేసులకు మాత్రమే వర్తిస్తుంది. క్రిమినల్ కేసుల విషయంలో ఎలాంటి రక్షణ ఉండదు!!