ఏపీలో బాబు మార్క్ మార్పు మొదలైందా?

తాము ప్లాన్ చేస్తున్న ఆయిల్ రిఫైనరీ.. పెట్రో కెమికట్ కాంప్లెక్స్ ఏర్పాటు కోసం భారీ భూమి అవసరమన్న ప్రపోజల్ ను ఏపీ సర్కారు ముందు పెట్టింది బీపీసీఎల్.

Update: 2024-07-11 05:30 GMT

ప్రభుత్వం ఏదైనా పాజిటివ్ ఫీల్ ముఖ్యం. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అన్ని రంగాలకు భద్రత.. భరోసా ఇవ్వాల్సిన అవసరం అధినాయకుడి మీద ఉంటుంది. తమ ప్రభుత్వంలో వ్యాపారాలకు సానుకూల వాతావరణం ఉంటుందన్నట్లుగా వ్యవహరించే ముఖ్యమంత్రులు కొందరుంటారు. అందులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పేరు టాప్ లో ఉంటుంది. ఈ ఇమేజ్ ఏ మాత్రం తగ్గని రీతిలో ఏపీలో పరిస్థితులు నెలకొని ఉన్నట్లుగా చెబుతున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన స్వల్ప వ్యవధిలోనే పలు కంపెనీలు ఏపీ బాట పట్టినట్లు చెప్పేలా కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

తాజాగా అలాంటి ఉదంతమే చోటు చేసుకుంది. దిగ్గజ సంస్థల్లో ఒకటైన ప్రభుత్వ రంగ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీలో వేలాది కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. దాదాపు రూ.75 వేల కోట్ల పెట్టుబడులతో ఏపీలో ఆయల్ రిఫైనరీ.. పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లుగా పేర్కొంటూ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసింది.

తాము ప్లాన్ చేస్తున్న ఆయిల్ రిఫైనరీ.. పెట్రో కెమికట్ కాంప్లెక్స్ ఏర్పాటు కోసం భారీ భూమి అవసరమన్న ప్రపోజల్ ను ఏపీ సర్కారు ముందు పెట్టింది బీపీసీఎల్. వారి అంచనా ప్రకారం తాజా ప్రాజెక్టు కోసం 4-5 వేల ఎకరాల భూమి అవసరమవుతుందన్న విషయాన్ని సీఎం ద్రష్టికి తీసుకెళ్లారు. ఈ అంశంపై చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. ప్రాజెక్టుకు అవసరమైన భూముల్ని కేటాయించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేశారు.

అంతేకాదు తొంభై రోజుల్లో ప్రాజెక్టు ఏర్పాటుకు సంబంధించిన పూర్తి ప్రణాళికలో రావాలన్న చంద్రబాబు మాటకు సంసథ ప్రతినిధులు అంతే ఉత్సాహంగా స్పందించారు. అక్టోబరు నాటికి పూర్తిఫీజిబులిటీ రిపోర్టుతో వస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు అమల్లోకి వస్తే దాదాపు పాతిక వేల మంది వరకు ఉపాధి లభిస్తుందని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టు మీద చంద్రబాబు సోషల్ మీడియా వేదిక మీద రియాక్టు అయ్యారు.

తాను బీపీసీఎల్ సీఎండీ కృష్ణకుమార్‌ ఆయన టీంను కలిసినట్లుగా పేర్కొన్న చంద్రబాబు.. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో చమురు శుద్ధి కర్మాగారం, పెట్రో కెమికల్‌ కారిడార్‌ ఏర్పాటుపై చర్చించాం. 90 రోజుల్లో వివరణాత్మక ప్రణాళిక, దాని సాధ్యాసాధ్యాల రిపోర్టు కోరాను. దీని కోసం దాదాపు 5వేల ఎకరాల భూమి అవసరం కానుంది. ఎవరికీ ఇబ్బంది లేని పద్ధతిలో సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది’’ అంటూ ట్వీట్ చేశారు. మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే.. దిగ్గజ ప్రభుత్వ రంగ సంస్థతో పాటు మరో ప్రముఖ ప్రైవేటు సంస్థ సైతం ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని చూపింది.

ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసిన ఈ సంస్థ ప్రతినిధులు.. ఏపీలో పెట్టుబడులు పెట్టే అంశాన్ని చర్చించారు. ఇంతకూ ఆ సంస్థ మరేమిటో కాదు.. వియత్నాంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో మంచి పేరున్న విన్ ఫాస్ట్ సంస్థ. దీని సీఈవో తో పాటు సదరు సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. దాదాపు రూ.4వేల కోట్ల పెట్టుబడులతో ఎలక్ట్రిక్ వాహనాలు.. బ్యాటరీల తయారీ కర్మాగారం ఏర్పాటుకు సంసిద్ధతను వ్యక్తం చేశారు. మొత్తంగా చూస్తే ఒకే రోజున రెండు ప్రముఖ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిని చూపటం ఒక ఎత్తు కాగా.. చంద్రబాబు నాయకత్వంలో ఏపీ ప్రభుత్వం పెట్టుబడులకు సానుకూలంగా ఉందన్న సంకేతాల్ని పంపటంలో ఏపీ సీఎం సక్సెస్ అవుతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News