ఆదివారం అర్థరాత్రి మాజీ మంత్రి బండారు ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత
సీఐ ఈశ్వరరావులు భారీ పోలీసు బలగాలతో బండారు నివాసానికి చేరుకోవటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
మరో ఉద్రిక్త వాతావరణం ఏపీలో చోటు చేసుకుంది. అదే పనిగా నోటికి పని చెప్పే మంత్రి రోజా వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో స్పందించిన టీడీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఆదివారం అర్థరాత్రి వేళ.. విశాఖ జిల్లాలోని పరవాడలోని ఆయన ఇంటికి డీఎస్పీ కేవీ సత్యనారాయణ.. సీఐ ఈశ్వరరావులు భారీ పోలీసు బలగాలతో బండారు నివాసానికి చేరుకోవటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అంతేకాదు.. బండారు ఇంటికి వెళ్లే దారిలోని పలు ప్రాంతాల్లో పోలీసులు పెద్ద ఎత్తున మొహరించారు. ఎవరూ రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అర్థరాత్రి వేళ.. బండారు ఇంటి వద్ద ఇంతమంది పోలీసులు రావాల్సిన అవసరం ఏమిటంటే టీడీపీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. తనపై మాజీ మంత్రి బండారు చేసిన వ్యాఖ్యలపై మంత్రి రోజా అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఆయన మాట్లాడిన మాటల్ని రాష్ట్ర మహిళా ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మకు.. డీజీపీకి లేఖ రాశారు.
ఈ ఉదంతంలో కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి ఇంటికి ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత భారీ పోలీసు బలగాలు బండారు నివాసానికి చేరుకోవటంతోపాటు.. ప్రహరీగేట్లు తీసుకొని లోపలకు ప్రవేశించారు. సీఆర్ పీసీ 41ఏ నోటీసులు ఆయనకు జారీ చేసి.. స్టేషన్ కు తీసుకెళ్లాలన్నది పోలీసుల ప్రయత్నంగా చెబుతున్నారు. దీంతో.. బండారు మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆయన నివాసానికి చేరుకునే ప్రయత్నం చేయగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.
మంత్రి రోజా మీద మాజీ మంత్రి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినప్పడు.. అందుకు ప్రతిగా చట్టపరమైన చర్యలు తీసుకోవటం తప్పు లేదు. కాకుంటే.. అర్థరాత్రి వేళ హైడ్రామా కారణంగా అనవసరమైన సానుభూతి లభించేలా పోలీసులు ఎందుకు వ్యవహరిస్తున్నారన్నది ప్రశ్న. ఇలాంటి చర్యలు ప్రభుత్వానికి నెగిటివ్ గా మారతాయన్న విషయాన్ని పాలకులు గుర్తిస్తే మంచిదన్న మాట వినిపిస్తోంది.