కవిత కోర్ట్ ముందుకు... మరోపక్క ఊపిరి పీల్చుకున్న కేజ్రీవాల్!
ఇందులో భాగంగా విచారణ నిమిత్తం కేజ్రీవాల్ కు ఇప్పటి వరకు ఎనిమిదిసార్లు ఈడీ సమన్లు పంపింది.
మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయగా.. తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ లభించింది. ఈ మేరకు ఆయన ఢిల్లీలోని ఈడీ కోర్టుకు హాజరయ్యారు. రూ.15,000 బాండ్, రూ.లక్ష పూచీకత్తుతో న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన ఊపిరిపీల్చుకున్నారు.
మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే పలువురిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా విచారణ నిమిత్తం కేజ్రీవాల్ కు ఇప్పటి వరకు ఎనిమిదిసార్లు ఈడీ సమన్లు పంపింది. అయితే ఆయన వాటిని తిరస్కరించారు. ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాలేదు. దీంతో గత నెలలో ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కోర్టులో ఫిర్యాదు చేసింది. దీనిపై నాడు విచారణ జరిపిన కోర్టు ఫిబ్రవరి 17న కోర్టుకు రావాలని ఆదేశాలు జారీ చేసింది.
అయితే ఆ సమయంలో అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఉండటంతో అరవింద్ కేజ్రీవాల్ కోర్టుకు వర్చువల్ గా హాజరయ్యారు. తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరవుతానని కోర్టుకు విన్నవించారు. ఇందుకు అంగీకరించిన కోర్టు విచారణను వాయిదా వేసింది.
మరోవైపు ఈ అంశం కోర్టులో పెండింగ్ లో ఉండగానే ఈడీ ఆయనకు మరిన్ని సమన్లు పంపింది. చివరిసారిగా మార్చి 4న విచారణకు రావాలని నోటీసులు పంపినా కేజ్రీవాల్ విచారణకు హాజరు కాలేదు.
అయితే, విచారణను ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని కేజ్రీవాల్ ఈడీకి సమాధానం పంపారు. మార్చి 12 తర్వాత విచారణకు హాజరవుతానని.. అయితే వర్చువల్ గానే విచారణకు హాజరవుతాననని షరతుత పెట్టారు. దీంతో ఈడీ మరోసారి కోర్టు తలుపుతట్టింది. దీంతో మార్చి 16న తప్పనిసరిగా తమ ఎదుట హాజరుకావాలని ఈడీ కోర్టు కేజ్రీవాల్ కు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగానే ఆయన కోర్టుకు హాజరయ్యారు.
కాగా కేజ్రీవాల్ పై మోపిన అభియోగాలు బెయిల్ పొందడానికి అవకాశం ఉన్న సెక్షన్లని న్యాయమూర్తి తెలిపారు. ఈ నేపథ్యంలో ఈడీ చేసిన రెండు ఫిర్యాదులకు సంబంధించి కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేశారు. దీంతో ఆయనకు ఊరట లభించింది.