టీడీపీలో బాలయ్యకు చెక్ పెట్టేసినట్లేనా...?

అలాంటి టీటీడీపీకి నేను ఇక మీదట నాయకత్వం వహిస్తాను, తెలంగాణాలో టీడీపీ ఎక్కడ లేదో చూపిస్తాను అని బాలయ్య సడెన్ గా ఎంట్రీ ఇచ్చి మీడియా ముందు గంభీరమైన ప్రకటన చేశారు.

Update: 2023-10-05 14:30 GMT

తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఏపీలో వెలుగు వెలిగిన పార్టీయే. 2014 దాకా టీడీపీకి తెలంగాణాలో మంచి బలం ఉంటూ వచ్చింది. అయితే టీయారెస్ అధికారంలోకి వచ్చాక టీడీపీనే టార్గెట్ చేసింది. అలా టీడీపీలోని కీలక నేతలు అంతా టీయారెస్ లోకి వెళ్ళిపోయి చిక్కిపోయింది. ఆ పార్టీని తిరిగి లేపడానికి 2018లో చంద్రబాబు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని కొత్త రాజకీయ ప్రయోగం చేశారు. కానీ అది పూర్తి స్థాయిలో వికటించింది.

ఈ రోజున టీటీడీపీ ఉందంటే ఉంది అని అనుకుంటున్న నేపధ్యం ఉంది. అలాంటి టీటీడీపీకి నేను ఇక మీదట నాయకత్వం వహిస్తాను, తెలంగాణాలో టీడీపీ ఎక్కడ లేదో చూపిస్తాను అని బాలయ్య సడెన్ గా ఎంట్రీ ఇచ్చి మీడియా ముందు గంభీరమైన ప్రకటన చేశారు. ఇది చాలా ఆశ్చర్యకరంగానే ఉంది. ఎందుకంటే ఏపీలో ఇపుడు టీడీపీ తీవ్ర సంక్షోభంలోఉంది. ఎంతలా అంటే అధినాయకుడు చంద్రబాబు జైలు గోడల మధ్య నెల రోజులుగా ఉన్నారు.

ఆయన లేని లోటు పార్టీలో స్పష్టంగా ఉంది. ఏపీలో టీడీపీకి అధికారం ఆశలు ఉన్నాయి. ఎన్నికల వేళ పార్టీని పటిష్టం చేయాల్సి ఉంది. అక్కడ బాలయ్య లాంటి సినీ స్టార్ అవసరం ఉంది. అంతే కాదు నందమూరి బ్లడ్ అవసరం ఉంది. బాలయ్య కూడా అందుకే మొదట్లోనే రంగంలోకి దిగారు. ఆయన బాబు అరెస్ట్ అయిన మరుసటి రోజే మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో ఏకంగా బాబు సీట్లోనే కూర్చుని పార్టీని మొత్తం నడిపిస్తామని స్టేట్మెంట్ ఇచ్చారు.

చంద్రబాబు అరెస్ట్ తరువాత చనిపోయిన వారి కుటుంబాలను తానే స్వయంగా వెళ్లి ఒదారుస్తాను అని చెప్పారు. ఇక మామూలుగా ఉండదు, కాచుకో జగన్ అని ఆయన వార్నింగ్ ఇచ్చేశారు. దాంతో వైసీపీ ఎంతవరకూ సీరియస్ గా తీసుకుందో కానీ టీడీపీ అలెర్ట్ అయింది అంటున్నారు. ఆ వెంటనే ఎక్కడో హైదరాబాద్ లో ఉన్న భువనేశ్వరి, బ్రాహ్మణి రాజమండ్రికి షిఫ్ట్ అయ్యారు. చంద్రబాబు జైలులో ఉన్న దానికి సమీపంలోనే క్యాంప్ ఆఫీసు పెట్టి టీడీపీలో యాక్షన్ మొదలెట్టారు.

అలా బాలయ్య దూకుడుకు ఒక చెక్ పెట్టారని ప్రచారం సాగింది. ఇక టీడీపీలోని ఒక సీనియర్ నేత నేరుగా ములాఖత్ ద్వారా బాబు ఉంటున్న జైలులోకి వెళ్ళి మరీ బాలయ్య అతి దూకుడు గురించి చర్చించారని కూడా ప్రచారం జరిగింది. ఇక్కడ మరో తమాషా ఏంటి అంటే బాలయ్య ఎప్పుడూ టీడీపీలో ఇంత యాక్టివ్ గా కనిపించలేదు. బాబు అరెస్ట్ తో ఆయన ఫుల్ యాక్టివ్ కావడంతో ఆయనకు టీడీపీకి నాయకత్వం వహించాలన్న కోరిక బలంగా ఉందన్నది పార్టీ వారికి బయట జనాలకు ఏకంగా చంద్రబాబుకు ఫస్ట్ టైం తెలిసివచ్చిందని అంటున్నారు.

మరి బాలయ్య మాటకారి కాదు వ్యూహకర్త కాదు కానీ ఆయనకు ఉన్న ప్లస్ పాయింట్లు ఆయనకు ఉన్నాయి. అవేంటి అంటే ఆయన ఎన్టీయార్ కుమారుడు, నందమూరి వంశీకుడు, సినీ గ్లామర్ ఎటూ ఉంది. పైగా రెండు సార్లు హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఉన్నారు. దాంతో స్వతహాగా భువనేశ్వరి, బ్రాహ్మణిల కంటే బాలయ్యకే పార్టీలో పటిష్టమైన స్థానం ఉంది. ఈ రోజుకీ ఆయనను కోరుకుంటున్న వారూ ఉన్నారు.

అందుకే బాలయ్య అతి దూకుడు ప్రమాదం అని ఆ పార్టీ పెద్దలు భావించారో ఏమో కానీ మొదట్లో బాలయ్య మంగళగిరి ఆఫీసులో కనిపించారంతే. ఆ తరువాత పెద్దగా హడావుడి లేదు అనుకుంటే ఆయన ఇపుడు హైదరాబాద్ పార్టీ ఆఫీసులో కనిపించారు. పైగా టీటీడీపీకి సారధ్యం వహిస్తాను అని అంటున్నారు.

అలా బాలయ్యను తెలంగాణా వైపు షిఫ్ట్ చేయడం ద్వారా చంద్రబాబు ఆయన వైపు నుంచి వచ్చే నాయకత్వ ముప్పు సమస్యను తెలివిగా స్మూత్ గా తప్పించేశారు అని అంటున్నారు. అంటే బాబు అరెస్ట్ అయి జైలులో ఉన్న సమయంలో టీడీపీ క్లిష్ట పరిస్థితులలో కూడా నందమూరి వారి సారధ్యం వద్దు అన్నట్లుగానే ఒక గట్టి సందేశం వెళ్ళింది అని అంటున్నారు. ఈ రకంగా చేయడం ద్వారా చంద్రబాబు తాను జైలు గోడల మధ్య ఉన్నా కూడా సక్సెస్ అనిపించుకున్నారు అంటున్నారు.

ఇక బాలయ్య తెలంగాణా టీడీపీని ఉద్ధరిస్తాను అంటూ ఇస్తున్న స్టేట్మెంట్స్ వింటున్న వారు టీడీపీ వారు కూడా విస్మయం చెందుతున్నారు. ఏపీలో కదా టీడీపీ పీకల్లోతు కష్టాలలో ఉంది. అలాంటపుడు టీడీపీని అర్జంటుగా ఆదుకొవాల్సింది అక్కడ కదా, మరి బాలయ్య తెలంగాణాలో పార్టీ అంటున్నారేంటి అన్న చర్చతో పాటు అనెక డౌట్లు వస్తున్నాయట. చిత్రమేంటి అంటే బాలయ్యకు ఈ విషయాల మీద అవగాహన లేకపోవడమే.

ఆయన మంగళగిరి ఆఫీస్ అయితేనేంటి, హైదరాబాద్ ఆఫీస్ అయితేంటి అంతా టీడీపీయే కదా అని అనుకుంటున్నారు అంటున్నారు. అయితే ఏపీలో అధికారంలోకి ఎపుడైనా వచ్చే చాన్స్ ఉంది. వట్టిపోయి చిక్కిపోయి ఉన్న టీటీడీపీకి సారధ్యం అంటూ బాలయ్య సంబరం పడుతున్నారు అంటే రాజకీయంగా ఆయన వ్యూహాలు తెలియకనే అని అంటున్న వారూ ఉన్నారు.

ఈ మొత్తం ఎపిసోడ్ ని జాగ్రత్తగా గమనిస్తున్న వారు కానీ టీడీపీ రాజకీయాల మీదా అవగాహన ఉన్న వారు కానీ బాలయ్య అడ్డుకుని నారా ఫ్యామిలీ తొలగించినుకుందని, అందుకే ఆయన్ని ఈ వైపుగా షిఫ్ట్ చేశారని అంటున్నారు. ఎప్పటికీ ఎదగని చోట ఎడారి దారిలో బాలయ్య టీటీడీపీని బతికిస్తాను అంటూ చేస్తున్న ప్రకటనలు చూసిన వారు బాలయ్య ఇక ఇంతేనయ్యా అనుకుంటున్నారుట.

Tags:    

Similar News