కేంద్ర ప్రభుత్వంపై నిటాషా సంచలన ఆరోపణలు!

కేంద్ర ప్రభుత్వంపై భారత సంతతికి చెందిన యునైటెడ్‌ కింగ్‌ డమ్‌ ప్రొఫెసర్, రచయిత నిటాషా కౌల్‌ ధ్వజమెత్తారు

Update: 2024-02-26 10:15 GMT

కేంద్ర ప్రభుత్వంపై భారత సంతతికి చెందిన యునైటెడ్‌ కింగ్‌ డమ్‌ ప్రొఫెసర్, రచయిత నిటాషా కౌల్‌ ధ్వజమెత్తారు. కర్ణాటక ప్రభుత్వ ఆహ్వానం మేరకు బెంగళూరు విమానాశ్రయంలో దిగిన తనను ఇమిగ్రేషన్‌ సిబ్బంది అడ్డుకున్నారని ఆమె ఆరోపించారు. అనంతరం తిరిగి తనను బెంగళూరు వెళ్లనీయకుండా లండన్‌ కు తిప్పి పంపేశారని విమర్శించారు. ఎందుకు ఇలా చేస్తున్నారని అధికారులను అడిగితే తన పర్యటనకు కేంద్ర ప్రభుత్వ అనుమతి లేదని చెప్పారని మండిపడ్డారు. ఈ మేరకు నిటాషా ఈ విషయాలన్నింటిని తన సోషల్‌ మీడియా ఖాతాల్లో పోస్టు చేశారు.

కర్ణాటకలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆహ్వానం మేరకు నిటాషా కౌల్‌ బెంగళూరుకు రాగా అనుమతి లేదని భారత ప్రభుత్వం దేశంలో ప్రవేశానికి నిరాకరించింది. ఈ నేపథ్యంలో నిటాషా కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

‘ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలు’ అనే అంశంపై మాట్లాడేందుకు కర్ణాటక ప్రభత్వం తనను ఆహ్వానించిందని నిటాషా కౌల్‌ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రిక తనవద్ద ఉందన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం తనను ఎయిర్‌ పోర్టులోనే ఆపేసి తిరిగి లండన్‌ పంపించివేసిందన్నారు. తన వద్ద అవసరమైన డాక్యుమెంట్లన్నీ ఉన్నా అధికారులు రానీయలేదని ఆరోపించారు. గతంలో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌)పై విమర్శలు చేసినందుకే తనను దేశంలోకి రానీయలేదని విమర్శించారు. ఈ విషయాన్ని అధికారులు తనకు అధికారికంగా తెలిపారన్నారు.

ఎంతో కష్టపడి లండన్‌ నుంచి 24 గంటల పాటు ప్రయాణించి బెంగళూరు వచ్చానని నిటాషా కౌల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ 24 గంటలు అటు ఇటు తిప్పి నన్ను విమానాశ్రయంలోనే ఉంచారని వాపోయారు. కనీసం ఆహారం, మంచినీళ్లు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. పడుకోవడానికి మాత్రం కొద్దిగా స్థలం చూపించారన్నారు. అక్కడ కూడా కనీసం దిండు ఇవ్వలేదని చెప్పారు.

సీసీ కెమెరాల పర్యవేక్షణలో తనను ఉంచారని నిటాషా కౌల్‌ తెలిపారు. తాను ఎన్నోసార్లు భారత్‌ వచ్చానని గుర్తు చేశారు. తనకు దేశంలోకి అనుమతి లేనట్లు కనీసం ముందుగా కూడా చెప్పలేదని వాపోయారు. కర్ణాటక ప్రభుత్వమే తనకు టికెట్లు ఇచ్చిందని తెలిపారు.

కాగా నిటాషా కౌల్‌ లండన్‌లోని వెస్ట్‌ మినిస్టర్‌ విశ్వవిద్యాలయంలో రాజకీయాలు, అంతర్జాతీయ సంబంధాలు విభాగంలో ప్రొఫెసర్‌ గా పనిచేస్తున్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఆమె బీఏ ఆనర్స్‌ ఆర్థిక శాస్త్రం చదివారు. ఇంగ్లండ్‌ లోని యూనివర్సీటీ ఆఫ్‌ హల్‌ నుంచి జాయింట్‌ పీహెచ్‌డీ చేశారు.

Tags:    

Similar News