ఎన్నికల్లో పోటీ మీద బాలినేని సంచలన కామెంట్స్...?
తాజాగా మీడియాతో మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో తాను పోటీ చేసే విషయం మీద సంచలన కామెంట్స్ చేశారు.
బాలినేని శ్రీనివాస్ మాజీ మంత్రిగా రాజకీయాల్లో సుపరిచితులు. ఆయన అనేక సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసి ఉన్నారు. ఇదిలా ఉంటే ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో తాను పోటీ చేసే విషయం మీద సంచలన కామెంట్స్ చేశారు. నేను వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే విషయం మీద తీవ్ర స్థాయిలో చర్చ సాగుతోంది. కానీ నేను మళ్ళీ ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచే పోటీ చేస్తాను అని ఆయన పక్కా క్లారిటీ ఇచ్చారు.
తాను పోటీ చేసే విషయంలో కొంతమంది కొన్ని రకాలుగా మాట్లాడుతున్నారని వాటిని నమ్మవద్దని బాలినేని కోరడం విశేషం. అంతే కాదు ఒంగోలు నుంచి ఎంపీగా మరోసారి మాగుంట శ్రీనివాసులురెడ్డి పోటీ చేస్తారని ఆయన ప్రకటించడం విశేషం.
నిజానికి ఒంగోలు ఎంపీగా బాలినేని పోటీ చేస్తారు అని కూడా ప్రచారం చేస్తూ వచ్చారు. అంతే కాదు ఆయన అసెంబ్లీకి పోటీ చేస్తే ఒంగోలు కాకుండా వేరే సీటుని ఎంచుకుంటారని కూడా చెబుతూ వచ్చారు. అయితే వాటిని బాలినేని ఇపుడు స్వయంగా ఖండించారు. దాంతో బాలినేని ఒంగోలు నుంచి మళ్లీ పోటీ చేయడం ఖాయమని తేలిపోయింది.
ఇక ఆయన 1999 నుంచి 2009 వరకూ మూడు సార్లు వరసగా గెలిచి హ్యాట్రిక్ విజయం సొంతం చేసుకున్నారు. వైసీపీలో జగన్ కోసం కాంగ్రెస్ కి రాజీనామా చేసి 2012లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ పోటీ చేసి గెలిచారు. 2014లో మాత్రం ఫస్ట్ టైం ఓడారు అయితే 2019లో తిరిగి తన పట్టుని నిలబెట్టుకున్నారు. ఇదిలా ఉంటే 2024 లో కూడా తానే ఒంగోలు ఎమ్మెల్యే క్యాండిడేట్ అని అంటున్నారు.
ఇదిలా ఉండగా తాను గడప గడపకు కార్యక్రమంలో స్లోగా ఉన్నట్లుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారని బాలినేని చెప్పడం విశేషం. అయితే మొక్కుబడి హడావుడి లేకుండా ప్రతీ ఇంటికీ వెళ్లి సమస్యలను పూర్తిగా కనుక్కుంటున్నానని, పరిష్కరిస్తున్నాను అని ఆయన చెప్పారు. ఈ విషయంలో తాను ఇలా చేయడం వల్లనే గడప గడప కార్యక్రమం ఆలస్యం అవుతోంది తప్ప మరోటి కాదని సీఎం చెప్పానని అన్నారు.
మొత్తం మీద చూస్తే ఒంగోలు నుంచి మరోసారి పోటీకి బాలినేని రెడీ అవుతున్నారు. ఒంగోలులో తన ప్లాన్ ఆఫ్ యాక్షన్ కి కూడా ఆయన సిద్ధపడుతున్నారు. ఈ నేపధ్యంలో బాలినేని పక్కా క్లారిటీతోనే తన పోటీ చేసే సీటు విషయాన్ని తన మనసులో మాటను చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా ఒంగోలులో పూర్తి బలం ఉన్న బాలినేని 2024లో మరోసారి పోటీ చేసి ఆరవసారి గెలుపు బావుటా ఎగరవేస్తారని అనుచరులు అంటున్నారు. దాంతో ఆయన అనుచరులలో ఆనందం వ్యక్తం అవుతోంది.